బాగా మాట్లాడతారు.. ఏమీ చేయరు!

ABN , First Publish Date - 2021-11-28T07:24:11+05:30 IST

బాగా మాట్లాడతారు.. ఏమీ చేయరు!

బాగా మాట్లాడతారు.. ఏమీ చేయరు!

ప్రభుత్వాల తీరుపై నిర్మాత డి.సురేశ్‌బాబు వ్యాఖ్యలు

రేట్లు తగ్గిస్తే కరెంటు బిల్లులూ కట్టలేరని వ్యాఖ్య

హైదరాబాద్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘సినిమావాళ్లకు ప్రభుత్వాలు గౌరవం ఇస్తాయి. బాగానే మాట్లాడతారు. ఏదడిగినా చేస్తాం అంటారు. కానీ ఏమీ చేయరు. బహుశా ఈ పరిస్థితికి ప్రభుత్వానికీ సినీ పెద్దలకూ మధ్య మిస్‌ కమ్యూనికేషన్‌ కారణమేమో!’ అని సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌లో విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల విషయంలో థియేటర్ల యాజమాన్యాలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘దృశ్యం2’ సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్న సందర్భంగా శనివారం సురేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో టికెట్‌ రేట్ల వ్యవహారంపై ఆయన స్పందిస్తూ ‘దృశ్యం 2’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ రేట్ల తగ్గింపు ఇందులో ఒక కారణం మాత్రమేనని చెప్పారు. ‘ఏ సెంటర్లలో టికెట్‌ రేటు రూ.100 అంటే ఫరవాలేదు. కానీ బీ,సీ సెంటర్లలోనూ రూ.20, రూ.30 పెడితే నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. వాటితో థియేటర్‌ కరెంట్‌ బిల్లు కూడా కట్టలేరు. 


ప్రభుత్వం అలా చేయడం సమంజసం కాదు. తన ఉత్పత్తిని ఎంత రేటుకు అమ్ముకోవాలనేది నిర్మాత హక్కు. సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురైనా ఇన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసిన సాయం శూన్యం. తక్కువ ధరలకు టికెట్లు అమ్మడం వల్ల ప్రభుత్వాలకు ప్రజల్లో పలుకుబడి పెరుగుతుందేమో కానీ థియేటర్ల మనుగడకు తీవ్ర  నష్టం చేస్తుంది. ప్రభుత్వాలు కూడా చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి’ అని డి.సురేశ్‌బాబు అన్నారు. 

Updated Date - 2021-11-28T07:24:11+05:30 IST