ఉండేనా.. ఊడేనా?

Dec 8 2021 @ 03:38AM

  • రహానె, పుజార, ఇషాంత్‌ బెర్త్‌లకు ఎసరు
  • దక్షిణాఫ్రికా టూర్‌కు యువ ఆటగాళ్లతో పోటీ


అజింక్యా రహానె.. చటేశ్వర్‌ పుజార.. ఇషాంత్‌ శర్మ.. దశాబ్ద కాలంగా భారత టెస్టు జట్టులో అత్యంత కీలక సభ్యులు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. యువ ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికపై దూసుకువస్తూ.. వెటరన్స్‌కు సవాల్‌ విసురుతున్నారు. ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ఈ త్రయానికి ఇప్పుడు జట్టులో స్థానం కూడా సందేహంగా మారింది. అందుకే రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో వీరికి బెర్త్‌ దక్కేనా.. లేక ఆఖరి అవకాశమిస్తారా? నేడు తేలనుంది. (ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప విజేత న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీ్‌సను భారత్‌ 1-0తో ఘనంగా ముగించింది. ఈ విజయంలో మాత్రం రహానె, పుజార, ఇషాంత్‌ల పాత్ర దాదాపుగా లేదనే చెప్పవచ్చు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజార కాసేపు క్రీజులో నిలవగలిగాడు. ఇక రహానె, ఇషాంత్‌లను విశ్రాంతి పేరిట ఆ మ్యాచ్‌లో పక్కకు తప్పించారు. ఈనేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన కోసం వెళ్లే భారత జట్టులో ఈ ముగ్గురి పాత్ర ఏమేరకు ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కివీ్‌సతో తొలి టెస్టుకు కోహ్లీ దూరం కాగా రోహిత్‌, రాహుల్‌, పంత్‌, బుమ్రా, షమి మొత్తం సిరీ్‌సలోనే ఆడలేదు. అయినా రిజర్వ్‌ బెంచ్‌ సత్తాతోనే జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. కానీ అత్యంత కీలక ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న రహానె, పుజార, ఇషాంత్‌ మాత్రం విఫలమయ్యారు. అటు దక్కిన అవకాశాన్ని మయాంక్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు రెండు చేతులా అందిపుచ్చుకుని శభాష్‌ అనిపించుకున్నారు.


కుర్రాళ్లతో తీవ్రపోటీ

దశాబ్ద కాలంగా భారత మిడిలార్డర్‌ రహానె, పుజారతో పటిష్టంగా కనిపించింది. ఇద్దరూ కలిసి 171 టెస్టుల్లో 11,384 పరుగులు చేయగా ఇందులో 30 శతకాలున్నాయి. ముఖ్యంగా విదేశీ గడ్డపై టాపార్డర్‌ త్వరగా అవుటైనా ఈ ఇద్దరూ జట్టును కాపాడిని సందర్భాలెన్నో. కానీ అదంతా ఇప్పుడు గతమే అయ్యింది. ఏడాదిన్నర కాలంగా ఈ జోడీ నుంచి అద్భుతాలేమీ లేవు. గత 42 ఇన్నింగ్స్‌లో పుజార బ్యాట్‌ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. అటు రహానె చివరి శతకాన్ని 2020, డిసెంబరులో సాధించాడు. తన చివరి 16 టెస్టుల్లోనైతే 24.39 సగటుతో దారుణంగా నిరాశపరుస్తున్నాడు. అటు యువ ఆటగాడు శ్రేయాస్‌ అరంగేట్ర టెస్టులోనే శతకం, అర్ధశతకం చేసి మిడిలార్డర్‌లో పాతుకుపోయాడు. మయాంక్‌ కూడా రెండో టెస్టులో ఇదే ఫీట్‌తో సత్తా నిరూపించుకున్నాడు. కివీ్‌సతో సిరీ్‌సలో ఓపెనింగ్‌ చేసిన గిల్‌ను కూడా మిడిలార్డర్‌లో ఉపయోగించుకునేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సిద్ధంగానే ఉంది.


ఇక బౌలింగ్‌లో ఇషాంత్‌ వికెట్లు తీయడంలో తడబడుతుండగా.. అటు పేసర్‌ సిరాజ్‌ తన వైవిధ్యమైన బంతులతో దూసుకువస్తున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా టూర్‌కు రోహిత్‌, రాహుల్‌, పంత్‌, షమి, బుమ్రా అందుబాటులో ఉంటారు. ఈనేపథ్యంలో మెరుగ్గా రాణించిన గిల్‌, అయ్యర్‌, మయాంక్‌లను పక్కనబెడుతారని ఊహించలేం. దీంతో విఫలమవుతున్న రహానె, పుజార, ఇషాంత్‌లపై వేటు ఖాయంగానే కనిపిస్తోంది. లేక విదేశీ గడ్డపై అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే చివరిసారిగా వీరికి మరో అవకాశాన్నిచ్చే విషయాన్ని కూడా తోసిపుచ్చలేము.

టీమిండియా ఎంపిక నేడు 

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం నేడు (బుధవారం) భారత జట్టును ప్రకటించనున్నారు. ఆ దేశంలో కొత్త వైరస్‌ నేపథ్యంలో 22 మందితో కూడిన జంబో బృందాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇందులో ఐదుగురు రిజర్వ్‌ ఆటగాళ్లు ఉంటారని సమాచారం. దీంతోపాటు రహానె, ఇషాంత్‌ బెర్త్‌లపై కూడా స్పష్టత రానుంది. ఒకవేళ రహానె జట్టులో ఉన్నా వైస్‌కెప్టెన్సీ మాత్రం కోల్పోయే అవకాశం ఉందని, రోహిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించవచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి. మిడిలార్డర్‌లో శ్రేయాస్‌, గిల్‌, విహారి పోటీలో ఉండగా.. పుజారకు బ్యాకప్‌గా అభిమన్యు ఈశ్వరన్‌, ప్రియాంక్‌ పాంచల్‌లలో ఒకరికి చోటు దక్కవచ్చు. ఇక బుమ్రా, షమి, ఉమేశ్‌కు తోడుగా పేసర్లు ప్రసిద్ధ్‌ క్రిష్ణ, అవేశ్‌ ఖాన్‌లకు పిలుపు అందవచ్చు. 


సఫారీల జట్టు ఇదే..

జొహాన్నెస్‌బర్గ్‌: భారత్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా 21 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. పేసర్‌ డువానె ఒలివీర్‌కు మూడేళ్ల తర్వాత పిలుపందగా.. అలాగే సీమర్‌ సిసాండ మగల, టాపార్డర్‌ బ్యాటర్‌ రియాన్‌ రికెల్టన్‌ తొలిసారిగా జట్టులో చోటు దక్కించుకున్నారు. 

జట్టు: ఎల్గర్‌ (కెప్టెన్‌), బవుమా, డికాక్‌, రబాడ, వాన్‌డర్‌ డుస్సెన్‌, హెన్‌డ్రిక్స్‌, నోకియా, పీటర్సన్‌, కేశవ్‌ మహరాజ్‌, ఎన్‌గిడి, మార్‌క్రమ్‌, లిండే, ముల్డర్‌, ఎర్వీ, వెరెనె, జాన్సెన్‌, ఒలివీర్‌, స్టుర్మన్‌, సుబ్రయెన్‌, మగల, రికెల్టన్‌.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.