స్పందనను సమర్థవంతంగా నిర్వహించాలి

Aug 2 2021 @ 23:57PM
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అదేశం

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 2: జిల్లాలో ప్రతి సోమవారం స్పందనను అన్నిస్థాయిల్లో సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. స్పందనలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

జిల్లాలో పొదిలి, దర్శి, కొత్తపట్నం, కొండపి, ఒంగోలు అర్బన్‌, ఎన్‌జీపాడు, అద్దంకి, సంతమాగులూరు, పామూరు, కొరిశపాడులలో కొవిడ్‌కేసులు అసాధారణంగా నమోదు అవుతున్నాయని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. వీటిపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  సీసీరోడ్లు, గ్రావెల్‌రోడ్లు, గ్రామసచివాలయాలు, ఆర్‌బీకే భవన నిర్మాణాలు, బల్క్‌మిల్స్‌ సెంటర్‌ యూనిట్లు సెప్టెంబరు నాటికి పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.  కార్యక్రమంలో జేసీలు జే వెంకటమురళీ, టీఎస్‌ చేతన్‌, కేఎస్‌ విశ్వనాఽథన్‌, డీఆర్వో తిప్పేనాయక్‌, సీపీవో వెంకటేశ్వర్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

 9 నుంచి డయల్‌ యువర్‌ కలెక్టర్‌

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని ఈనెల 9వతేదీ నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 11గంటల వరకు నిర్వహిస్తామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా దూర ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక స్పందన హాలులో సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం టోల్‌ ఫ్రీ నెంబరు 1077 ద్వారా నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి సమస్యపై మాట్లాడవచ్చని కలెక్టర్‌ తెలిపారు.  గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.