స్పందన ముగిసేవరకు ఉండలేరా?

ABN , First Publish Date - 2022-05-24T06:00:14+05:30 IST

స్పందన ప్రారంభ సమయంలో కలెక్టర్‌ దృష్టిలో పడి., ఆ తరువాత కార్యక్రమంకు డుమ్మా కొడుతున్న కొంతమంది అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి సీరియస్‌ అయ్యారు.

స్పందన ముగిసేవరకు ఉండలేరా?
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, జేసి రాజకుమారి

అధికారుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం


గుంటూరు(తూర్పు), మే23: స్పందన ప్రారంభ సమయంలో కలెక్టర్‌ దృష్టిలో పడి., ఆ తరువాత కార్యక్రమంకు డుమ్మా కొడుతున్న కొంతమంది అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి సీరియస్‌ అయ్యారు. అయా శాఖలకు సంబంధించి కిందస్ధాయి సిబ్బందిని అక్కడ ఉంచి అధికారులు వెళ్లిపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం స్పందన జరుగుతున్న సమయంలో ఎండోమెంట్‌, ఇరిగేషన్‌కు సంబంధించిన సమస్యలు వచ్చినపుడు వాటి గురించి ఆయా శాఖల ఉన్నాతాధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. కొద్దిసేపటి తరువాత అదే శాఖలకు సంబంధించి సమస్యలు వచ్చినపుడు వారు అందుబాటులో లేకుండా కిందస్ధాయి సిబ్బంది ఉండటాన్ని కలెక్టర్‌ గమనించారు. దీనిపై కలెక్టర్‌ తీవ్రస్థాయిలో సీరియస్‌ అయ్యారు.  కనీసం మూడుగంటలపాటు జరిగే స్పందనలో కూడా కూర్చోలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కూడా నా కింద స్థాయి సిబ్బందిని నా స్థానంలో కూర్చోబెట్టి నేను కూడా వెళ్లిపోయేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. స్పందన ప్రారంభం నుంచి పూర్తి అయ్యేవరకు జిల్లా ఉన్నాతాధికారులు ప్రతి ఒక్కరూ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 


స్పందనకు 146 అర్జీలు

కలెక్టరేట్‌లోని శంకరన్‌ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంకు జిల్లా నలుమూలల నుంచి 146 అర్జీలు అందాయి. అర్జీలను కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.  

ఫిర్యాదులు ఇలా..

 జీజీహెచ్‌లో 2016లో స్టాఫ్‌ నర్సులుగా జాయిన్‌ అయిన వారి డేటా లేదంటున్నారంటూ స్టాఫ్‌ నర్సులు స్పందనలో ఫిర్యాదు చేశారు. 2016లో వచ్చిన తమ వివరాలను నమోదు చేయకుండా, మా స్థానంలో 2020లో జాయిన్‌ అయిన వారి డేటాను నమోదు చేస్తున్నారని, దీంతో తమకు ప్రభుత్వం కల్పించిన అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్టాండ్‌వద్ద ఉన్న రైతుబజార్లో డ్వాక్రాగ్రూపుకు చెందిన షాపు ఖాళీ అయిందని సదరు దుకాణాన్ని వారికి కేటాయించకుండా నిబంధనలకు విరుద్ధంగా పూలదుకాణానికి అధికారులు కేటాయించారని మహాబూబ్‌ సుభానీ హోల్‌సేల్‌ అండ్‌ రిటైల్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.  . 

 మినిమం టైంస్కేల్‌ అమలు చేయాలని 556 రోజులుగా నిరసన చేస్తున్న టీటీడీ అటవీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కీలకమైన తిరుమల, తిరుపతి దేవస్థానంలో ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగుల పట్ల వివక్ష తగదన్నారు. అంతకముందు కొద్దిసేపు  సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. 

 తుళ్ళూరు గ్రామంలోని లెబ్రరీ సెంటర్లో ఉన్న తమ దుకాణాల ఎదురుగా వైసీపీ బ్యానర్లు కట్టి, తొలగించకుండా వేధిస్తున్నారంటూ రావెల మాధవి స్పందనలో ఫిర్యాదు చేశారు. గతంలో దుకాణాలకు సీల్‌ వేసి అడ్డుగా బ్యానర్‌ కట్టడంతో జిల్లా పంచాయితీ ఆదేశాలతో వాటిని తొలగించారని. తిరిగి మళ్లీ  స్థానిక ఈవో అండదండలతో మరో  బ్యానర్‌కట్టారని ఉన్నాతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-24T06:00:14+05:30 IST