‘మత్తు’పై నిఘా

ABN , First Publish Date - 2022-01-20T06:35:21+05:30 IST

న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, నిరుపయోగంగా ఉన్న జీ ప్లస్‌ త్రీ గృహాలు, యార్డు రోడ్డు, న్యూ ఆర్‌ఆర్‌పేట రైల్వే ట్రాక్‌ రోడ్డు పరిసరాలు మత్తు బాబులకు స్థావరాలు..

‘మత్తు’పై నిఘా
న్యూఆర్‌ఆర్‌ పేట ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేస్తున్న అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు

నిర్మానుష్య ప్రాంతాల్లో స్పెషల్‌డ్రైవ్‌

సత్ఫలితాలు ఇస్తున్న అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసుల తనిఖీలు


అజిత్‌సింగ్‌నగర్‌, జనవరి 19 : న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, నిరుపయోగంగా ఉన్న జీ ప్లస్‌ త్రీ గృహాలు, యార్డు రోడ్డు, న్యూ ఆర్‌ఆర్‌పేట రైల్వే ట్రాక్‌ రోడ్డు పరిసరాలు మత్తు బాబులకు స్థావరాలు.. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని గంజాయి సేవించడం, సొల్యూషన్‌ పీల్చడం, మత్తు ఎక్కిన 

తర్వాత రోడ్లపైకి వచ్చి నానాయాగీ చేయడం వంటి ఘటనలు నిన్నామొన్నటి వరకు శివారు ప్రాంతాల్లో నిత్యకృత్యంగా ఉండేవి. ఆ స్థావరాలపై ఇప్పుడు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు నిఘా పెట్టారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నిత్యం స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తూ, మత్తుకు బానిసలైన వారిని గుర్తించేపనిలో నిమగ్నమయ్యారు. పట్టుబడిన వారికి స్టేషన్‌ ఆవరణలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించడం పనిగా పెట్టుకున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ సీఐ 

లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఎస్సైలు, సిబ్బంది, ఏఆర్‌ బలగాలు నిత్యం స్టేషన్‌ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మత్తుకు బానిసలైన వారిని ప్రత్యేక కౌన్సెలింగ్‌ కేంద్రాలకు పంపించి, ఆ వ్యసనం నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టేషన్‌ పరిధిలో ఇప్పటివరకు 200 మందికి పైనే యువత గంజాయి, ఇతర మత్తు 

పదార్థాలకు బానిసలైనట్టు గుర్తించారు. వీరందరికీ ఎక్కడి నుంచి మత్తు పదార్థాలు లభిస్తున్నాయో గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. న్యూరాజరాజేశ్వరిపేట కేర్‌ అండ్‌ షేర్‌ పాఠశాల విద్యార్థులు పలువురు చెప్పుల తయారీలో వినియోగించే సొల్యూషన్‌ పీలుస్తూ మత్తులో జోగుతున్నారనే ఫిర్యాదులు రావడంతో వెంటనే స్పందించి, విద్యార్థులను గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. సొల్యూషన్‌ విక్రయిస్తున్న దుకాణదారుడిపై కేసు నమోదు చేసి, రిమాండుకు పంపారు. పోలీసుల స్పెషల్‌డ్రైవ్‌తో కొంతకాలంగా అజిత్‌సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో గంజాయి, బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలకు చెక్‌ పడింది. తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని, తొలి విడత పట్టుబడిన వారికి హెచ్చరికలు, కౌన్సెలింగ్‌తో సరిపెడుతున్నామని, రెండో పర్యాయం దొరికితే కేసులు నమోదు చేస్తున్నామని సీఐ లక్ష్మీనారాయణ ఆంధ్రజ్యోతికి చెప్పారు.

Updated Date - 2022-01-20T06:35:21+05:30 IST