డుగ్గు.. డుగ్గు అంటే కుదరదు..

ABN , First Publish Date - 2021-10-20T16:06:12+05:30 IST

సిటీ పోలీసులు మంగళవారం బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. కొందరిని పట్టుకుని వారితోనే వాహనాల సైలెన్సర్లను తొలగింప చేశారు. నగర పోలీసు కమిషనర్‌...

డుగ్గు.. డుగ్గు అంటే కుదరదు..

నీ బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తా పా.. డుగ్గు.. డుగ్గు.. అన్న పాట ఎంత హిట్‌ అయినా, వాహనాల నుంచి కర్ణకఠోరమైన శబ్దాలు రావొద్దంటున్నారు సిటీ పోలీసులు.  భారీ శబ్దాలు చేసేలా సెలైన్సర్లను మాడిఫే చేసుకున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. శబ్ద కాలుష్యం పెంచడంతో పాటు, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని కట్టడి చేసేందుకు నడుం కట్టారు.


శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్న సైలెన్సర్లపై నజర్‌

సిటీ పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌ 

వెయ్యి సైలెన్సర్ల ధ్వంసం 

ఏడాదిలో 13 వేల కేసులు 

ఇకపై జరిమానాలు: సీపీ అంజనీకుమార్‌ 


హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌: సిటీ పోలీసులు మంగళవారం బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. కొందరిని పట్టుకుని వారితోనే వాహనాల సైలెన్సర్లను తొలగింప చేశారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ చౌహాన్‌ల పర్యవేక్షణలో ఈ ప్రత్యేక డ్రైవ్‌ సాగింది. వాహనదారులను హెచ్చరించడమే కాకుండా అలాంటి సైలెన్సర్‌లను తయారు చేయడానికి సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఆయా వాహనాలను మాడిఫై చేసే వాహనాల మెకానిక్‌లను, విడిభాగాలు అమ్మే ఆటోమొబైల్‌ దుకాణాల యజమానులను కూడా పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లను అమర్చవద్దని హెచ్చరించారు. స్పెషల్‌ డ్రైవ్‌లో వెయ్యి ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తొలగించారు. వాటిని రోడ్డుపై పెట్టి రోడ్డురోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. 


కఠిన చర్యలు

అంజనీకుమార్‌ మాట్లాడుతూ శబ్ద, వాయు కాలుష్యానికి పాల్పడే వాహన చోదకులపై కఠినంగా వ్యవహరించనున్నట్టు చెప్పారు. మొదటి సారి పట్టుబడితే రూ. వెయ్యి, రెండో సారి రూ. రెండు వేలు జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. అయినా తీరు మార్చుకోకపోతే వాహనదారుడి లైసెన్స్‌ రద్దు చేయనున్నట్టు వెల్లడించారు. సైలెన్సర్‌ ఎంత పొగ వదలాలి, శబ్దం ఎలా ఉండాలి అనే అంశంపై నిపుణులు ప్రయోగాలు చేసిన తర్వాతే వాహనాలు మార్కెట్‌లోకి వస్తాయని, వాటిని మాడిఫై చేస్తే వాయు కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీపీ అన్నారు. మెకానిక్‌లు, ఆటోమొబైల్‌ డీలర్లతో పాటు యువత, వారి తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాలపై ఫోకస్‌ చేయాలని సీపీ కోరారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T16:06:12+05:30 IST