ఇంజెరి, గిన్నెలకోట పంచాయతీల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-08-17T06:37:42+05:30 IST

ఏజెన్సీలో పెదబయలు మండలం మారుమూల ప్రాంతం ఇంజెరి, గిన్నెలకోట పంచాయతీల్లోని గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

ఇంజెరి, గిన్నెలకోట పంచాయతీల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి
జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం 

పాడేరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో పెదబయలు మండలం మారుమూల ప్రాంతం ఇంజెరి, గిన్నెలకోట పంచాయతీల్లోని గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. ఏజెన్సీలోని మండలాధికారులతో మంగళవారం రాత్రి ఆయన నిర్వహించిన జూమ్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ముఖ్యంగా పెదబయలు మండలం ఇంజెరి, గిన్నెలకోట పంచాయతీల పరిధిలోని గ్రామాల్లోని గిరిజనుల వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులకు జాబ్‌కార్డులు జారీ చేసి, ఉపాధి పనులు కల్పించాలని, అందరికీ బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. అలాగే ఇంజెరి, గిన్నెలకోట పంచాయతీ కేంద్రాల్లో 15 రోజులు చొప్పున ఆధార్‌ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అన్ని రకాల కార్డులు, బ్యాంకుఖాతాలు ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించాలని డీఎల్‌పీవోను ఆదేశించారు. అలాగే కండ్రూం- ఇంజెరి మధ్య ఉన్న గెడ్డపై కల్వర్టు నిర్మించాలని పంచాయతీరాజ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరు చేయాలని హౌసింగ్‌ అధికారులను, తాగునీటి పథకాలను ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో గిరిజనులకు అటవీ హక్కు పత్రాలను మంజూరు చేయాలని ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T06:37:42+05:30 IST