రోదసి పర్యాటకం.. విమానాల కన్నా 100 రెట్లు కాలుష్యకారకం!

ABN , First Publish Date - 2021-07-22T10:15:22+05:30 IST

వర్జిన్‌ సంస్థల అధినేత సర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌, అమెజాన్‌ మాజీ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ తమ అంతరిక్ష యాత్రలతో రోదసి పర్యాటకంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని పెంచిన సంగతి తెలిసిందే.

రోదసి పర్యాటకం.. విమానాల కన్నా 100 రెట్లు కాలుష్యకారకం!

లండన్: వర్జిన్‌ సంస్థల అధినేత సర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌, అమెజాన్‌ మాజీ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ తమ అంతరిక్ష యాత్రలతో రోదసి పర్యాటకంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని పెంచిన సంగతి తెలిసిందే. అయితే.. రోదసి పర్యాటకం వినేందుకు ఆసక్తికరంగా ఉన్నా.. అది సాధారణ విమానాల కంటే 100 రెట్లు అధికంగా కర్బన వాయువును విడుదల చేస్తుందని ఇలాయిసే మరాయిస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన యూనివర్సిటీ కాలేజీ లండన్‌(యూసీఎల్‌)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన ఒక వార్తాసంస్థకు తెలిపిన వివరాల ప్రకారం.. బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్‌ రాకెట్లలో వాడే బ్లూ ఇంజిన్‌ 3(బీఈ 3) ద్రవ రూపంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లను మండించి పైకి ఎగురుతుంది. వీఎస్ఎస్‌ యూనిటీ ఇంజన్‌లో కర్బన ఆధారిత ఇంధనాన్ని, హైడ్రోక్సైల్‌-టెర్మినేటెడ్‌ పాలీబుటాడైన్‌(హెచ్‌టీపీబీ), నైట్రస్‌ ఆక్సైడ్‌లను వినియోగిస్తారు. 




ఇక ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్లలో కిరోసిన్‌ను, ద్రవ రూపంలోని ఆక్సిజన్‌ను ఉపయోగిస్తారు. ఈ మొత్తం రాకెట్లలో ఇంధనాన్ని మండించడం ద్వారా మనిషి రోదసిలోకైతే వెళ్తాడు కానీ.. దానికి పర్యావరణ నష్టాన్ని మూల్యంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. లాంచింగ్‌ లేదా తిరిగి భూమి పైకి రాకెట్‌ వచ్చే సమయంలో అవి ఉత్పత్తి చేసే వేడి, భూ వాతావరణంలోని వాయువులను కాలుష్యంగా మారుస్తుంది. వాటిలో కొన్ని వాయువులు ఓజోన్‌ పొరను ఆక్సిజన్‌గా మార్చేస్తాయి. దీని వలన భూ వాతావరణం మరింత త్వరగా వేడెక్కిపోతుంది. ఏడాదికి సుమారు 400 వరకూ రాకపోకల్ని రోదసిలోకి సాగించగలమని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ చెబుతోంది. బెజోస్‌, మస్క్‌ సంస్థలు ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్నాయి. విమానాల కారణంగా జరిగే కాలుష్యాన్ని అందులోని ప్రయాణికుల తలసరిగా లెక్క చూస్తే.. రోదసి పర్యాటకంలో తలసరి కాలుష్యం అంతకంటే 100 రెట్లు అధికంగా ఉంటుందని అంచనా.

Updated Date - 2021-07-22T10:15:22+05:30 IST