పేదలకు అన్ని వసతులతో సొంతింటి నిర్మాణం: స్పీకర్ పోచారం

ABN , First Publish Date - 2022-03-04T01:39:40+05:30 IST

పేద ప్రజలకు అన్ని వసతులతో కూడిన స్వంత ఇంటి నిర్మాణం చేపడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు

పేదలకు అన్ని వసతులతో సొంతింటి నిర్మాణం: స్పీకర్ పోచారం

నిజామాబాద్ జిల్లా: పేద ప్రజలకు అన్ని వసతులతో కూడిన స్వంత ఇంటి  నిర్మాణం చేపడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరి మండలం యాద్గార్ పూర్, వల్లభాపూర్ గ్రామాలలో శుక్రకవారం రూ. 15 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సం చేశారు.ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం గ్రామస్థులు అందరూ కలిసికట్టుగా ఉండడం సంతోషంగా వుందన్నారు.తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అయినా 70 ఏళ్ళ ముందు ఏర్పడిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్ లోకి తీసుకువచ్చాం. భవిష్యత్తులో ఆయకట్టుకు డోకా లేదు ఏటా రెండు పంటలు పుష్కలంగా పండుతాయని అన్నారు. 


రాష్ట్రంలో అత్యధికంగా పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయిన నియోజకవర్గం బాన్సువాడ మాత్రమేనని అన్నారు. నియోజకవర్గంలోని పేదలందరికీ స్వంత ఇంటి కలను నెరవేర్చడమే నా లక్ష్యమని చెప్పారు. పేదింటి గర్భవతులకు బలవర్ధకమైన ఆహారం అందించడానికి అంగన్వాడీ కేంద్రాలలో పాలు, గుడ్డుతో కూడిన ఆహారం అందిస్తున్నామని స్పీకర్ తెలిపారు. అదేవిధంగా గర్భవతులకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్, నగదు సహాయాన్ని అందిస్తుందన్నారు.దేశంలో ఎక్కడా లేని విదంగా ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల కరంటు, పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణలక్ష్మి‌ ద్వారా నగదు సహాయం అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. 


తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను పక్క రాష్ట్రాల ప్రజలు వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారని స్పీకర్ తెలిపారు. కాగా నూతన పెన్షన్లును ఎప్రిల్ నెల నుండి ఇస్తారని తెలిపారు.తాడు బొంగరం లేని కొన్ని పార్టీల వారు ఏదేదో మాట్లాడుతారు.మీరు 70 ఏళ్ళు పాలించి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-04T01:39:40+05:30 IST