శభాష్‌ పోలీస్‌..

ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST

జిల్లాలో పోలీసు శాఖలో ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు వివిధ హోదాల్లో 3,613 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. నేరస్తుల పాలిట కఠినంగా వ్యవహరించే పోలీసులు..

శభాష్‌ పోలీస్‌..

ఓ వైపు శాంతి భద్రతలు.. మరో వైపు కొవిడ్‌ విధులు 

కర్ఫ్యూ అమలులో పకడ్బందీ చర్యలు

ఈ క్రమంలో కరోనా బారిన పడుతున్న రక్షకభటులు..

అయినా విధి నిర్వహణలో మేము సైతం అంటూ రోడ్లపైకి

పోలీసుల ఆరోగ్య భద్రతపై ఎస్పీ ప్రత్యేక దృష్టి

(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీసు శాఖలో ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు వివిధ హోదాల్లో 3,613 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. నేరస్తుల పాలిట కఠినంగా వ్యవహరించే పోలీసులు.. కరోనా సమయంలో మానవత్వం మూర్తీభవించిన ఫ్రంట్‌లైన వారియర్స్‌లా సేవలందిస్తున్నారు. ఓ పక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకుంటూ.. మరో పక్క ప్రజల ఆరోగ్య భద్రత కోసం విధి నిర్వహణలో రాణిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కీలక సమయంలో వైర్‌సకు భయపడి ఎందరో ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే.. యుద్ధంలో ముందు వరుసలో ఉండే సైనికుల్లా పోలీసులు కరోనా వైరస్‌ కట్టడి కోసం కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తున్నారు. జనారణ్యంపై పంజా విసిరిన మహమ్మారిని తుద ముట్టించేందుకు రోడ్లపై విధులు నిర్వహిస్తూ శభాష్‌ పోలీసన్నా అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. 


పోలీసుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక చర్యలు

జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడి కోసం అలుపెరుగక పోరాటం చేస్తున్న పోలీసు సిబ్బంది కరోనా బారిన పడితే.. వారి ఆరోగ్య భద్రతకు ఎస్పీ కేకేఎన అన్బురాజన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతిరోజూ మెడిటేషన చేయిస్తున్నారు. ప్రతి పోలీసు కానిస్టేబుల్‌కు మాస్కులు, ఫేస్‌ మాస్కులు, శానిటైజర్‌, థర్మల్‌ స్కానింగ్‌, మెడిసిన కిట్లు వంటి పరికరాలు ముందుగానే అందజేశారు. ఏ కానిస్టేబుల్‌ అయినా కరోనా బారిన పడితే.. వారిని తక్షణమే ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ప్రతి రోజు ఎస్పీ స్వయంగా ఫోన చేసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇంకా మెరుగైన వైద్యం అవసరమనుకుంటే.. హైదరాబాదు, తిరుపతి, కర్నూలు ఆసుపత్రులకు పంపి చికిత్స చేయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.2 లక్షల వరకు తక్షణ సాయం అందిస్తున్నారు. ఎస్పీ తీసుకుంటున్న చర్యలు విధి నిర్వహణలో మరింతగా దూసుకుపోయేలా ఖాకీలను ప్రోత్సహిస్తున్నాయని ఆ శాఖకు చెందిన సిబ్బంది అంటున్నారు. 


కరోనా బారిన పడినా..

కరోనా కట్టడి విధి నిర్వహణలో పనిచేస్తున్న పోలీసులు సైతం వైరస్‌ బారిన పడుతున్నారు. గతేడాది 546 మంది పోలీసులు వైరస్‌ బారిన పడి కోలుకున్నారు. 9 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం వివిధ విభాగాల్లో పనిచేసే పోలీసులు సుమారు 108 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వారికి ఎస్సీ, డీఎస్పీలు మెరుగైన వైద్యసేవలు అందేలా చూస్తున్నారు. 105 మంది ప్రస్తుతం హోం క్వారంటైనలో ఉన్నారు. కరోనా సోకినా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుని కోలుకున్న వెంటనే మళ్లీ విధుల్లోకి వస్తున్నారు. ఫ్రంట్‌లైన వారియర్స్‌గా ఉన్న పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యభద్రతపై ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.


బాధ్యత.. కర్తవ్యం

- కేకేఎన అన్బురాజన, ఎస్పీ

పోలీసులను ప్రభుత్వం ఫ్రంట్‌లైన వారియర్స్‌గా గుర్తించింది. యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాడే సైనికులుగా ఈ కీలక సమయంలో విధులు నిర్వర్తించాలి. ఇది మా పోలీసుల బాధ్యత.. కర్తవ్యం కూడా. శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించాలి. వైర్‌సను కట్టడి చేసేందుకు అహర్నిశలు పనిచేస్తున్నాం. ఈ క్రమంలో మా కానిస్టేబుళ్లు ఎవరైనా వైరస్‌ బారిన పడితే.. వారిని తక్షణమే ఆసుపత్రిలో చేర్పిస్తున్నాం. మంచి వైద్యసేవలు అందిస్తున్నాం. మా కుటుంబంలో ఒకరిగా నేను, డీఎస్పీలు రోజూ ఫోన చేసి ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నాం. అంతేకాదు.. కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రతిరోజూ మెడిటేషన చేయించడం, మాస్కులు, ఫేస్‌ మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్కానింగ్‌ వంటి పరికరాలు పంపిణీ చేశాం. భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇది విధి నిర్వహణే కాకుండా సామాజిక సేవగా భావించి ముందుకు వెళ్తున్నాం. 


హెల్ప్‌డెస్క్‌ ద్వారా సహకారం

- దూలం సురేష్‌, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, కడప

కరోనా వైరస్‌ కట్టడిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఎవరైనా కరోనా బారిన పడితే హెల్ప్‌ డెస్క్‌ ద్వారా వారికి వైద్యసహాయం అందించేలా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఫ్రంట్‌లైన వారియర్స్‌గా రెండు డోసులు వ్యాక్సిన ఇచ్చారు. మా కుటుంబ సభ్యుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన వేయిస్తున్నారు. అంతేగాకుండా ముందస్తు జాగ్రత్తగా విటమిన-సి, జింక్‌, బీ-కాంప్లెక్స్‌, విటమిన-డీ3 వంటి ఔషధాల కిట్‌ ప్రతి పోలీసుకు ఎస్పీ అందించారు. మా పోలీసు కుటుంబ సభ్యులే కాకుండా మా బంధువులకు కూడా హెల్ప్‌డెస్క్‌ ద్వారా సహాయం అందిస్తున్నారు. మా పోలీసులే కాదు.. మా కుటుంబాల్లో ఎవరికి కరోనా లక్షణాలు ఉన్నా ఎస్పీ ఉచితంగా మందులు, ఆసుపత్రిలో చేరితే.. బంధువులందరికీ ఉచిత భోజనాలు అందిస్తున్నారు.


జిల్లాలో పోలీసుల వివరాలు : 

----------------------------------------------

హోదా సంఖ్య

----------------------------------------------

ఎస్పీ 1

అడిషినల్‌ ఎస్పీలు, ఓఎ్‌సడీ 3

డీఎస్పీలు 10

సీఐలు 49

ఎస్‌ఐలు 129

ఏఎ్‌సఐలు 177

హెడ్‌ కానిస్టేబుళ్లు 466

కానిస్టేబుళ్లు 1302

హోంగార్డులు 715

----------------------------------------------

మొత్తం 3613

----------------------------------------------

Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST