ఉన్నత విద్యకు ప్రత్యేక నిధి

ABN , First Publish Date - 2021-02-28T09:06:50+05:30 IST

ఉన్నత విద్యాభ్యాసం ఈ రోజుల్లో ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ పోటీ యుగంలో నచ్చిన ఉద్యోగాన్ని సంపాదించుకుని బాగా స్థిరపడాలంటే అందుకు తగినట్టుగా చదవాల్సిందే.

ఉన్నత విద్యకు ప్రత్యేక నిధి

మీ పిల్లల బంగారు భవితకు పునాది 


ఉన్నత విద్యాభ్యాసం ఈ రోజుల్లో  ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ పోటీ యుగంలో నచ్చిన ఉద్యోగాన్ని సంపాదించుకుని బాగా స్థిరపడాలంటే అందుకు తగినట్టుగా చదవాల్సిందే.  ఇందుకు తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అందరు తల్లిదండ్రులకు అంత స్థోమత ఉండకపోవచ్చు. పిల్లలకు మంచి విద్యను అందించి, వారిని ఉన్నత స్థాయిలో చూడాలనుకునే తల్లిదండ్రులు అందుకు అవసరమైన సొమ్మును పోగేయడానికి స్వల్ప, దీర్ఘకాలానికి ప్రణాళికా బద్ధంగా వ్యవరించాల్సి ఉంటుంది. అప్పుడే ఇబ్బంది లేకుండా పిల్లల చదువులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అందుకు ఏం చేయాలంటే..


  లక్ష్యానికి అనుగుణంగా..

నేటి తరం పిల్లలు విభిన్న రకాల కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. వారి ఎంపికకు అనుగుణంగా తల్లిదండ్రులు డబ్బును సమకూర్చితే వారి చదువులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అన్ని ఖర్చుల మాదిరిగానే విద్యా వ్యయం, పిల్లల వ్యక్తిగత ఖర్చులు భారీగా పెరిగాయి. పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనుకునే తల్లిదండ్రులు అందుకు తగ్గట్టుగానే సిద్ధం కావాల్సి ఉంటుంది. మీ పిల్లల చదువులకు ఎంత ఖర్చు అవుతుందో ఒక అంచనాకు వచ్చిన తర్వాత అంత సొమ్మును సమకూర్చుకోవడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.


ఆదాయాన్ని పెంచే విభిన్న రకాల పెట్టుబడి మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, పొదుపు పథకాలు ఇలాంటివి సంపాదనను పెంచేందుకు దోహదపడతాయి. వీటిని మీరు తీసుకునే రిస్క్‌ను బట్టి ఎంచుకోవడం మంచిది. ఎన్ని సంవత్సరాల్లో మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో అందుకు దోహదపడేదాన్ని ఎంచుకోవాలి. ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి వీటిలో పెట్టుబడులు పెట్టేముందు తగినంత పరిజ్ఞానం, అప్రమత్తత అవసరం.     

     

ఇక బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై నిర్దేశిత కాలానికి వడ్డీ ఆదాయం లభిస్తుంది. రికరింగ్‌ డిపాజిట్ల ద్వారా కూడా డబ్బును నెలనెలా పోగు చేసుకోవచ్చు. అయితే స్థిర ఆదాయాన్నిచ్చే వాటికన్నా ఈక్విటీలు ఎక్కువ రిటర్నును ఇచ్చే అవకాశాలు దీర్ఘకాలంలో ఉంటాయి. రిస్క్‌ ఎందుకు అనుకునే వారు క్రమానుగత పెట్టుబడి పథకాలు (సిప్‌) ఎంచుకోవచ్చు. ఆదాయాన్ని పెంచుకోవాలనుకునే వారు సిప్‌లలో పెట్టుబడులను పెంచుకుంటూ పోవడం మంచిది.                                                                                                                                                                                                                                 

వీలైనంత త్వరగా..

పిల్లల చదువులకు వెచ్చించే మొత్తం ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రస్తుత ఖర్చులను భరిస్తూ భవిష్యత్తుకు అవసరమైన సొమ్మును కూడబెట్టేందుకుగాను నెలవారీగా కొంత మొత్తాన్ని పక్కకు పెట్టాల్సి ఉంటుంది. ఆ సొమ్మును ఎక్కువ రాబడిని ఇచ్చే వాటిలోకి మళ్లించడం వల్ల అధిక ప్రయోజనం పొందవచ్చు.  ఈ  పనిని వీలైనంత త్వరగా ప్రారంభిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. 


టర్మ్‌ పాలసీ...

మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే పిల్లల చదువులకు అవసరమైన నిధిని సమకూర్చేందుకు దోహదపడే పెట్టుబడులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకే  మీ బీమా కవరేజీని లెక్కించుకునే సందర్భంలో పిల్లల ఉన్నత విద్యకు అవసరమైన నిధిని కూడా  మనసులో పెట్టుకోండి. తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ మొత్తానికి టర్మ్‌ పాలసీ లభిస్తుంది. కాబట్టి ఉన్నత విద్యా వ్యయాలను కవర్‌ చేసే విధంగా ఉండే టర్మ్‌ పాలసీ తీసుకోవడం మంచిది. ఇప్పటికే టర్మ్‌ పాలసీ తీసుకుని ఉండి పిల్లల ఉన్నత విద్య నిధి కోసం పెట్టుబడులు ప్రారంభించాల్సి ఉన్నవారు తమ లక్ష్యానికి  సమానమైన అదనపు టర్మ్‌ పాలసీ తీసుకునే ఆలోచనచేయడం మేలు. 


పెట్టుబడులు సమీక్షించుకోండి...

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే వాటి పనితీరు ఏవిధంగా ఉందో  తరచుగా సమీక్షించుకోవడం మంచిది. ఒకవేళ  మీరు  ఎంచుకున్న పథకం తగినంత ప్రతిఫలాలు అందించని పక్షంలో మీ పెట్టుబులను మరింత మరింత మెరుగైన పథకాలకు మళ్లించుకుంటే బాగుంటుంది.

Updated Date - 2021-02-28T09:06:50+05:30 IST