ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి.. పాటను వరమిచ్చి వెళ్లిపోయాడు

ABN , First Publish Date - 2020-09-26T17:50:56+05:30 IST

ఆ మహాగాయకుడు పుట్టింది మన గడ్డ మీదే. చదువుకున్నదీ ఈ నేలమీదే. నగరి సమీపంలోని కోనేటిపేటలో ఒక మేనమామ ఇంట పుట్టి అక్కడే అక్షరాలు దిద్దుకున్నాడు. శ్రీకాళహస్తిలో మరో మేనమామ ఇంట జేరి హైస్కూలు చదువు పూర్తి చేశాడు.

ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి.. పాటను వరమిచ్చి వెళ్లిపోయాడు

చిత్తూరు (ఆంధ్రజ్యోతి): ఆ మహాగాయకుడు పుట్టింది మన గడ్డ మీదే. చదువుకున్నదీ ఈ నేలమీదే. నగరి సమీపంలోని కోనేటిపేటలో ఒక మేనమామ ఇంట పుట్టి అక్కడే అక్షరాలు దిద్దుకున్నాడు. శ్రీకాళహస్తిలో మరో మేనమామ ఇంట జేరి హైస్కూలు చదువు పూర్తి చేశాడు. తిరుపతి ఎస్వీఆర్ట్స్‌ కాలేజీలో పీయూసీ చదువుకున్నాడు. తన గొంతుకు తొలి గుర్తింపు లభించిందీ, రికార్డుకెక్కిందీ కూడా ఇక్కడే. శ్రీవేంకటేశ్వరుని భక్తుడు, శ్రీకాళహస్తీశ్వరుడి సేవకుడు...పాటలు పాడి రుణం తీర్చుకున్నాడు. బహుభాషా గాయకుడిగా భారతీయ సినీ పరిశ్రమలో ఒక ధృవతారగా వెలుగొందుతున్నా పుట్టిన ఊరినీ, చదువుకున్న బడులనూ ఆయన ఎన్నడూ మరవలేదు. బాల్య స్నేహితులనూ గుర్తుపెట్టుకున్నారు. ఆనాటి గురువులకు పాదాభివందనం చేశారు. తిరుపతిలో, చిత్తూరులో, మదనపల్లెలో, శ్రీకాళహస్తిలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారు. రమేష్‌నాయుడు  స్వరపరిచిన అన్నమయ్య కీర్తనలు బాలూ గొంతులో కొత్త అందాలను పోసుకున్నాయి. పాటను మనకు వరమిచ్చి వెళ్లిపోయిన ఈ గానగంధర్వుడి కోసం చిత్తూరుజిల్లా కన్నీళ్ళు పెట్టుకుంటోంది. ఆయన జ్ఞాపకాలతో నివాళి అర్పిస్తోంది.


అడుగు కదలనంటుంది.. స్వామీ.. నిను వీడి.. శ్రీవారికి ఎస్పీ బాలు గాన హారతి

ఎస్పీ బాలూకి శ్రీవేంకటేశ్వరుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలున్నాయి.‘అడుగు కదలనంటుంది స్వామీ.. నిను వీడి..’ అంటూ పాడి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సంగీత నైవేద్యాన్ని సమర్పించారు. శ్రీవారిపై ఎస్పీ బాలు పాడిన అనేక పాటలు జన బాహుళ్యంలో మంచి ఆదరణను పొందా యి.ఈయన తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో పీయూసీ చదువుకున్నారు. తిరుపతి ఎస్వీ ఓరియెంటల్‌ కాలేజ్‌ రిటైర్డు ప్రిన్సిపాల్‌ దివంగత వేద వ్యాస రంగభట్టార్‌ సోదరుడు వేదవ్యాస ఆనంద భట్టార్‌ స్వరపరిచిన ’అంతా రామ మయం’ పాటను బాలు పాడారు. అన్నమయ్య సినిమాలోనూ ’నిమమ నిగమ,  ’అంతర్యామి అలసితీ.. సొలసితీ’ అనే పాటలకు జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. తిరుమలలో శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా వాహనసేవలను గురించి 2013లో ఆకెళ్ల విభీషణశర్మ రాసిన ‘బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం’ అనే పాటకు బాలు స్వరాన్ని అందించారు. భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నపుడు 2010లో తిరుపతి వైభవం కోసం తనికెళ్ల భరణి, రంగభట్టర్‌, సామవేద షణ్ముఖశర్మ, విభీషణశర్మలు రాసిన పాటలకు ఎస్పీ గానం చేశారు. 2009లో ఎస్వీబీసీ ప్రారంభమైనపుడు ‘అన్నమయ్య పదమకరందం’ కు స్వరమిచ్చారు. మహతిలో పాడుతాతీయగా కార్యక్రమంలో తిరుపతి వైభవం గురించి ఆకెళ్ల రచించిన పాటను బాలు పాడారు.తిరుపతి ఘంటసాలగా పేరు పొందిన వీరరాఘవులు 2001లో ఎస్వీయూ ఆడిటోరియంలో బాలూని 12 స్వర్ణపుష్పాలతో అభిషేకం చేశారు. స్వర్ణ కంకణం కూడా తొడిగారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల యూనియన్‌ ఆధ్వర్యంలో భారతీయ హరికథ వైభవోత్సవ సేవాసమితి 2017లో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన హరికథా ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.1999లో ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి బాలు అతిధిగా హాజరయ్యారు. తన గొంతును మెచ్చుకొని, తొలిసారి రికార్డు చేసింది.. ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజ్‌ ఫిజిక్స్‌ విభాగాధిపతి పాపారావు అని ఆ వేదికపై గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అనేక విషయాలను సంగీతాభిమానులు ఆయన మరణం సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.


