మహాగాయకుడా మళ్లెప్పుడొస్తావ్

ABN , First Publish Date - 2020-09-26T06:08:04+05:30 IST

పాట పర్వతంలా నిలబడ్డది భుజాలమీద మోసుకెళ్లే గంధర్వుడికై ఎదురుచూస్తున్నదినది నిండా నీళ్లున్నయి అలలకాళ్లు ఆగిపోయినవి నావికుడి సరిగమల సంగీతధ్వనుల కోసం....

మహాగాయకుడా మళ్లెప్పుడొస్తావ్

పాట పర్వతంలా నిలబడ్డది

భుజాలమీద మోసుకెళ్లే 

గంధర్వుడికై ఎదురుచూస్తున్నది


నది నిండా నీళ్లున్నయి

అలలకాళ్లు ఆగిపోయినవి

నావికుడి 

సరిగమల సంగీతధ్వనుల కోసం


పాటంటే ప్రాణం లేనిదెవరికి?

నరునికైనా 

నదికైనా పాట గుండెతడి


పాట పెదవుల మీద 

పల్లవించడానికి సిద్ధంగా ఉంది

స్వరాలకు పాలు తాపే

సంగీతసముద్రుడు 

అలిసిపోయాడు


విత్తనం మొలకెత్తడానికి 

అమ్మపాట కావాలి

పువ్వులు పరిమళించడానికి

నాన్నపాట కావాలి

నేల మువ్వలతో ఘల్లుఘల్లున మోగడానికి బాలు పాట కావాలి


ఆ గొంతుకలో ఏ భాషైనా పోత పోసిన అన్నమయ్యనే

శంకరాభరణ రాగమంజరులే

రామదాసు కీర్తనలకు 

భద్రగిరి శిఖరాగ్ర స్వరార్చనే


పాట పర్వతంలా నిలబడి ఉంది

భుజాలమీద మోసుకెళ్లే

గంధర్వుడికై

పాట ఎదురు చూస్తున్నది

మహాగాయకుడా మళెప్పుడొస్తావ్?


– వనపట్ల సుబ్బయ్య

Updated Date - 2020-09-26T06:08:04+05:30 IST