దక్షిణ మధ్య రైల్వే Record..

ABN , First Publish Date - 2022-05-05T19:54:55+05:30 IST

దక్షిణ మధ్య రైల్వే రికార్డులు సృష్టిస్తోంది...

దక్షిణ మధ్య రైల్వే Record..

  • ఏప్రిల్‌లో 10.49 మిలియన్‌ టన్నుల రవాణా
  • ప్రయాణికుల ద్వారా రూ.370.5 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌ : దక్షిణ మధ్య రైల్వే రికార్డులు సృష్టిస్తోంది. గడచిన ఏప్రిల్‌లో రికార్డు (Record) స్థాయిలో 10.495 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసింది. రైళ్లను పునరుద్ధరించడంతో ప్రయాణికుల ద్వారా రూ.370.5 కోట్ల ఆదాయాన్ని పొందింది. వినూత్న విధానాలను ప్రవేశపెట్టడంతో అత్యధికంగా సరుకు రవాణా చేయగలిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సగటున రోజుకు 5,337 వ్యాగన్లను సరఫరా చేశామని, గతేడాది కంటే ఈసారి 10 శాతం అధికంగా వ్యాగన్లను వినియోగించినట్టు తెలిపారు. జోన్‌లో 5.273 మిలియన్‌ టన్నుల బొగ్గు లోడింగ్‌ చేసినట్టు చెప్పారు. 


సిమెంట్‌ 3.016 మిలియన్‌ టన్నులు, ఆహారధాన్యాలు 0.400 మిలియన్‌ టన్నులు, ఎరువులు 0.558 మిలియన్‌ టన్నులు, కంటైనర్లు 0.185 మిలియన్‌ టన్నులు, ఇతర సరుకులు 1.063 మిలియన్‌ టన్నుల వరకు లోడింగ్‌ చేసినట్టు వివరించారు. కొవిడ్‌ మహమ్మారితో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆచరణాత్మక ప్రణాళికలతో కొవిడ్‌ ముందు స్థాయికి ప్రయాణికుల రైళ్ల సేవలను పునరుద్ధరించినట్టు తెలిపారు.


కోచింగ్‌ రైలు సర్వీసులు కొవిడ్‌ ముందటి సాధారణ స్థితికి చేరుకునేలా ఏప్రిల్‌లో 17 ప్యాసింజర్‌ రైలు సర్వీసులను తిరిగి ప్రవేశపెట్టినట్టు చెప్పారు. వేసవి రద్దీని తీర్చడానికి నడుపుతున్న వేసవి ప్రత్యేక రైలు సర్వీసులకు(252 ట్రిప్పులు)తోడు 7 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడపడం ద్వారా ఆదాయ లక్ష్యానికి చేరువైనట్టు తెలిపారు. ఏప్రిల్‌లో సరుకు రవాణా, ప్రయాణికుల ఆదాయంలో రికార్డు (Record) నమోదు చేయడానికి కృషి చేసిన జోనల్‌ బృందానికి  రైల్వేజోన్‌ ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందనలు తెలిపారు.



Read more