ఏసుదాసు మాట తీసుకున్నా.. అంత శక్తిలేదని చెప్పిన బాలు

Sep 26 2020 @ 22:34PM

కె.జె. ఏసుదాస్‌, ఎస్‌. పి. బాలు.. ఇద్దరూ ఇద్దరే. లెజెండ్స్‌ . వీరిద్దరితో పాటు చిత్రమ్మ కూడా కలిస్తే.. ఇక ఆ కాంబినేషన్‌ని ఊహించడం సాధ్యమా? సాధ్యం చేశారు ఎస్‌.పి.బాలు. వారితో కలిసి ఆయన మ్యూజిక్‌ కన్సర్ట్ నిర్వహించారు. అదీ కూడా తెలుగులో. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో రీసెంట్‌గానే ఈ మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది. అయితే ఈ కచేరికి ముందు దీని విశేషాలను తెలిపేందుకు ఎస్‌. పి. బాలు ఓ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో కచేరి గురించే కాకుండా ఎన్నో విషయాలను తెలియజేశారు. మరీ ముఖ్యంగా ఏసుదాసు ఆయన దగ్గర మాట తీసుకున్నా.. అంత శక్తి లేదని తాను చెప్పిన సందర్భాన్ని బాలు తెలిపారు.

బాలు మాట్లాడుతూ.. ''అన్నయ్య ఏసుదాసు దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ప్రపంచంలో రెండు గాత్రాలు ఒకేలా ఉండవు. రెండు పాడే పద్ధతులు ఒకేలా ఉండవు. మా ఇద్దరిలో ఉన్న ఒకే ఒక పద్ధతి ఏమిటంటే.. మే మిద్దరం సినిమాకి పాటలు పాడుతున్నాం. నేను లెజెండ్‌ అని అంటున్నారు. ఆయన బ్రహ్మాండమైన లెజెండ్‌. కారణం ఏమిటంటే.. నాకు సినిమాలకు మాత్రమే పాడగలిగే పరిజ్ఞానం ఉంది. ఆయన సంప్రదాయ సంగీతాన్ని ఔపోసన పట్టి, మనో ధర్మంతో వేదిక మీద నాలుగు గంటల పాటు మన సంప్రదాయ సంగీత కచేరి చేసేటటువంటి ప్రజ్ఞాపాటవాలున్నాయి. అది నా దగ్గర లేదు. ఆయన ఎన్నో సార్లు నన్ను ఆహ్వానించారు. నా దగ్గరకి రా.. నీకు నేనే నేర్పిస్తాను. ఇద్దరం కలిపి తిరువయ్యార్‌లో కచేరి చేద్దామని. ఆ ధైర్యం నాకింత వరకు రాలేదు. పబ్లిక్‌ ఫంక్షన్‌లో మద్రాస్‌లో నా చేత మాట తీసుకున్నారు. చేతిలోకి చేయి తీసుకుని.. 'చెప్పు.. వచ్చే జనవరికి నాతో కలిసి పాడతానని..'. అంత శక్తి లేదని నాకు తెలుసు. ఆయన ఎదురుగా కాదు అని చెప్పలేను. ఆయనకున్న జ్ఞానంలో నాకు పదోవంతు ఉంది.." అని చెప్పుకొచ్చారు. ఒక లెజెండ్‌ మరో లెజెండ్‌ గురించి చెబుతుంటే.. ఎంత హాయిగా ఉంటుందో.. ఈ వీడియోలో మీరూ చూసి ఆ అనుభూతి పొందవచ్చు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.