మహిళల భద్రతకు పటిష్ట చర్యలు

Sep 17 2021 @ 23:45PM
నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌

- నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, సెప్టెంబరు 17 : మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, పోక్సో కేసుల విచారణ వేగవంతం చేయాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. అత్యాచారం కేసులలో నిందితులకు తప్పకుండా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన నేరాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, విచారణ వేగవంతం చేయాలని చెప్పారు. షీటీం ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తక్కువ సమయంలో నేరాలను ఛేదించాలని ఆదేశించారు. డయల్‌ 100 కాల్స్‌పై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ రంగస్వామి, గద్వాల సీఐ షేక్‌ మహబూబ్‌ బాషా, అలంపూర్‌ సీఐ సూర్యానాయక్‌, శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, పీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ పాల్గొన్నారు. 


Follow Us on: