పాస్టర్‌ ప్రవీణ్‌ అంటే వైసీపీ నేతలు ఎందుకు గజగజ వణికిపోతున్నారు?

ABN , First Publish Date - 2021-01-23T18:14:41+05:30 IST

ఆయనతో సన్నిహితంగా ఉన్న నేతలు, ప్రముఖులు, అధికారులు ఎందుకు గజగజ వణికిపోతున్నారు? ...

పాస్టర్‌ ప్రవీణ్‌ అంటే వైసీపీ నేతలు ఎందుకు గజగజ వణికిపోతున్నారు?

హిందూ దేవాలయాలపై తానే దాడి చేశానన్న పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో పోలీసులు తీగ లాగుతున్నారు. ఆయనకు చెందిన విద్యాసంస్థలపై సీఐడీ అధికారులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆయనపై గతంలో నమోదైన కేసులపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆయనతో సన్నిహితంగా ఉన్న నేతలు, ప్రముఖులు, అధికారులు ఎందుకు గజగజ వణికిపోతున్నారు? అధికార పార్టీ నాయకుల్లో భయం రేగడానికి అసలు కారణాలు ఏమిటి? వాచ్‌ దిస్‌ స్టోరీ..


 సెల్ఫీ వీడియో కలకలం..

హిందూ దేవాలయాలపై తానే దాడిచేశానని ప్రకటించిన కాకినాడ పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో చాలా ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను తానే కూల్చేశాననీ.. ఇలా చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్న సెల్పీ వీడియో కలకలం రేపుతోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టారనే  కారణంతో సీఐడీ పోలీసులు పాస్టర్ ప్రవీణ్‌ చక్రవర్తిని అరెస్ట్ చేసి లోతుగా విచారణ చేపట్టారు. కాకినాడ రూరల్‌, సామర్లకోట మండలాల పరిధిలో ఆయన నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో ముమ్మరంగా సోదాలు జరుపుతున్నారు.


అందుకేనా భయం..!?

అయితే పాస్టర్‌ అరెస్ట్‌ కావడంతో.. ఆయనతో సన్నిహిత సంబంధాలున్న తూర్పుగోదావరి జిల్లా ప్రముఖులు, రాజకీయ నేతలు, కొందరు అధికారుల్లో కలవరం రేగుతోంది. వీరిలో చాలామంది అధికార పార్టీ నేతలు ఎన్నికల పేరుతో భారీగా నిధులు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే పలు సామాజిక అవసరాల పేరుతో భారీగా నిధులు పిండుకున్నట్లు సమాచారం. ఇప్పుడు సీఐడీ తనిఖీల్లో ఆ ఆధారాలు ఏవైనా బయటకు పొక్కుతాయనే భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తితో చనువుగా ఉన్న కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉలిక్కిపడుతున్నారు. తమపై ప్రవీణ్‌ మరకలు పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పలువురు నేతలు, అధికారులు ఆయనతో ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి డిలీట్ చేస్తున్నట్లు సమాచారం.


మంత్రి కూడా ఆందోళన!?

మంత్రి కన్నబాబుకు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తితో కొన్నేళ్లుగా సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి సైతం ఒకింత ఆందోళనతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందూ సంఘాల నుంచి సెగ తగులుతుందేమోననే భయంతో..ఇప్పటికే ఆయన తనకు పాస్టర్‌కు ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ప్రవీణ్‌ చక్రవర్తి విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది కూడా భయపడుతున్నారు. ఇప్పటికే కొందరు సెలవుపై వెళ్లిపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.


ఈయన వెనుక ఎవరున్నారు..!?

మరోవైపు జిల్లా పోలీసులు కూడా ప్రవీణ్‌ చక్రవర్తికి సంబంధించిన కార్యకలాపాలపై దృష్టిసారించారు. ఆయన నేపథ్యం, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారు? ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారనే వివరాలను ఆరా తీసేపనిలో పడ్డారు. ఆయనపై గతంలో ఉన్న కేసులపై లోతుగా ఆరా తీస్తున్నారు. గతంలో తన దగ్గర పనిచేసే ఓ యువతిని పెళ్లి పేరుతో వచించి మోసం చేశారన్న ఆరోపణతో నమోదైన కేసును సర్పవరం పోలీసులు కూపీ లాగుతున్నారు. రాష్ట్రంలో 699 గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చేశానని పాస్టర్‌ ప్రవీణ్‌ అనడంతో.. ఆ గ్రామాలు జిల్లాలో ఎన్ని ఉన్నాయనేదానిపై అటు సీఐడీతోపాటు ఇటు జిల్లా పోలీసులు శూలశోధన చేస్తున్నారు. ఆ జాబితాలో జిల్లాలో ఎక్కడెక్కడ ఏఏ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చారనే దానిపై త్వరలో లోతుగా విచారించనున్నారు. ఇందుకోసం ఆయనకు జిల్లాలో ఎవరెవరు ఎలా సహకరించారనేదానిపై తీగ లాగుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల జరిగిన ఆలయాలపై దాడుల్లో పాస్టర్‌ ప్రవీణ్‌ పాత్ర ఎంత? ఈయన వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.


ఏమేం బయటికొస్తాయో..!?

ద్రాక్షారామానికి చెందిన పాస్టర్‌ చక్రవర్తి కొన్నేళ్లుగా క్రైస్తవ మతప్రచారకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు విదేశాల నుంచి భారీస్థాయిలో విరాళాలు కూడా అందుతున్నట్లు సమాచారం. విదేశీ నిధులతో కాకినాడ, సామర్లకోటలో మదర్‌ థెరిస్సా పేరుతో పలు పాఠశాలలు, కేటీసీ చిల్డ్రన్‌ హోం, సిలోన్‌ బ్లైండ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారని చెబుతారు. అయితే సామర్లకోట మండలం ఉండూరులో పీవీఆర్‌ఎం ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ పేరుతో విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. ఇందులో 90 శాతం వరకూ క్రైస్తవ మతానికి చెందిన వారికే సీట్లు ఇస్తున్నారట.


ఈ పాఠశాలల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. బాలికల కోసం స్కూళ్లు ఏర్పాటు చేసి అనాధలు, నిరుపేదలు, ఇటుకబట్టీల్లో పనిచేసే పిల్లలను తీసుకొచ్చి చదివిస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వారిని క్రైస్తవ మతంలోకి మార్చి..తద్వారా విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకుంటున్నట్టు అభియోగాలున్నాయి. ఈ వ్యవహారాలన్నింటిపై సీఐడీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.



Updated Date - 2021-01-23T18:14:41+05:30 IST