Andhra pradesh లో దేవుడి డబ్బుకు లెక్కేదీ...!?

ABN , First Publish Date - 2022-03-03T14:29:07+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో రోజువారీ పూజలు, అన్నదానం, ఉత్సవాలు ప్రతి దాంట్లో...

Andhra pradesh లో దేవుడి డబ్బుకు లెక్కేదీ...!?

  • ఆలయాల్లో తేలని మొత్తం 15,730 కోట్లు!
  • నైవేద్యం, అన్నదానం ఖర్చులపై సందేహాలు
  • చివరకు పూలు, పళ్ల లెక్కల్లోనూ తేడా
  • దేవస్థానాల ఈవోలు చెప్పేదానికి..
  • వాస్తవాలకు పొంతన లేదు
  • ఆడిట్‌ అభ్యంతరాలు 5.84 లక్షలు
  • ఒక్క శ్రీశైలం దేవస్థానంలోనే
  • 300 కోట్ల వ్యయం తేలాలి
  • సింహాచలంలో రూ.138 కోట్లు
  • కాణిపాకం-89 కోట్లు, శ్రీకాళహస్తి-84 కోట్లు
  • విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోనూ
  • రూ.50 కోట్ల ఖర్చుకు లెక్కల్లేవు
  • అభ్యంతరాలన్నీ దీర్ఘకాలంగా పెండింగ్‌
  • పరిష్కారం పట్టని ఉన్నతాధికారులు

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో రోజువారీ పూజలు, అన్నదానం, ఉత్సవాలు ప్రతి దాంట్లో కార్యనిర్వహణాధికారులు (ఈవోలు) చెప్పే లెక్కలకు వాస్తవాలతో సరిపోలడం లేదు. రూ.15,730 కోట్ల నగదుకు లెక్కలు తేలాల్సి ఉన్నా ఉన్నతాధికారులు నిమ్మళంగా ఉంటున్నారు. ఇప్పటివరకూ 5,84,443 ఆడిట్‌ అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  ట్రస్టు బోర్డులు, రాజకీయ నాయకులతో ప్రమేయం ఉన్న ఫైళ్లను ఆగమేఘాలపై క్లియర్‌ చేస్తున్న దేవదాయ శాఖ.. ఆలయాలకు నష్టం చేస్తున్న రూ.వేల కోట్ల అంశాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. దేవదాయ కమిషనరేట్‌ సైతం ఉదాశీనంగా ఉండడంతో ఈవోలు మరింత తాత్సారం చేస్తున్నారు. రూ.18 వేల కోట్లకు సంబంధించి నిరుడు సెప్టెంబరు నాటికి 6.06 లక్షల అభ్యంతరాలు ఉండగా.. ఆ తర్వాత కొన్ని పరిష్కారమయ్యాయి. కానీ గత 20 రోజుల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదు. 


వాస్తవానికి ఆలయాల్లో చేస్తున్న ఖర్చులు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయని, వీటికి లెక్కాపత్రం లేకుండాపోతున్నాయని విమర్శలున్నాయి. చాలాకాలంగా ఆడిట్‌ లెక్కలు పెండింగ్‌లో ఉండడంతో మొత్తం లెక్క తేల్చాలని గతేడాది అక్టోబరులో దేవదాయ కమిషనర్‌ ఆడిట్‌ శాఖకు లేఖ రాశారు. అప్పటికి మొత్తం అభ్యంతరాలు 23 లక్షలనీ, వాటికి సంబంధించిన నగదు రూ.951 కోట్లనీ అంచనా వేశారు. కానీ ఆడిట్‌ శాఖ లెక్కలపై పరిశీలన మొదలుపెట్టగానే అనూహ్యంగా ఆ విలువ వేల కోట్లకు చేరింది. ఆలయాల జీర్ణోద్ధరణ పనులు, ప్రసాదాలు, ఉత్సవాల ఖర్చులు, ఆలయాల ముందు వేసే పందిళ్లు, పూలు ఇలా అన్నింట్లోనూ లెక్కలు గందరగోళంగా ఉన్నాయని ఆడిట్‌ తనిఖీల్లో తేలింది. అనేక చోట్ల ఈవోలు తాత్కాలిక పద్దు రాసి, తుది లెక్కల మదింపు లేకుండానే కాలం వెళ్లదీస్తున్నారని వెలుగులోకి వస్తోంది.


పెద్ద ఆలయాల్లోనే ఎక్కువ..

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఆలయాల్లోనే ఆడిట్‌ అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క శ్రీశైలం దేవస్థానంలోనే 3,390 పెండింగ్‌లో ఉన్నాయి. రూ.300.38 కోట్ల నగదు దీనితో ముడిపడి ఉంది. దేనికెంత ఖర్చుచేశారో చెప్పడంలో అధికారులు విఫలమవుతున్నారు. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయంలో రూ.138 కోట్లు, కాణిపాకం-రూ.89 కోట్లు, శ్రీకాళహస్తి-రూ.84 కోట్లు విజయవాడ కనకదుర్గమ్మ గుడి-రూ.50 కోట్లు, అన్నవరం-రూ.19 కోట్లు, ద్వారకాతిరుమల-రూ.5.81 కోట్ల వరకు ఆడిట్‌ అభ్యంతరాల్లో ఉండిపోయాయి. ఆ నగదు ఖర్చుపై ఆడిట్‌ శాఖ అనేక అభ్యంతరాలు లేవనెత్తినా అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు.


చిన్న ఆలయాల్లోనూ అంతే!

భారీ లావాదేవీలు ఉండే పెద్ద ఆలయాలతో పాటు ఆ తర్వాత కేటగిరీలోని 6(బి), తక్కువ ఆదాయం ఉండే 6(సి) ఆలయాల్లోనూ ఆడిట్‌ అభ్యంతరాలు ఉండడం విశేషం. 6(బి) ఆలయాలకు ఏటా డిప్యూటీ కమిషనర్లు బడ్జెట్లు మంజూరుచేస్తారు. ఆలయం అడిగినంత ఇవ్వడం తప్ప వాటిలో ఖర్చులు ఎలా చేస్తున్నారు.. పెరిగితే ఎందుకు పెరిగాయనే వాటిపై దృష్టే పెట్టడం లేదు. అయితే బడ్జెట్‌ మంజూరు సమయంలో కమీషన్ల తతంగం నడుస్తోందని.. ఆ సమయంలోనే అధికారులకు భారీగా ముడుపులు వస్తాయని, అందువల్లే వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 


దేవాలయాల్లో రూ.15,730 కోట్లకు లెక్కలు తేలడం లేదు. ఈవోలు చెప్పే లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే ఉండడం లేదు. దేవుడికి పెట్టే నైవేద్యం, అన్నదానం నుంచి పూలు, పళ్ల వరకూ ప్రతి దాంట్లో తేడా కనిపిస్తోంది. వీటిపై ఆడిట్‌ శాఖ అభ్యంతరాలు లేవనెత్తినా ఫలితం ఉండడం లేదు. పాత లెక్కలే కాదు.. కొత్త లెక్కలదీ అదే దారి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ఈవోల చేతివాటంతో లెక్కలేనన్ని అవకతవకలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-03-03T14:29:07+05:30 IST