గిరిజనులు చావడానికే మావోయిస్టు పార్టీ ఉందా..!

ABN , First Publish Date - 2020-08-08T17:52:52+05:30 IST

మావోస్టుల చర్యలపై విశాఖ రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు నిప్పులు చెరిగారు. పెదబయలు మండలంలో మందుపాతరకు ఇద్దరు గిరిజనులు ప్రాణాలు కోల్పోయినా ఎందుకు పెదవి విప్పరని శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

గిరిజనులు చావడానికే మావోయిస్టు పార్టీ ఉందా..!

పెదబయలు మండలంలో మందుపాతర పేలిన ఘటనపై పెదవి విప్పరేం?

ఈస్టు డివిజన్‌ కార్యదర్శి అరుణ గొంతు మూగబోయిందా...!

రూరల్‌ ఎస్పీ కృష్ణారావు ఘాటు ప్రశ్నలు

 

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి) : మావోస్టుల చర్యలపై విశాఖ రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు నిప్పులు చెరిగారు. పెదబయలు మండలంలో మందుపాతరకు ఇద్దరు గిరిజనులు ప్రాణాలు కోల్పోయినా ఎందుకు పెదవి విప్పరని శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మావోయిస్టులు అమర్చిన మందు పాతరపేలి ఈ నెల రెండో తేదీన చింతలవీధికి చెందిన మోహన్‌రావు, అజయ్‌కుమార్‌ మృతి చెందిన ఘటనపై పలు విషయాలు ప్రజల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్కడ ఏం జరిగినా తమదైన శైలిలో వెంటనే ప్రకటనలు, ఆడియోక్లిప్‌లు విడుదలచేసే ఏజెన్సీ మావోయిస్టులు... ముఖ్యంగా ఈస్టు డివిజన్‌ బాధ్యులు అరుణ ఇద్దరు గిరిజనుల మృతిపై ఎందుకు స్పందించడం లేదని  నిలదీశారు. ఆ.. గొంతులు ఎందుకు  మూగబోయాయు? కలుగులో దాక్కొని ఉలుకూ, పలుకూ లేకుండా ఎందుకున్నారని ప్రశ్నించారు.


‘ఆ ఆదివాసీలవి  ప్రాణాలు కావా.. లేక గిరిజనులు చావడానికే ఉన్నారనుకుంటుందా మావోయిస్టు పార్టీ... అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సాధారణ పౌరులు తిరిగే దారులను తవ్వేసి ‘స్పైక్‌’లు, ల్యాండుమైన్లు పెడుతున్నారని.. వీటి వల్ల అమాయక గిరిజనులు మృత్యువాత పడుతున్నారని వాపోయారు. ఇటువంటి వారి కుటుంబాల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నలు సంధించారు. కరోనా లాంటి కష్టదశలో అమరవీరుల వారోత్సవాల్లో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చి, తిరిగి వారి నుంచి సరుకులు తీసుకున్నారని విమర్శించారు. ఏవోబీఎస్‌జడ్‌సీలో కాల్పుల విరమణ అంటూ మావోయిస్టుల నుంచి ప్రకటన వచ్చిందే తప్ప, దేశంలో మరే ప్రాంతం నుంచి ఇటువంటి ప్రకటన విడుదల కాలేదని పేర్కొన్నారు. కాల్పుల విరమణ ప్రకటన పేరుతో పోలీసుల్ని ఏమార్చి వివిధ గ్రామాల్లో మందు పాతరలు పెట్టడం, స్పైక్‌ గోతులు తవ్వడం వంటివి చేస్తున్నారని విమర్శించారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు నిత్యావసర సరుకులు, మందులు, శానిటైజర్లు, మాస్కులు పోలీసులు పంపిణీ చేశారని వివరించారు.

Updated Date - 2020-08-08T17:52:52+05:30 IST