దక్షిణాది సెంటిమెంట్‌!

ABN , First Publish Date - 2022-06-13T08:06:14+05:30 IST

జాతీయ స్థాయికి పార్టీని విస్తరించే క్రమంలో కూడా కేసీఆర్‌ సెంటిమెంటునే ప్రధాన అస్త్రంగా ప్రయోగించనున్నారా!? ఈసారి దక్షిణాది..

దక్షిణాది సెంటిమెంట్‌!

మోదీ పాలనలో జరిగిన అన్యాయంపై గళం

పార్టీ విస్తరణకూ ఐదు రాష్ట్రాలపైనే ప్రధానంగా గురి

బీఆర్‌ఎస్‌కు జాతీయ రోడ్‌మ్యాప్‌పై కేసీఆర్‌ కసరత్తు

ఎన్టీఆర్‌, పీవీ నరసింహారావు బొమ్మలతో ముందుకు

పీకే, ఉండవల్లితో ప్రగతి భవన్లో సుదీర్ఘ మంతనాలు

జాతీయ పార్టీగా మార్చే సాంకేతిక అంశాలపై చర్చ

ఏ రాష్ట్రంలో ఏ అంశాలతో ముందుకెళ్లాలని మథనం

ఈ నెల 20 తర్వాత సీఎం కేసీఆర్‌ కార్యాచరణ

తమిళనాట సినీ ప్రముఖులకు బాధ్యతల యోచన

రాష్ట్రపతి ఎన్నికలు, సర్వేలపైనా సమాలోచనలు


హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయికి పార్టీని విస్తరించే క్రమంలో కూడా కేసీఆర్‌ సెంటిమెంటునే ప్రధాన అస్త్రంగా ప్రయోగించనున్నారా!? ఈసారి దక్షిణాది సెంటిమెంటును గురి పెట్టనున్నారా!? మోదీ పాలనలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై గళమెత్తనున్నారా!? తన పార్టీ విస్తరణకు కూడా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలనే ఎంచుకోనున్నారా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. ఈ మేరకు పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌లతో ఆదివారం ప్రగతి భవన్లో సుదీర్ఘంగా చర్చించారు.


నిజానికి, వారం రోజుల కిందట ఉండవల్లికి కేసీఆర్‌ ఫోన్‌ చేసి.. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనను కలవాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌ వచ్చిన ఉండవల్లి తాను నగరానికి వచ్చానంటూ కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో కేసీఆర్‌ ఆయన్ను భోజనానికి ఆహ్వానించారు. ప్రగతి భవన్‌లో భోజన సమయంలోనే.. జాతీయ రాజకీయాలపై ఆయన చర్చించారు. అనంతరం, పీకే, ఉండవల్లి, సీఎం కేసీఆర్‌ కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. ఇదే సమావేశంలో మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రధానంగా పీకే, ఉండవల్లిలకు కేసీఆర్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఏర్పాటుపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ విధానం కింద దక్షిణాది సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దక్షిణాది రాష్ట్రాలకు మోదీ పాలనలో జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకెళ్లాలని చర్చించినట్లు సమాచారం. తెలంగాణ వంటి సంపన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి పెద్దఎత్తున నిధులు ఇస్తున్నాయని, కానీ, కేంద్రం నుంచి అదే స్థాయిలో సహకారం లేదని ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించాలని సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఇక, జాతీయ స్థాయికి పార్టీ విస్తరణకు ఎన్టీఆర్‌, పీవీ నరసింహారావు బొమ్మలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని, పీవీకి కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని ప్రధానంగా ఎలుగెత్తాలని నిర్ణయించినట్లు తెలిసింది.


పార్టీని జాతీయ స్థాయికి విస్తరించడం ఎలా!? ఏయే రాష్ట్రాల్లో ఏయే అంశాలను ప్రధానంగా తీసుకోవాలి!? పార్టీ విస్తరణకు రోడ్‌ మ్యాప్‌ ఏమిటి!? తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ విధానం, జెండా, అజెండా తదితరాలపైనా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇక, టీఆర్‌ఎ్‌సను జాతీయ పార్టీగా మార్చే అంశంపై కీలక చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చడంలో తలెత్తే సాంకేతిక అంశాలపై చర్చించడంతోపాటు దీనిపై ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాలని, పార్టీకి కామన్‌ సింబల్‌గా కారు గుర్తునే కొనసాగించాలని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ విధి విధానాలు, జెండా, ఎజెండా రూపకల్పనతోపాటు.. దేశంలోని ఏయే రాష్ట్రాల్లో ఏయే అంశాల ప్రాతిపదికగా పార్టీని విస్తరించాలన్న అంశంపైనా చర్చించినట్లు సమాచారం. తమిళనాడులో సినీ ప్రముఖులకు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.


