ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-03-06T06:41:56+05:30 IST

ఆస్తిపన్నులు, నల్లాబిల్లులు, ట్రేడ్‌ లైసెన్సులు, ఇతరత్రా మున్సిపల్‌ పన్నుల వసూళ్లపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిసారించింది.

ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ వల్లూరు క్రాంతి

- వారంలో మూడురోజులపాటు మేళాలు 

- సెలవు రోజుల్లో కూడా పన్నుల స్వీకరణ 

- 90శాతం వడ్డీ మాఫీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి 

- కరీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ క్రాంతి 

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 5: ఆస్తిపన్నులు, నల్లాబిల్లులు, ట్రేడ్‌ లైసెన్సులు, ఇతరత్రా మున్సిపల్‌ పన్నుల వసూళ్లపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిసారించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి 31వ తేదీ నాటికి బల్దియాల్లో పన్ను వసూలు నూరుశాతం లక్ష్యం దిశగా మార్గనిర్ధేశనం చేసింది. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద 2019-20 వరకు చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీ 90శాతం మాఫీ చేస్తూ కేవలం 10శాతం వడ్డీ మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 31వ తేదీ వరకు వన్‌టైం సెటిల్‌మెంట్‌పథకాన్ని పొడిగించింది. సెలవురోజుల్లో కూడా పన్నులు స్వీకరించనున్నారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థకు ఆస్తిపన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 26 కోట్లు రావాల్సి ఉండగా, గత సంవత్సరం వరకు ఉన్న బకాయిలు మూడు కోట్లతో కలిపి మొత్తం రూ. 29 కోట్లు వసూలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు 10 కోట్ల 90 లక్షల రూపాయలు వసూలయ్యాయి. అలాగే నల్లా బిల్లుల ద్వారా 5.30 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ. 3 కోట్ల 30 లక్షలు మాత్రమే చెల్లించారు. ట్రేడ్‌ లైసెన్సు ఫీజుల ద్వారా రూ. 49 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేయగా రూ. 37 లక్షలు వసూలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వన్‌టైం సెటిల్‌మెంట్‌, మున్సిపల్‌లో నిర్వహిస్తున్న మేళాలతో పన్నుల వసూళ్లు గతంలో మాదిరిగా 90శాతానికి మించుతాయో లేక ఎలా ఉంటుందో వేచి చూడాలి.  


 పన్నులు చెల్లించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి 


నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తిపన్నులు, నల్లాబిల్లులు, ట్రేడ్‌ లైసెన్సులు, ఇతరత్రా పన్నులను ఈనెల 31వ తేదీ వరకు చెల్లించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి పేర్కొన్నారు. బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశమందిరంలో డిప్యూటీ మేయర్‌ చల్లస్వరూపరాణిహరిశంకర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆస్తిపన్ను, నల్లా బిల్లులు, ట్రేడ్‌ లైసెన్సు బకాయిల వివరాలను వెల్లడించారు. 19 కోట్ల ఆస్తిపన్నులు, 3.30 కోట్ల నల్లాబిల్లులు, 11.59 లక్షల ట్రేడ్‌ లైసెన్సుఫీజుల బకాయిలు ఉన్నాయని చెప్పారు. 


Updated Date - 2021-03-06T06:41:56+05:30 IST