కార్మిక కుటుంబాల ఆత్మబంధువు

Nov 26 2021 @ 00:26AM

స్వతంత్ర కార్మికసంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐటియు) వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా, ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కార్మికపోరాటాల నిర్మాత, ఉత్తమ కమ్యూనిస్టు యోధుడు వుప్పులూరి సుబ్బారావు (1924– 1998) ఆంధ్ర కార్మిక లోకానికి చిరపరిచితులే. ఆర్టీసీలో ఎన్‌.ఎంయు ఉమ్మడి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన అనేక కార్మికపోరాటాలకు నాయకత్వం వహించారు. రాజమండ్రి పేపరుమిల్లు, పిఠాపురం పంచదారమిల్లు, గోదావరి ఫెర్టిలైజర్స్, ఫుడ్స్ ఫ్యాట్స్ (ఎడిబుల్ ఆయిల్), పరిశ్రమలో, ప్రైవేట్ రవాణారంగంలో మొదలగు పరిశ్రమలలో మరపురాని కార్మికపోరాటాలను నిర్మించారు. కార్మిక-కర్షక విప్లవం ద్వారా ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం, సమసమాజం సాధించాలన్న లక్ష్యసాధనకు అనుగుణంగా కార్మికోద్యమాన్ని మలచాలన్న కృషికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. 


యువకుడిగా ఉన్నప్పుడే వుప్పులూరి కమ్యూనిస్టు పార్టీలో చేరి ఆ సిద్ధాంతాలను లోతుగా వంటబట్టించుకున్నారు. స్వస్థలం పిఠాపురం ప్రాంతంలో జమీందారీ వ్యతిరేక రైతాంగపోరాటాలలో చురుకుగా పాల్గొన్నారు. ‘ప్రకాశం ఆర్డినెన్స్’ కాలం (1948–51)లో కమ్యూనిస్టులను పట్టుకుని కాల్చిచంపే విధానాలను ఎదుర్కొంటూ, రహస్య జీవితాన్ని గడుపుతూ ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. పార్టీ విధానాలలో భాగంగా పిఠాపురం దళిత పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం ఆ కుటుంబాలు మరచిపోలేని విధంగా పోరాడారు. తండ్రిని, బ్రాహ్మణ కుల కట్టుబాట్లను ధిక్కరించి, ఆ కార్మికులతో మమేకమై, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు.


భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మితవాద, అతివాద, అవకాశవాద, వర్గసంకర విధానాలను వుప్పులూరి బలంగా వ్యతిరేకించారు. ప్రజావిప్లవపంథాను సమర్థించారు. 1980లలో సిపిఎం నుంచి బయటకు వచ్చి, స్వతంత్ర కార్మికసంఘాల సమాఖ్య- ఎఫ్‌ఐటియును స్థాపించారు. ఆ సంస్థ ముఖ్యనాయకుడిగా స్వతంత్రంగా ఎన్నో విశిష్టమైన కార్మికపోరాటాలను నడిపి, వేలాది కార్మిక కుటుంబాల నుంచి ‘గురువు’గారుగా గౌరవాభిమానాలను పొందారు. ‘ఉమ్మడి నెగోషియేటింగ్ కమిటీ’ వంటి ప్రయోగాలతో విభిన్న కార్మికసంఘాలకు, కేటగిరీలకు, కులాలకు చెందిన వందలాది కార్మికులను ఒకే పోరాటశక్తిగా ఐక్యం చేసి, పోరాడించి, కార్మికులకు అనేక హక్కులు, విజయాలు సాధించారు. ముఖ్యంగా క్యాజువల్, కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం ప్రత్యేక శ్రద్ధతో పోరాడడం, వారికీ రెగ్యులర్‌ కార్మికులకు మధ్య పోరాటఐక్యతను సాధించడం ఒక విధానంగా పాటించారు. సిపిఐ(ఎంఎల్) -లిబరేషన్ పార్టీలో కొంతకాలం (1989–1992) పనిచేశారు. ఐపిఎఫ్, ఎఐసిసిటియు సంస్థల అఖిలభారత అధ్యక్షుడిగా ప్రశంసనీయమైన సేవలందించారు. అయితే దేశంలో జాతుల సమస్యపై విభేదించి, స్నేహపూర్వకంగానే బయటకు వచ్చేశారు. 


కార్మికుల కుటుంబాలే తన కుటుంబంగా, కార్మిక సంఘాల కార్యాలయాలే ఇల్లుగా, కార్మికపోరాటాలే ఊపిరిగా వుప్పులూరి జీవించారు. తమ కోసం ఏమి చేసారన్నది ఆలోచించకుండా, భార్యాబిడ్డలు ఆయన ఉద్యమ జీవితానికి సంపూర్ణ సహకారం అందించారు. వేలాది కార్మికులు అరుణ పతాకాలతో వెంటరాగా సాగిన ఆయన అంతిమయాత్ర కార్మిక, కమ్యూనిస్టు ఉద్యమనేతగా ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పింది. ఆ సందర్భంగా జరిగిన వుప్పులూరి సంస్మరణసభలలో ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి చేసిన ఉపన్యాసాలు ఇప్పటికీ విప్లవస్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నాయి. వుప్పులూరి సుబ్బారావు జీవితం, ఆలోచనలు, కృషి అందిస్తున్న స్ఫూర్తితో దేశంలోని కార్మికుల, వివిధ జాతుల విముక్తి ఉద్యమాలను నిర్మించడమే ఆయనకు నివాళి. 

సిహెచ్.ఎస్.ఎన్.మూర్తి 

ప్రధాన కార్యదర్శి, ఎఫ్ఐటియు

(నేడు వుప్పులూరి సుబ్బారావు జయంతి)


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.