కమలా హారిస్‌ను చంపేస్తానని బెదిరించిన నర్సు అరెస్ట్

ABN , First Publish Date - 2021-04-18T03:32:30+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేస్తానని బెదిరించిన ఫ్లోరిడాకు చెందిన 39 ఏళ్ల నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు.

కమలా హారిస్‌ను చంపేస్తానని బెదిరించిన నర్సు అరెస్ట్

హ్యూస్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేస్తానని బెదిరించిన ఫ్లోరిడాకు చెందిన 39 ఏళ్ల నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సంతతికి చెందిన 56 ఏళ్ల కమలా హారిస్ గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించారు. ఫలితంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి దక్షిణాసియా అమెరికన్‌గా రికార్డులకెక్కారు. హారిస్‌ను చంపుతానని, శారీరక దాడికి పాల్పడతానంటూ ఫ్లోరిడాకు చెందిన నివియానె పెటిట్ ఫెల్ప్స్ ఉద్దేశపూర్వకంగా పదేపదే బెదిరింపులకు గురిచేసింది. ఆమెను అదుపులోకి తీసుకున్న యూఎస్ సీక్రెట్ సర్వీస్ విచారణ అనంతరం అరెస్ట్ చేసింది. 


ఫెల్ప్స్ 2001 నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్స్‌లో పనిచేస్తోంది. జైలులో ఉన్న తన భర్తకు ఫెల్ప్స్ జేపే (ఖైదీలతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అనుమతించే కంప్యూటర్ అప్లికేషన్) ద్వారా పలు వీడియోలు పంపింది. అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్‌ తదితరులపై ద్వేషంతో ఊగిపోతుండడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది. అంతేకాదు, కమలను చంపుతానని ఫెల్ప్స్ మరో వీడియోలో చెప్పుకొచ్చింది.  ‘‘కమలా హారిస్ నువ్వు చనిపోబోతున్నావు. నీ రోజులు దగ్గరపడ్డాయి’’ అని ఇంకో వీడియోలో హెచ్చరించింది. 


ఫిబ్రవరి 18న పంపిన మరో వీడియోలో.. ‘‘నేను తుపాకి రేంజ్‌లోకి వెళ్లబోతున్నా. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నువ్వు చనిపోబోతున్నావ్. రాసిపెట్టుకో. ఈ రోజుకు సరిగ్గా 50 రోజులు’’ అని పేర్కొంది. దర్యాప్తు అధికారులు ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఓ ఫొటోలో ఫెల్ప్స్ షూటింగ్ రేంజ్‌లో తుపాకి పట్టుకుని నవ్వుతూ కనిపించింది. ఫిబ్రవరిలోనే ఆమె ఆయుధ లైసెన్స్ తీసుకుంది.  

Updated Date - 2021-04-18T03:32:30+05:30 IST