చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 28: జిల్లావ్యాప్తంగా ఆదివారం, వచ్చేనెల 12, 13 వతేదీతేదీల్లో ఓటరు నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీఆర్వో ఎం.ఎ్‌స.మురళి పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలోని 3714 పోలింగ్‌కేంద్రాల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని పోలింగ్‌కేంద్రాల వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకు 18ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గాలు మారిన ఓటర్లు చిరునామా మార్చుకోవడానికి ఫారం-6, పేర్ల తొలగింపునకు, అభ్యంతరాల స్వీకరణకు ఫారం-7, తప్పుల సవరణ ఇతర మార్పుల కోసం ఫారం-8ను వినియోగించాల్సి ఉందన్నారు.