‘స్పందన’ ఏదీ?

ABN , First Publish Date - 2022-08-09T06:25:05+05:30 IST

‘స్పందన’ ఏదీ?

‘స్పందన’ ఏదీ?
బందరు కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

రెండు జిల్లాల్లో సమస్యల పరిష్కారం అంతంతమాత్రం

అర్జీలన్నీ బుట్టదాఖలు

మండల, డివిజన్ల స్థాయిలో అంతులేని నిర్లక్ష్యం 

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న అధికారులు 

కలెక్టర్‌ హెచ్చరిస్తున్నా మారని తీరు

పెండింగ్‌ దరఖాస్తులు ఎక్కువే..

రీ ఓపెన్‌.. అంతకుమించి 


సమస్యలకు సత్వర పరిష్కారమంటూ ప్రతి సోమవారం ఘనంగా నిర్వహిస్తున్న ‘స్పందన’కు అధికారుల నుంచి ప్రతిస్పందన కరువైంది. ఉన్నతాధికారులు అర్జీలు స్వీకరిస్తున్నా.. క్షేత్రస్థాయిలో కిందిస్థాయి సిబ్బంది పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఫలితంగా రెండు జిల్లాల్లో వారంవారం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమం మొక్కుబడి తంతుగానే మారింది. ఎన్టీఆర్‌ జిల్లాలో అవే సమస్యలు పదేపదే రీ ఓపెన్‌ అవుతుండగా, కృష్ణాజిల్లాలో చాలావరకు సమస్యలు పెండింగ్‌లోనే ఉండటంతో అర్జీదారులు తలలు పట్టుకుంటున్నారు.  - ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం టౌన్‌


ఎన్టీఆర్‌ జిల్లాలో రీ ఓపెనే ఎక్కువ

ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం స్పందన అర్జీలపై సీరియస్‌గా దృష్టి సారించట్లేదు. క్షేత్రస్థాయిలో అధికారుల అంతులేని నిర్లక్ష్యం వల్ల పదేపదే అర్జీలు రీ ఓపెన్‌ అవుతున్నాయి. ఇలా రీ ఓపెన్‌ అవుతున్న అర్జీల్లో మండల, డివిజన్‌ స్థాయి అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా భూ వివాదాలు, ఆక్రమణలకు సంబంధించి కిందిస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం అవినీతి కారణంగా కూడా అర్జీలను తొక్కిపట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కలెక్టర్‌ దిల్లీరావు అర్జీలు స్వీకరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారం నామమాత్రంగానే జరగడం వల్ల రీ ఓపెన్‌ కేసులే ఎక్కువ ఉంటున్నాయి. 

కృష్ణాజిల్లాలో పెండింగ్‌ 

కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రంజిత్‌ బాషా ప్రతి సోమవారం అర్జీలు స్వీకరిస్తున్నారు. రెవెన్యూ శాఖకు చెందిన అర్జీలు ఎక్కువగా పెండింగ్‌లో ఉంటున్నాయి. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 4,339 అర్జీలు రాగా, వాటిలో 209 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెవెన్యూ శాఖకు చెందిన అర్జీలు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీరాజ్‌ 32, ఎండోమెంట్స్‌ 6, ఇరిగేషన్‌ 9 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టరేట్‌కు వచ్చే స్పందనలో తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెన్షన్లు ఇప్పించాలంటూ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు దరఖాస్తులు పెడుతూనే ఉన్నారు. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెడుతున్న వారు కూడా ఉన్నారు. టిడ్కో ఇళ్లు ఇప్పించాలని కలెక్టరుకు డిమాండ్‌ డ్రాఫ్టులు చెల్లించిన లబ్ధిదారులు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. 3, 4, 5 తరగతుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అర్జీలు సమర్పించారు. వీటిల్లో కొన్నింటి విచారణకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఒక అర్జీకి 730 రోజులు 

జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామంలో ఉన్న ఎన్‌సీఎల్‌ బ్రిక్స్‌ కంపెనీ యాజమాన్యం అక్రమంగా తారకరామా ఎత్తిపోతల పథకం సాగునీటిని వాడుకుంటూ వ్యాపారం చేస్తోందని, రైతులకు సాగునీటి కొరతను సృష్టిస్తోందని బట్టుపర్తి రాజు అనే వ్యక్తి స్పందనలో మండల స్థాయిలో ఫిర్యాదు చేశారు. అర్జీని 730 రోజుల్లో పరిష్కరిస్తామని తెలుపుతూ సమాధానం పంపారు. దీనిపై అర్జీదారు రాజు సోమవారం ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌ స్పందనలో ఫిర్యాదు చేశారు. సహజంగా అర్జీని 15 రోజుల్లో పరిష్కరించాలి. క్లిష్టమైన అంశమైతే నెల రోజులు తీసుకోవచ్చు. కానీ, ఏకంగా 730 రోజులు తీసుకుంటామని సమాధానం ఇవ్వటం అంటే అర్థం చేసుకోవాలి. 

కృష్ణాజిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో..

ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ జాషువా అర్జీలు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీ గన్నవరం విమానాశ్రయంలో ప్రొటోకాల్‌ బందోబస్తుకు వెళ్లడం వల్ల ఏఎస్పీ వెంకట రామాంజనేయులు అర్జీలు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో దాదాపు 3 వేల మంది అర్జీలు సమర్పించారు. వాటిలో 2,800 వరకు పరిష్కారమయ్యాయి. ఆస్తి తగాదాల కారణంగా పరస్పర దాడుల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల కేసులు ఈ నాలుగు నెలల్లో ఎక్కువగా నమోదయ్యాయి.

ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో..

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి సుమారు 50 అర్జీల వరకు వస్తాయి. వాటిలో ఎక్కువగా ఆర్థిక, ఆస్తి తగదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉంటున్నాయి. ఆ తర్వాత కుటుంబ వివాదాల అర్జీలు ఉంటున్నాయి. తొలుత పోలీసు కమిషనర్‌ స్వీకరించేవారు. తర్వాత డీసీపీ, ఏడీసీపీ స్థాయి అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు. కొవిడ్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌గా మారిపోయింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో కమిషనరేట్‌లోని అధికారుల వద్దకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన అర్జీలు తిరిగి మళ్లీ అదే పోలీస్‌స్టేషన్లకు వెళ్తున్నాయి. 





ఇంటిని మార్చమంటే స్పందనే లేదు..

మాది కృష్ణలంకలోని రాణిగారితోట. కరకట్ట రోడ్డు నిర్మాణం సందర్భంగా మా ఇల్లు పోయింది. దీంతో మాకు రాజరాజేశ్వరిపేటలో ఇల్లు ఇచ్చారు. ఇది గంజాయి ముఠా, బ్లేడ్‌బ్యాచ్‌కు అడ్డాగా ఉంది. అసాంఘిక కార్యక్రమాల నిలయంగా ఉంది. ఇక్కడ ఉండలేకపోతున్నాం. అందుకని ఇంటిని మార్చాల్సిందిగా కార్పొరేషన్‌ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. అనేక స్పందనలు తిరిగాను. లాభం లేదని కలెక్టరుకు ఫిర్యాదు చేశాం. - చీకట్ల కరుణ 


న్యాయం చేయండి..

మా గ్రామంలో ఓసీ కాలనీ-బీసీ కాలనీ రోడ్డు ఉంది. ఓసీ కాలనీలో శీలపు భద్రారెడ్డి ఇంటి నుంచి శీలపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఇంటి వరకు 2021లో సిమెంట్‌ రోడ్డు వేశారు. రోడ్డు వేశాక బీసీ కాలనీ వారు రాకూడదంటూ తడికె కట్టారు. ఇప్పుడు బీసీ కాలనీకి కూడా రోడ్డు వచ్చిందని ఏకంగా అడ్డుగోడ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతలన్న విషయాన్ని పక్కనపెట్టి న్యాయం చేయాల్సిందిగా అర్జీలో విజ్ఞప్తి చేస్తున్నాం. - నాగేశ్వరరావు, వైసీపీ నేత, తిరువూరు మండలం కోకిలంపాడు


అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుతుందా? 

గంపలగూడెం మండలం పెదకొమెర గ్రామంతో పాటు శివారు తోటమాలలో రెండు  లే అవుట్లు వేశారు. తోటమాల లే అవుట్‌లో అవకతకవలు జరిగాయి. తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ పొజిషన్‌ సర్టిఫికెట్లను జారీ చేశారు. ఇందులో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కొంగల వినాయకరావు పాత్ర ఉంది. ముఖ్యమంత్రి స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నేను కూడా అధికారపక్షమే. అధికారం ఉందని ఏది చేసినా చెల్లుతుందనుకుంటే పొరపాటే. తహసీల్దార్‌ సంతకాలను ఫోర్జరీ చేయటం చాలా పెద్ద నేరం. తహసీల్దార్‌ పట్టించుకోవటం లేదు. మేము కేసు పెడితే ఎస్‌ఐ పట్టించుకోవటం లేదు. ఎవరికి చెప్పుకోవాలి. స్పందనలో ఫిర్యాదు చేస్తుంటే అధికారులు పరిష్కరించట్లేదు. కలెక్టర్‌ అయినా పరిష్కరిస్తారని ఫిర్యాదు చేశాం. 

- జి.నాగరాజు,  వైసీపీ నేత, గంపలగూడెం


ఇంత బాధ్యతారాహిత్యమా.. 

చందర్లపాడు మండలంలో విశ్వబ్రాహ్మణులకు కేటాయించిన శ్మశాన స్థలాన్ని ఆక్రమిస్తున్నారని స్థానికంగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవట్లేదు. దీనిపై కిందటి నెలలో స్పందనలో ఫిర్యాదు చేశాను. కలెక్టర్‌ గట్టిగా ఆదేశించేసరికి చేసేదేమీ లేక ఒకే ఒక్క ఆక్రమణను కూల్చి మమ.. అనిపించారు. మరి మిగిలిన ఆక్రమణల సంగతే మిటంటే.. పరిష్కరించామని అంటున్నారు. దీంతో మళ్లీ అర్జీ సమర్పించాను. - ములుగు వీరాచారి, భాగేశ్వరరావు 


వయసు మీద పడి తిరగలేకపోతున్నా..

నాకు వయసు మీద పడుతోంది. చిన్న సమస్యను పరిష్కరించమని కోరుతున్నా. పంచాయతీ, మునిసిపల్‌ అధికారులు పట్టించుకోవట్లేదు. చిన్న మురుగు సమస్యకు న్యాయం చేయమని కలెక్టరుకు ఫిర్యాదు చేశాను. ఇప్పటికి రెండుసార్లు తిరిగాను. ఈసారైనా నా సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో ఫిర్యాదు చేశాను. 

- సాంబ శివరావు, కంచికచర్ల మండలం వేములపల్లి

Updated Date - 2022-08-09T06:25:05+05:30 IST