ప్రయాణాలే దెబ్బతీశాయి!

ABN , First Publish Date - 2021-05-07T10:16:54+05:30 IST

పటిష్టమైన బయో బబుల్‌ నీడలో ఉంటూ కూడా క్రికెటర్లు కరోనా బారిన పడడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు.

ప్రయాణాలే దెబ్బతీశాయి!

ఆటగాళ్లకు కరోనాపై బీసీసీఐ చీఫ్‌

నిజమేంటో విచారణలో తేలుతుందన్న గంగూలీ


న్యూఢిల్లీ: పటిష్టమైన బయో బబుల్‌ నీడలో ఉంటూ కూడా క్రికెటర్లు కరోనా బారిన పడడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. ఆరు వేదికల్లో మ్యాచ్‌ల కారణంగా ఆటగాళ్లు ప్రయాణాలు చేయాల్సి రావడం వల్లే బబుల్‌ విచ్ఛిన్నమై ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే నిజానిజాలేమిటో స్పష్టంగా తెలియవని చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీల్లో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ‘బయో బబుల్‌ లోపల ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు. దీని వెనుక గల కారణాలపై పూర్తి విచారణ జరుపుతున్నాం. ఆ తర్వాతే స్పష్టత వస్తుంది. కానీ ఆటగాళ్ల ప్రయాణాలు కూడా ఓ కారణమై ఉండొచ్చు. గతేడాది యూఏఈలో ఆడినప్పుడు మూడు వేదికల్లో అంతా కంట్రోల్‌లోనే ఉంది. అప్పుడు విమాన ప్రయాణాలు లేవు. కానీ ఇక్కడ ఆరు వేదికల్లో మ్యాచ్‌లను పెట్టుకున్నాం. అయినా మేం లీగ్‌ను ఆరంభించినప్పుడు పరిస్థితులు ఇంత ఘోరంగా లేవు.


ముంబైలోనూ జాగ్రత్తగా మ్యాచ్‌లను ముగించాం. ఇప్పుడు దేశంలో వైరస్‌ ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. రేపేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు’ అని దాదా ఆందోళన వ్యక్తం చేశాడు. అలాగే యూఏఈలో బబుల్‌ను నిర్వహించిన రెస్ట్రాటా సంస్థకు భారత్‌లో అనుభవం లేదని, అందుకే ఆ సంస్థను ఎంపిక చేయలేదని చెప్పాడు. మరోవైపు ఆటగాళ్లకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అంటూ ఏమీ లేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు వారికి తగినంత సమయం ఉందని, వారి రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే వేయించుకుంటారని గంగూలీ తెలిపాడు.


సెప్టెంబరులో లీగ్‌!

ప్రస్తుతానికి ఐపీఎల్‌ వాయిదా పడినా తిరిగి ఎప్పుడు ఆరంభించే విషయంలోనూ బీసీసీఐ ఆలోచనల్లో పడింది. అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌ ఉండడంతో అంతకన్నా ముందే.. అంటే సెప్టెంబరు విండోలో మిగిలిన లీగ్‌ను జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉంది. ఇతర బోర్డులతో కూడా చర్చించి టీ20 ప్రపంచక్‌పకన్నా ముందు ఏదైనా విండో అందుబాటులో ఉంటుందో చూడాలని గంగూలీ తెలిపాడు. ఒకవేళ లీగ్‌ను నిర్వహించలేకపోతే రూ.2,500 కోట్ల నష్టం వచ్చే చాన్సుందని దాదా పేర్కొన్నాడు.


టీ20 వరల్డ్‌క్‌పపై ఇప్పుడే చెప్పలేం..

అక్టోబరులో భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌పై మాట్లాడుతూ.. ‘యూఏఈకి తరలించడంపై ఇప్పుడు మాట్లాడితే ఎలా? చాలా సమయం ఉంది. నెల తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో తెలియదు కదా? ఇక ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఎలాంటి మార్పు ఉండదు. భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు వెళ్లాక వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు’ అని గంగూలీ వివరించాడు.

Updated Date - 2021-05-07T10:16:54+05:30 IST