150 ఎకరాల కబ్జాకు వైసీపీ యత్నం

ABN , First Publish Date - 2021-10-26T05:49:02+05:30 IST

నిజాంపట్నం మండలం కొత్తపాలెంలోని వన సంరక్షణ సమితికి చెందిన 150 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు నాగిడి విజయలక్ష్మి, వెంకటరమణలతో కలిసి బాధితులు సోమవారం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

150 ఎకరాల కబ్జాకు వైసీపీ యత్నం
రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు జంగాల అజయ్‌, మాల్యాద్రి, బాధిత మహిళలు విజయలక్ష్మి, వెంకటరమణ

పోలీసుల సహకారంతో అక్రమ మైనింగ్‌

రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు

గుంటూరు, అక్టోబరు 25: నిజాంపట్నం మండలం కొత్తపాలెంలోని వన సంరక్షణ సమితికి చెందిన 150 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు నాగిడి విజయలక్ష్మి, వెంకటరమణలతో కలిసి బాధితులు సోమవారం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సమితి అధ్యక్షుడు వాటుపల్లి వెంకటేశ్వరరావు వైసీపీ నాయకులకు సహకరిస్తున్నారన్నారు. భూములను కబ్జా చేసేందుకు ముందుగా  గ్రావెల్‌ తవ్వకం ప్రారంభించారన్నారు. దీనిని అడ్డుకున్నామని తమను సాంఘిక బహిష్కరణ చేశారని నాగిడి విజయలక్ష్మి, వెంకటరమణ తెలిపారు. గ్రావెల్‌ వాహనాలను అడ్డుకునేందుకు యత్నించగా కొట్టి తరిమేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసుల సహకారంతో ఇప్పటికే లక్షల ఖరీదు చేసే గ్రావెల్‌ను అక్రమంగా తరలించారన్నారు. తమను చంపటానికి ప్రయత్నిస్తున్నారని బాధిత మహిళలు వాపోయారు.  రెండు కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు జంగాల అజయ్‌కుమార్‌, మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. 

గ్రావెల్‌ అమ్ముకున్న వైసీపీ నేతలు

వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో జగనన్న కాలనీ పేరుతో లక్షల ఖరీదు చేసే గ్రావెల్‌ను వైసీపీ నాయకులు అక్రమంగా తరలించారని బలహీనవర్గాల జేఏసీ నాయకులు వైవీ సురేష్‌, గ్రామానికి చెందిన తోట సదాశివరావు తదితరులు అర్బన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రావెల్‌ తరలింపుపై ప్రశ్నించినందుకు తనతోపాటు 11 మందిపై అక్రమ కేసులు బనాయించారని, రౌడీషీట్‌ కూడా తెరిచారని సదాశివరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.   గ్రావెల్‌ అక్రమ తరలింపును గ్రామస్థులు అడ్డుకోగా పోలీసులు 15 రోజులపాటు దగ్గరుండి రూ.50 లక్షల ఖరీదైన గ్రావెల్‌ తరలించేందుకు సహకరించారన్నారు. వట్టిచెరుకూరు ఎస్‌ఐ తమకు ఫోను చేసి బెదిరిస్తున్నారన్నారు.  

సీసీఎస్‌ స్టేషనలో వాహనం మాయం

దొంగ నుంచి రకవరీ చేసిన ద్విచక్ర వాహనం అర్బన సీసీఎస్‌ పోలీస్‌స్టేషనలో మాయమైనట్లు మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన దొండపాటి శివారెడ్డి అర్బన ఎస్పీ కార్యాలయం లో ఫిర్యాదు చేశారు. గుంటూరులోని నందివెలుగు రోడ్డులో పార్కింగ్‌ చేసిన తన వాహనం గత ఏడాది జనవరి 4న చోరీకి గురికాగా పాతగుంటూరు పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదన్నారు. అదే నెల 24న ద్విచక్ర వాహనం దొరికిందని సీసీఎస్‌ పోలీసులు ఫోను చేసి చెప్పగా వెళ్లి చూడగా అక్కడ తన ద్విచక్ర వాహనం గుర్తించినట్లు తెలిపారు. ఆ వాహనం ఇవ్వాలంటే కోర్టు నుంచి ఆర్డర్‌ తెచ్చుకోవాలని అందుకు రూ.40 వేల షూరిటీ కావాలన్నారు.  కరోనా అనంతరం తన సోదరుడు ష్యూరిటీ సరిపోతుందని చెప్పగా కోర్టులో జామీను పత్రాలు అందించామన్నారు. ఈ విషయమై తమ న్యాయవాది పాతగుంటూరు పోలీస్‌స్టేషనకు వెళ్లి అడగ్గా అక్కడ సీఐ గొడవపడి కేసు పెట్టారన్నారు. ఈ విషయం న్యాయవాది మెజిస్ర్టేటు దృష్టికి తీసుకెళ్లగా తమ ద్విచక్ర వాహనం ఇచ్చివేయాలని గత ఏడాది మార్చి 16న మెజిస్ర్టేటు ఆదేశించారన్నారు. లాక్‌డౌన అనంతరం ద్విచక్ర వాహనం కోసం సీసీఎస్‌ స్టేషనకు వెళ్లగా ఈ కేసులో దొంగను తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారని, స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను కూడా అక్కడకు పంపామని చెప్పారన్నారు. దీంతో తాను తాడేపల్లి స్టేషనకు వెళ్లగా ఆ వాహనం తమవద్దకు రాలేదని చెప్పారన్నారు.  కోర్టు నుంచి రిలీజ్‌ ఆర్డర్‌ తీసుకున్నప్పటికీ ద్విచక్రవాహనం ఇవ్వటం లేదన్నారు. ఇంతకీ తన ద్విచక్ర వాహనం ఎక్కడ ఉందో కూడా తెలియటం లేదని శివారెడ్డి వాపోయారు.


Updated Date - 2021-10-26T05:49:02+05:30 IST