స్పందన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-22T06:13:04+05:30 IST

స్పందనలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సూచించారు.

స్పందన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌

కోవెలకుంట్ల, మే 21: స్పందనలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సూచించారు. కోవెలకుంట్లలోని ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై చర్చించారు. పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కారమయ్యాయని నివేదికలు పంపిస్తున్నారని, అయితే స్పందనలో అవే సమస్యలు రిపీట్‌ అవుతున్నా యని తెలిపారు. ఇలా జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఓటీఎస్‌, ఇళ్ల నిర్మాణంపై తహసీల్దారు, ఎంపీడీవో, వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు కలిసి ప్రతి రోజూ నివేదికను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అలాగే చెత్త సంపద కేంద్రాన్ని తనిఖీ చేశశారు. డీఎల్‌పీవో శ్రీనివాసులు, ఎంపీడీవో మహబూబ్‌దౌలా, తహసీల్దారు పుష్పకుమారి, హౌసింగ్‌ డీఈ కృష్ణారెడ్డి, ఈవోఆర్డీ ప్రకాష్‌నాయుడు, ఏపీవో శ్రీవిద్య, ఏపీఎం బాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హరి, పీఆర్‌ఏఈ రవికుమార్‌, ఏడీ కొండారెడ్డి, పశువైద్యాధికారి కృష్ణకుమార్‌, కోవెలకుంట్ల క్టస్టర్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


‘వేతనాలు ఇప్పించండి’ 


తమకు వేతనాలు ఇప్పించాలని స్వచ్ఛభారత్‌ కార్మికులు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ను వేడుకున్నారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన 25 మందిలో ఇద్దరికి 17 నెలలుగా, మిగతా వారికి 6 నెలలుగా వేతనాలు రాలేదని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. నెలకు కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తున్నారని, ఈ డబ్బుతో ఇళ్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల విషయంపై కలెక్టర్‌ అడగ్గా, సాంకేతిక కారణాల వల్ల వేతనాలు రాలేదని ఈవో సమాధానం చెప్పారు. అనుమతి ఇస్తే గ్రామ పంచాయతీ నుంచి వేతనాలు ఇస్తామని ఈవో కలెక్టర్‌కు వివరించారు. దీనికి సంబంధించి లెటర్‌ను తయారు చేసి తనకు పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్వచ్ఛ సంపదలో ఎరువులను తయారు చేసే మిషన్లను పరిశీలించారు. షెడ్డు మొత్తం కారుతోందని, మరమ్మతులు చేయించాలని కార్మికులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. షెడ్డుకు మరమ్మతులు చేయించాలని సంబంధితాధికారులను ఆదేశించారు. 


పార్కు పరిశీలన 


కోవెలకుంట్ల పట్టణ శివారులో కుందూనది పక్కనే ఉన్న పార్కును కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ శనివారం పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసేందుకు వచ్చిన కలెక్టర్‌ పార్కును పరిశీలించాల్సిందిగా డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, కామిని వేణుగోపాల్‌రెడ్డి కోరగా కలెక్టర్‌ పార్కును పరిశీలించారు. పార్కును అభివృద్ధి చేసేందుకు సహకరించిన దాతలను, ఈవోఆర్డీ ప్రకాష్‌నాయుడును కలెక్టర్‌ అభినందించారు. కుందూ పాతబ్రిడ్జిపై ఏర్పాటు చేసిన రహదారిని కూడా కలెక్టర్‌ పరిశీలించారు.  

Updated Date - 2022-05-22T06:13:04+05:30 IST