ఆస్పత్రి బిల్లుల కోసం యాచించలేదు

ABN , First Publish Date - 2020-09-29T08:15:45+05:30 IST

దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లుల కోసం తాము ఎవరినీ యాచించలేదని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ స్పష్టం చేశారు...

ఆస్పత్రి బిల్లుల కోసం యాచించలేదు

  • ఎస్పీబీ తనయుడు చరణ్‌ 

చెన్నై, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లుల కోసం తాము ఎవరినీ యాచించలేదని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఎంజీఎం ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక తాము అవస్థలు పడ్డామని, బిల్లులు చెల్లించాలంటూ తమిళనాడు ప్రభుత్వా న్ని అడిగామని, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయకుడి కుమార్తె బిల్లులు చెల్లించేందుకు వచ్చారం టూ ఆదివారం కొన్ని ప్రసార మాధ్యమాల్లో వెలువడిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.


పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో తండ్రి మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి నిర్వాహకులు నిరాకరించినట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. ఆగస్టు 5న తన తండ్రి బాలు కరోనాతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచీ.. తాము బీమా పథకం కింద ఆస్పత్రికి బిల్లులు చెల్లిస్తూ వచ్చామని, బిల్లుల చెల్లింపులో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని తెలిపారు. ఆయన చనిపోయే సమయానికి కొంతమేర ఉన్న బిల్లులు కూడా చెల్లించేందుకు తాము సిద్ధమైనప్పుడు ఆస్పత్రి నిర్వాహకులు వద్దని చెప్పి.. మృతదేహాన్ని భద్రంగా అప్పగించారని పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రేమాభిమానాలు కలిగిన తన తండ్రి మృతితో తామంతా తీవ్రమైన దిగులు చెందుతున్న  వేళ ఆస్పత్రి బిల్లులు చెల్లించలేదంటూ వచ్చిన తప్పుడు వార్తలు ఎంతో బాధించాయని చరణ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన తండ్రికి భారతరత్న ప్రకటిస్తే సంతోషమేనని చరణ్‌ తెలిపారు.  


భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్‌

ఇటీవల మృతిచెందిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.


Updated Date - 2020-09-29T08:15:45+05:30 IST