బాసర ట్రిపుల్‌ ఐటీలో పిచ్చికుక్కలు..అడవి పందులు

ABN , First Publish Date - 2022-06-29T07:33:59+05:30 IST

బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ఒక పక్క పిచ్చి కుక్కలు.. మరో పక్క అడవిపందుల బెడద అధికమైంది.

బాసర ట్రిపుల్‌ ఐటీలో పిచ్చికుక్కలు..అడవి పందులు
ట్రిపుల్‌ ఐటీలో ప్రాంగణంలో పిచ్చికుక్కలు

భయాందోళనలో విద్యార్థులు

బాసర, జూన్‌, 28 : బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ఒక పక్క పిచ్చి కుక్కలు.. మరో పక్క అడవిపందుల బెడద అధికమైంది. గుంపులు గుంపులుగా తిరిగే పిచ్చికుక్కలతో విద్యార్థులు తరగతులకు వెళ్లాలంటే భయ పడుతున్నారు. ఇవే కాకుండా యూనివర్సిటీ క్యాంపస్‌లో అడవిపందుల సంచారం కూడా అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. అడవిపందులు తరచుగా తారసపడుతూనే ఉన్నాయి. కాని అదృష్టవశాత్తు ఇప్పటి వరకు మాత్రం వాటి వల్ల ప్రమా దాలు జరగలేదు.  యూనివర్సిటీ ప్రాంగణం దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో దాదాపు 100 ఎకరాలకు పైగా భూమి ఖాళీగా పిచ్చిమొక్కలు గడ్డితో నిండిపోయి ఉంది. నిర్వహణ లేదు. ఇందులో అడవి పందులు మాకాం వేశాయి. యూనివర్సిటీలోకి ఎట్ల వచ్చాయో తెలియదు గాని వాటి సంతానం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో  పాటు యూనివర్సిటీలో ఖాళీ ప్రదేశాలు కూడా పిచ్చి మొక్కలతో నిండిపోయి ప్రమాదకరంగా మారింది. పాములు వంటి విష పురుగులను కూడా తరచూగా పట్టుకొని బయటపారేసిన సంఘటనలు ఉన్నాయి. హాస్టళ్లలో మిగిలిపోయిన ఆహారం తినేందుకు కుక్కలు అందులోకి చొరపబడుతున్నాయి. ఈ క్రమంలో పదులసంఖ్యలో గుంపుగుంపులుగా తిరగడంతో విద్యార్థులు తరగతులకు, హాస్టళ్లలో భోజనం చేసేందుకు వెళ్లేందుకు జంకుతున్నారు.  గత కొన్నేళ్ల నుండి పిచ్చికుక్కల దాడిలో విద్యార్థులు గాయపడుతూనే ఉన్నారు. ఘటనలు జరిగినప్పుడు అధికారులు కుక్కల నన్నింటిని క్యాంపస్‌ బయటకు పంపించే చర్యలు తీసుకుంటారు. తర్వాత మరిచిపోవడంతో మళ్లీ ప్రవేశించి విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి.

కుక్కల దాడిలో ఐదుగురు విద్యార్థులకు గాయాలు 

ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని పిచ్చికుక్కల దాడిలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం హాస్టల్‌ వద్ద ఈ సంఘటన జరిగింది. భయాందోళనకు గురైన విద్యార్థులు  పరుగులు తీశారు. మూడు నుంచి ఐదు కుక్కలు విద్యార్థులను వెంబడించి గాయపరిచాయి. ఐదురుగు విద్యార్థుల కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు కుక్కల నుండి రక్షించుకోవడానికి పరుగులు తీస్తూ కిందపడి గాయపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి క్యాంపస్‌లో పిచ్చికుక్కల బెడద అధికమైంది. 

Updated Date - 2022-06-29T07:33:59+05:30 IST