బైక్‌ రేస్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-06-27T06:17:43+05:30 IST

నగరంలో బైక్‌ రేస్‌లు జరుగుతున్నాయంటూ అందుతున్న సమాచారం మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌.శ్రీకాంత్‌ తెలిపారు.

బైక్‌ రేస్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌
లౌడ్‌ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి నిర్వీర్యం

నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌

631 లౌడ్‌ సైలెన్సర్ల ధ్వంసం

విశాఖపట్నం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): నగరంలో బైక్‌ రేస్‌లు జరుగుతున్నాయంటూ అందుతున్న సమాచారం మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌.శ్రీకాంత్‌ తెలిపారు. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శబ్ద కాలుష్యం వెదజల్లుతున్న ద్విచక్రవాహనాలకు చెందిన 631 లౌడ్‌ సైలెన్సర్లను పోలీసులు కొన్నాళ్లుగా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం వాటిని బీచ్‌ రోడ్డులోని పోలీస్‌మెస్‌ వద్ద రోడ్డు రోలర్‌తో తొక్కించి నిర్వీర్యం చేశారు.


ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ షోరూమ్‌ల నుంచి బైక్‌ను కొనుగోలు చేసినపుడు ఉన్న సైలెన్సర్లనే వాడాలని, ఫ్యాషన్‌ పేరుతో  మార్పులుచేసి శబ్దకాలుష్యానికి పాల్పడడం చట్టరీత్యా నేరమన్నారు. లౌడ్‌ సైలెన్సర్ల బైక్‌లు కారణంగా వెలువడే శబ్దం పక్కనుంచి వెళ్లే వాహన చోదకులు, ప్రజలకు తీవ్ర అసౌకర్యంతోపాటు అనారోగ్యానికి గురిచేసే ప్రమాదం ఉందన్నారు. దీనిపై చాలాకాలంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, అయినప్పటికీ తీరుమార్చుకోనివారి కోసం స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహించి సైలెన్సర్లను మార్చివేయించామన్నారు.


బీచ్‌ రోడ్డులో కొంతమంది యువకులు బైక్‌రేస్‌లు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులతో తరచూ స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల రేస్‌ల్లో పాల్గొన్న ఏడు వాహనాలను, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు కూడా మళ్లీ ప్రారంభించామని, చిక్కిన వారితే కోర్టు ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేయిస్టున్నట్లు తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏడీసీపీ అరీఫుల్లా, ట్రాఫిక్‌ ఏసీపీ కుమారస్వామి, సీఐలు లీలారావు, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-27T06:17:43+05:30 IST