ఎస్పీ నేతలు నకిలీ సోషలిస్టులు

ABN , First Publish Date - 2022-02-04T05:30:00+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ.. అసాంఘిక శక్తులను ఎన్నికల బరిలోకి దించుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు...

ఎస్పీ నేతలు నకిలీ సోషలిస్టులు

అధికారంలోకి వస్తే పేదలను దోచుకుంటారు

 కేంద్రం నుంచి యోగికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ

 గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నుంచి సీఎం యోగి నామినేషన్‌


లఖ్‌నవ్‌/ఆగ్రా/ప్రయాగ్‌రాజ్‌, ఫిబ్రవరి 4: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ.. అసాంఘిక శక్తులను ఎన్నికల బరిలోకి దించుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అలాంటి నకిలీ సోషలిస్టులు (ఫేక్‌ సమాజ్‌వాదీలు) అధికారంలోకి వస్తే పేదల కోసం కేంద్రం కల్పించే ప్రయోజనాలను దోచుకుంటారని అన్నారు. వారిని అధికారంలోకి రానివ్వొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పశ్చిమ యూపీలోని ఘజియాబాద్‌, మేరట్‌, హాపూర్‌, అలీగఢ్‌, నోయిడా జిల్లాలోని 23 నియోజకవర్గాల్లో బీజేపీ నిర్వహించిన వర్చువల్‌ ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో శాంతిభద్రతలను పకడ్బందీగా అమలు చేసిందని, నేరస్థులపై ఉక్కుపాదం మోపిందని తెలిపారు. ఈ విషయంలో ఆయనకు కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. కాగా.. శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని 14 నియోజకవర్గాల్లో ప్రధాని మోదీతో బీజేపీ నిర్వహించ తలపెట్టిన వర్చువల్‌ ప్రచా రం.. వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయింది. కాగా, యోగి పాలనలో నేరస్థులంతా పోలీ్‌సస్టేషన్లకు పరుగులు పెడు తూ వెళ్లి లొంగిపోయారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ప్రస్తుతం నేరస్థులు జైళ్లలోనో, యూపీ వెలుపలనో ఉన్నారని, లేదంటే సమాజ్‌వాది పార్టీలో ఉన్నారని ఆరోపించారు. శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నియోజవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి అమిత్‌ షా హాజరయ్యారు. కాగా.. ఉత్తరాఖండ్‌లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన నలుగురు నేతలను బీజేపీ నుంచి బహిష్కరించింది. 


యోగిని ఉత్తరాఖండ్‌కు పంపిస్తాం: అఖిలేశ్‌

యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ చరిత్రాత్మక విజయం సాధించబోతోందని ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించి.. సొంతరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు పంపిస్తామని ప్రకటించారు. శుక్రవారం ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్‌ చౌదరితో కలిసి ఆగ్రాలో అఖిలేశ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంఐఎం అధ్యక్షుడు అసుదుద్దీన్‌ ఒవైసీ కాల్పుల ఘటనను అఖిలేశ్‌ ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు పాల్పడటం సరికాదన్నారు.  


పురుషుల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖ: మర్ద్‌ పార్టీ

యూపీలో తాము అధికారంలోకి వస్తే వేధింపులకు గుర య్యే పురుషుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని మేరా అధికార్‌ రాష్ట్రీయ దళ్‌(మర్ద్‌) అనే పార్టీ ప్రకటించింది. కాగా, రెండు రోజుల క్రితం బీజేపీని వీడిన ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ బీఎస్పీలో చేరారు.

Updated Date - 2022-02-04T05:30:00+05:30 IST