GHMCలో ప్రత్యేక సెల్‌ల ప్లానింగ్‌.. ఇక ఒక్కో పని కోసం ఒక్కో విభాగం!

ABN , First Publish Date - 2021-12-03T17:01:06+05:30 IST

జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం కొత్త రూపు సంతరించుకుంటోంది. అనుమతు ల జారీ నుంచి ఆస్తుల సేకరణ వరకు

GHMCలో ప్రత్యేక సెల్‌ల ప్లానింగ్‌.. ఇక ఒక్కో పని కోసం ఒక్కో విభాగం!

  • పట్టణ ప్రణాళికా విభాగం పునర్‌వ్యవస్థీకరణ
  • వేగంగా పనులు పూర్తయ్యేందుకే
  • అనుమతుల నుంచి ఆస్తుల సేకరణ వరకు
  • ప్రస్తుతం అధికంగా పనిభారం
  • ఒత్తిడి తగ్గించి సకాలంలో పూర్తి చేసేందుకే వేర్వేరు విభాగాలు

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం కొత్త రూపు సంతరించుకుంటోంది. అనుమతుల జారీ నుంచి ఆస్తుల సేకరణ వరకు, ఇంటినెం బర్ల కేటాయింపు నుంచి వారసత్వ సంపద పరిరక్షణ వరకు అన్నింటిని పర్యవేక్షిస్తోన్న విభాగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఒక్కో అంశానికి ఒక్కో సెల్‌ ఏర్పాటుచేసి.. పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నతాధికారులకు అప్పగించనున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు, ఆస్తుల సేకరణ వంటి పనులు అందుబాటులో ఉన్న సిబ్బంది చూస్తున్నారు. దీంతో ఉద్యోగుల పై పనిభారం పెరగడంతోపాటు.. సకాలంలో ఆయా పనులు పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలోఉంచుకొని ఒక్కో ప్రాజెక్టు/పనికి ఒక్కో సెల్‌ ఏర్పాటుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రణాళికా విభాగం పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


టీఎస్‌ బీపాస్‌..

నిబంధనల ప్రకారం భవనాలు/లే అవుట్ల అనుమతుల జారీ, ఇన్‌స్టంట్‌ రిజిస్ర్టేషన్లు, ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ (తక్షణ అనుమతి) వంటివి సక్రమంగా జరుగుతున్నాయా,  లేదా అన్నది పర్యవేక్షించేందుకు ఈ సెల్‌ పనిచేస్తుంది. కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాల స్థలం వరకు నిర్మించే భవనాలకు ఇన్‌స్టంట్‌ రిజిస్ర్టేషన్‌, 600 చ.గ.ల స్థలంలో గ్రౌండ్‌ ప్లస్‌ రెండు అంతస్తుల వరకు చేపట్టే నిర్మాణాలకు తక్షణ అనుమతి లభిస్తుంది.  15 రోజుల్లో సంబంధిత సర్కిల్‌ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారు. ఆ తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాలి. 600 చ.గ.ల కంటే ఎక్కువ విస్తీర్ణం, 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనాలకు సింగిల్‌ విండో విధానంలో జోనల్‌, ప్రధాన కార్యాలయాల్లో అనుమతి ఇస్తున్నారు.


ప్రత్యేక ప్రాజెక్టులు..

వారసత్వ సంపద, చెరువుల అభివృద్ధి, భూ సమీకరణ వంటి వాటికోసం మరో సెల్‌ పని చేయనుంది. ప్రధాన కార్యాలయంలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక విభాగం ఉంటుంది.


ప్లానింగ్‌, పాలసీ..

స్థానిక అభివృద్ధికి సంబంధించి ప్రాంతా ల వారీగా సమగ్ర ప్రణాళికల రూపకల్పన, శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రాంతాల్లో క్లిష్లమైన సమస్యలు, వాటి పరిష్కారానికి ఏం చేయాలన్నది ఈ సెల్‌ సూచిస్తుంది.


అభివృద్ధి..

రహదారుల విస్తరణ, ఆస్తుల సేకరణ, మిస్సింగ్‌/లింక్‌ రోడ్ల అభివృద్ధి కోసం జోనల్‌ కార్యాలయాల స్థాయిలో డిప్యూటీ సిటీ ప్లానర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తారు. రహదారులు, నాలాల విస్తరణ, ఆయా పనులకు సంబంధించి ఆస్తుల సేకరణ వంటి పనులను ఈ విభాగం చూసుకుంటుంది. 


అర్బన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌..

డిజిటల్‌ ఇంటి నెంబర్లు, భౌగోళిక సమాచార వ్యవస్థకు సంబంధించి ఈ సెల్‌ పని చేస్తుంది. ప్లానింగ్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో అప్‌డేటేడ్‌ జీఐఎస్‌ మ్యాప్‌ల రూపకల్పన, డిజిటల్‌ ఇంటి నెంబర్ల కేటాయింపుపై కసరత్తు చేస్తారు. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎ్‌సఏ) ద్వారా సేకరించిన తాజా శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా నగరానికి సంబంధించిన సమగ్ర మ్యాప్‌ రూపొందిస్తారు. రోడ్లు, భూ వినియోగం, భవనాలు, లే అవుట్లు, నాలాలు, చెరువులు, పార్కులు, తదితర 54 లేయర్లుగా మ్యాప్‌లో మార్క్‌ చేస్తారు. రెవెన్యూ, ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాలకు ఈ మ్యాప్‌ ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-12-03T17:01:06+05:30 IST