మొత్తంగా జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ విస్తరణకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌పై చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈనెల 19వ తేదీన పార్టీ కార్యవర్గ భేటీ తర్వాత పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత, అంటే, ఈనెల 20వ తేదీ తర్వాత ఇందుకు సంబంధించిన కార్యాచరణను కేసీఆర్‌ చేపట్టనున్నట్లు తెలిసింది. అలాగే, ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశంపైనా పీకేతో చర్చించినట్లు తెలిసింది. పీకే మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉంటారని, ఆయనతో కేసీఆర్‌ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. కాగా, మరో 15 రోజుల్లో ఇంకోసారి భేటీ కావాలని ఉండవల్లిని కేసీఆర్‌ కోరినట్లు సమాచారం. తాను కేసీఆర్‌తో భేటీ కావడం వాస్తవమేనని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి స్పష్టం చేశారు. తమ మధ్య జాతీయ రాజకీయాలపైనే అత్యధికంగా చర్చ జరిగిందని, మరో 15 రోజుల్లో తాము మళ్లీ కలుస్తామని పేర్కొన్నారు.


రాష్ట్రపతి ఎన్నికలపైనా చర్చ..

ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీలో భాగంగా త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అంశంపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఢిల్లీలో విపక్షాల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ సమావేశానికి రావాలంటూ కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది. అయితే ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ వ్యతిరేక వైఖరి తీసుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీకీ ఆహ్వానం ఉన్న ఆ సమావేశానికి టీఆర్‌ఎస్‌ తన ప్రతినిధిని పంపుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరిస్తే పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లేనని ఇప్పటికే కాంగ్రెస్‌ నేతల నుంచి స్టేట్‌మెంట్లు వస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు ఇస్తే.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేనన్న విమర్శలు బీజేపీ నుంచి ఎదుర్కొనాల్సి వస్తుంది.


ఈ నేపథ్యంలో ఏవైఖరి తీసుకోవాలన్న చర్చ కేసీఆర్‌, పీకే భేటీలో జరిగినట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్సేతర వ్యక్తిని  ప్రతిపక్షాల అభ్యర్థిగా నిర్ణయిస్తే మద్దతిచ్చినా వచ్చే అభ్యంతరం ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ పేరు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ కూడా ఇప్పటికే పవార్‌ను కలిసి ఈ అంశంపై చర్చించినందున.. ఆయనకు మద్దతిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు, వారికి నియోజకవర్గ ప్రజల్లో ఉన్న పలుకుబడి వంటి అంశాలపై పీకే బృందం నిర్వహించిన సర్వేల నివేదికలపైనా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.


బీఆర్‌ఎస్‌కు మా సంపూర్ణ మద్దతు

దేశగతిని కేసీఆర్‌ మార్చగలరు: ఎన్‌ఆర్‌ఐలు

సీఎం కేసీఆర్‌ దేశగతిని మార్చగలరని టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల అన్నారు. ఆదివారం ఆయన నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన వివిధ రాష్ట్రాల ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా... జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ నాయకత్వం అవసరమని పేర్కొంటూ మహేశ్‌ బిగాల ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎన్‌ఆర్‌ఐలంతా ఏకగీవ్ర ఆమోదం తెలిపారు. ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. భారత రాష్ట్ర సమితికి ఎన్‌ఆర్‌ఐల నుంచి సంపూర్ణ మద్దతు లభించినట్లు కోఆర్డినేటర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న సింగిల్‌ విండో పారిశ్రామిక విధానం దేశమంతా అమలుకావాలని, దేశం ఫెడరల్‌ స్పూర్తితో ముందుకెళ్లాలని...  కేసీఆర్‌ నాయకత్వంలోనే ఇవి సాధ్యమని మహేశ్‌ అన్నారు.  బీఆర్‌ఎస్‌ ప్రతిపాదనకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ విభాగాలతోపాటు పలు దేశాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు సంపూర్ణ మద్దతు తెలిపారని సీఎం కార్యాలయం పేర్కొంది.


హైకోర్టు సీజేతో సీఎం భేటీ

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని సీజే నివాసానికి వెళ్లిన సీఎం సుమారు 40 నిమిషాలపాటు ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇటీవల బదిలీ అయిన సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ త్వరలో రిలీవ్‌ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను సీఎం కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిసినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ స్థానంలో కొత్త సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Updated Date - 2022-06-13T08:06:14+05:30 IST