ఏడాదికోసారి వెంకన్న దర్శనానికి..!

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి అంటే బాలుకు మహా భక్తి. ఏడాదికోసారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకోవడం ఆయనకు ఆనవాయితీ. తన జీవితంలో మిక్కిలి సంతోషకరమైన ఘటనలు చోటుచేసుకున్న ప్రతిసారీ తలనీలాలు సమర్పించే వారు. చివరిగా 2019 జనవరిలో ఆయన తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నడూలేని విధంగా ఆ రోజు వేదపండితుల నుంచి ఆశీర్వచనం కూడా పొందారు. కాగా, ఎస్వీబీసీ ద్వారా ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో వందల పాటలను గానం చేశారు. శ్రీవారి వైభవాన్ని తెలుపుతూ అనేక సంకీర్తలను గానం చేసి వెంకన్న భక్తులకు అత్యంత దగ్గరయ్యారు. 


గాన గంధర్వుడికి శ్రీకాళహస్తితో విడదీయరాని బంధం

శ్రీకాళహస్తి బడిలో.... నాటకాల మోజులో 

1960వ దశకంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్‌పీబీఎస్‌ జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో 9వ తరగతిలో చేరారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ కూడా ఇక్కడే చదివారు.పట్టణంలోని బాబు అగ్రహారం కోనేరు సమీపంలో ఒక అద్దె ఇంటిలో ఉండేవారు. చదువుకునే రోజుల నుంచే నాటకాలపిచ్చి ఉండేది.  ‘నిరాశా ప్రొడక్షన్‌ నంబరు-1’, ‘పక్షులు లేని దిక్కులు’ అనే నాటికల్లో నటించారు. అప్పట్లో తోటా షణ్ముగం, లక్ష్మణరెడ్డి, హరినాథరావు, దర్బా పట్టాభి అనే స్నేహితులు ఉండేవారు. ఎస్పీ బాలుకు శ్రీకాళహస్తి పాఠశాలలో ప్రియమైన గురువు రాధాపతి. సినీరంగంలోకి ప్రవేశించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తరువాత కూడా శ్రీకాళహస్తికి వస్తే కొత్తపేటలోని రాధాపతి ఇంటికి వెళ్లి పలకరించేవారు. ఆర్‌పీబీఎస్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల డైమండ్‌ జూబ్లీ ఉత్సవం 1997లో జరిగింది. ఈ వేడుకలకు బాలు అతిథిగా హాజరయ్యారు. ఆ వేడుకల్లోనే పాఠశాల అభివృద్ధికి ఆయన రూ.50వేలు విరాళంగా అందచేశారు. శ్రీకాళహస్తి క్షేత్రంతో కూడా విడదీయరాని బంధం ఉంది. ముక్కంటి ఆలయానికి బాలు ఆస్థాన గాయకుడు. స్కిట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు 2002లో సలహా మండలి సభ్యుడిగా కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యవహరించారు. ఈ క్షేత్రం మీద వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర రాసిన ‘ఇదిగో దక్షిణ కైలాసం’ గానం చేసింది బాలూనే. మహాశివరాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో సంగీతవిభావరిలోనూ పాల్గొన్నారు.


నాటకాల్లో మా ఇద్దరికీ పోటీ 

ఆర్పీబీఎస్‌ పాఠశాలలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కంటే ఒక ఏడాది నేను జూనియర్‌. మా పాఠశాలలో డ్రాయింగ్‌ మాస్టర్‌ గుర్రప్ప పిళ్లై విద్యార్థులతో నాటకాలు వేయించేవాడు. ఈ నాటకాల్లో ఎస్పీ బాలుకు, నాకు మధ్య పోటీ ఉండేది. ఉన్నత స్థాయికి వెళ్లినా బాల్య స్నేహితులను ఆయన మరువలేదు. ఒకసారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో బాలు  సంగీత విభావరి జరుగుతోంది. వేలాది మంది ఉన్నారు. అంతమందిలో నన్ను గుర్తుపట్టి ‘పట్టాభి’ అంటూ అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆయన గొప్పతనానికి ఇదే నిదర్శనం. 

 - దర్బా పట్టాభి, శ్రీకాళహస్తి

Updated Date - 2020-09-26T17:50:56+05:30 IST