పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-07-25T06:32:09+05:30 IST

పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు పెంచి ఆహ్లాద వాతావరణం కల్పించడంతో పాటు పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే సూచించారు.

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి
కేసుల వివరాలను తెలుసుకుంటున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

- ఎస్పీ రాహుల్‌హెగ్డే 

ఎల్లారెడ్డిపేట, జూలై 24: పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు పెంచి ఆహ్లాద వాతావరణం కల్పించడంతో పాటు పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే సూచించారు. ఎల్లారెడ్డిపేట సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట పోలీసు అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని శనివారం ఆయన నిర్వహించారు. అంతకు ముందు స్థానిక ఠాణా ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. స్టేషన్ల వారీగా కేసులు, పెండింగ్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్‌హెగ్డే మాట్లాడుతూ ప్రజలతో మమేకం కావాలన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి అధికారులు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యత గా వ్యవహరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులపై ప్రజల కు నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్‌ బియ్యం తరలింపు, మహిళలకు సంబంధించిన నేరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పోక్సో చట్టం, మహిళల నేరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే పేర్కొన్నారు. డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ మొగిలి, ఎస్‌ఐలు వెంకటకృష్ణ, రవీందర్‌, సౌమ్య, ప్రొహిబిషనరీ ఎస్‌ఐలు సం ధ్య, గంగరాజు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T06:32:09+05:30 IST