బాలసుబ్రహ్మణ్యం ఔన్నత్యానికి నిదర్శనం ఈ ఘటన..!

Sep 26 2020 @ 11:04AM

స్వర చక్రవర్తి! అమృత కంఠుడు! అమర గాయకుడు! ఆయనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం! మన ఎస్పీ బాలు! ఏడు దశాబ్దాలు దాటిన ఆయన పాడుతుంటే ఇప్పటికీ ఎవరో కుర్రాడు పాడుతున్నట్లే! పాటలోనూ చిరునవ్వులోనూ చరుకుదనంలోనూ వయసు తెలియలేదు సుమీ! 16 భాషల్లో 37 వేల పాటలు పాడినా.. ఇంకా గానామృతమేదో మిగిలి ఉన్నట్లే! బాల్యం.. యవ్వనం.. కౌమారం.. వృద్ధాప్యం.. ఆ పాటతోనే మమేకం! గ్రామఫోన్‌ రికార్డు నుంచి సెల్‌ఫోన్‌ వరకూ ఏది చూసినా పాటల తోటే! ఆ పాట లేని చోటెక్కడ! ఆ పాట లేని ఇల్లెక్కడ!? ఆయన గాయకుడు.. సంగీత దర్శకుడు! నటుడు! నిర్మాత! ఒకే వ్యక్తి జీవితంలో ఇంత వైవిధ్యం సాధ్యమా అని ఆశ్చర్యపోయేలా ఎన్నో విభిన్న పాత్రలు! ఒక మనిషి తన జీవిత కాలంలో ఇన్ని పనులు చేయగలడా అని ఆశ్చర్యపోయేలా చేసిన మూర్తీభవించిన అద్భుతం బాలు! ఇప్పుడు ఆ పాటొక జ్ఞాపకం!


అయితే ఆయన జ్ఞాపకాలలో మరో ఆశ్చర్యకర ఘటన కూడా ఉంది. ఎంతో గొప్పకీర్తి కలిగిన ఎస్పీ బాలు.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావిగా గుర్తింపు పొందారు. ఆ స్వభావానికి నిదర్శనంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. అది చూసిన వారంతా బాలు ఎంత గొప్ప వ్యక్తి అని కీర్తించక మానరు అంటే అతిశయోక్తి కాదు.


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓసారి అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లారు. అక్కడ చినపాదం నుంచి ఎవరైనా సరే నడుచుకుంటూ దేవుడి దర్శనానికి వెళ్లాల్సిందే. అలా నడవలేని వారి కోసం అక్కడ డోలి అందుబాటులో ఉంటుంది. అయితే బాలు స్థూలకాయుడు కావడంతో అంతదూరం నడిచే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే బాలు కూడా డోలి ద్వారా అయ్యప్ప సన్నిధికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే డోలీ ఎక్కే ముందు బాలు చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డోలీ మోసే కూలీల కాళ్లకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాదాభివందనం చేశారు. దీంతో అది చూసిన వారంతా అవక్కాయ్యారు. అలా ఎందుకు చేశారా అని ఆరా తీస్తే.. బాలు ఔన్నత్యం మరోసారి బయటపడింది. తనకు స్వామివారి దర్శనం చేయిస్తున్న నిజమైన పూజారులు వాళ్లే అని ఆయన భావన అట. అందుకే వారి కాళ్లకు బాలు నమస్కరించారట. ఇప్పుడు ఆయన పరమపదించిన క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు నాటి ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.