ముచ్చింతల్‌‌లో భక్తజన సంద్రం.. వంటకాలు సరిపోక అవస్థలు..!

ABN , First Publish Date - 2022-02-07T18:40:01+05:30 IST

ముచ్చింతల్‌ని సమతామూర్తి దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది...

ముచ్చింతల్‌‌లో భక్తజన సంద్రం.. వంటకాలు సరిపోక అవస్థలు..!

  • సమతామూర్తిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు
  • భక్తిపారవశ్యంతో పరమేష్టి, వైభవేష్టి యాగాలు
  • శ్రీరామనగరానికి సిటీ బస్సులు

రంగారెడ్డి అర్బన్‌/శంషాబాద్‌ రూరల్‌/ షాద్‌నగర్‌/ శంషాబాద్‌/ కొత్తూరు : ముచ్చింతల్‌ని సమతామూర్తి దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది.    రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని తిలకించేందుకు బారులు దీరారు. యజ్ఞమహోత్సవంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రవచనశాలలో జీయర్‌స్వాముల ప్రవచనాలు విని తరించారు. ఐదోరోజు వేద ప్రధాన యాగశాలలో పరమేష్టి, వైభవేష్టి యాగాలు జరిగాయి. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించారు. 


సింహాచలం వేదపండితులు, టీపీ రాఘవాచార్యులు రామానుజ వైభవం ప్రవచన కార్యాక్రమాలను నిర్వహించారు. యాగశాల ఎదుట తలకొండపల్లికి చెందిన 28మంది కళాకారులు (సంయుక్త గ్రూపు)చేసిన చిడతల భజన ఆకట్టుకుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కళాకారులు పెద రామానుజాచార్యులను కీర్తిస్తూ చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వంటకాలు సరిపోక భరద్వాజ భోజనశాలల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. ముచ్చింతల్‌కు వచ్చే దారులన్నీ వాహనాల రాకపోకలతో బిజీగా మారాయి. శ్రీరామనగరానికి ఆర్టీసీ అధికారులు సిటీ బస్సులను నడిపించారు. ఆశ్రమానికి వచ్చిపోయే భక్తులతో బస్టాండ్‌ ప్రాంగణాలు కిటకిటలాడాయి.


ప్రముఖుల రాక..

తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీ‌ష్ చంద్రశర్మ, హైకోర్టు జస్టిస్‌ పొనగంటి నవీన్‌రావు, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తదితరులు ముచ్చింతల్‌కు వచ్చి సమతామూర్తిని దర్శించుకున్నారు.


మన లోపలే భగవంతుడున్నాడు..

మనుషులందరిలోనూ భగవంతుడున్నాడని.. ఇది గుర్తించి నడుచుకునే వారే మంచి మనుషులవుతారని చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. ‘దివ్యక్షేత్రం’లో ఆదివారం ఆయన మాట్లాడారు. రాముడు... దేవుడా? మనిషా? అనే సందేహాలు కొందరిలో ఉన్నాయన్నారు. రాముడు మనిషి రూపంలోని దేవుడేనన్నారు. మనుషులందరిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పారు. మనలోపల ఉండే దేవుడు ఆయన తత్వంతో మనల్ని నడిపిస్తాడని.. అదిలేని రోజు ఈ లోకాన్నే విడిచి వెళ్లాల్సి ఉంటుందన్నారు. మన దేహం దేవుని ఇల్లు అని.. ఇది గుర్తించిన వారు మంచి మనుషులవుతారన్నారు. మన గ్రంఽథాలు, ఇతిహాసాలు, ధర్మాలు, పురాణాల గురించి మనం తెలుసుకోవాలి.. మన పిల్లలకు చిన్నవయసులోనే నేర్పాలని చినజీయర్‌ స్వామి సూచించారు. 


తప్పిపోయిన బాలిక.. తల్లిదండ్రుల చెంతకు..

సహస్రాబ్ది ఉత్సవాలకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓ బాలిక తప్పిపోయింది. నగరంలోని బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం సమతామూర్తి విగ్రహం తిలకిస్తుండగా, వారి మూడేళ్ల బాలిక తప్పిపోయింది. వెంటనే అప్రమతమైన పోలీసులు తప్పిపోయిన బాలికను వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు.


తొలి విప్లవకారుడు రామానుజాచార్యులు

రామానుజాచార్యులు తొలి విప్లవకారుడని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. పవన్‌తోపాటు మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు చినజీయర్‌ స్వామి మంగళాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు ఆలయ ప్రవేశం లేనప్పుడు వారితో ఆలయ ప్రవేశం చేయించిన గొప్ప విప్లవ నాయకుడు రామానుజాచార్యులని కొనియాడారు. మన మతంలో తప్పొప్పులు ఉంటే ప్రశ్నించే, నిలదీసే హక్కు మనకుందని తెలిపారన్నారు. చినజీయర్‌ స్వామి మహా సంకల్పంతో దేశమంతా తెలిసేలా 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని దివ్యసాకేత క్షేత్రంలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్‌లో తాను రామానుజాచార్యుల స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని పవన్‌కల్యాణ్‌ చెప్పారు.


అమెరికా నుంచి వచ్చా..

శ్రీరామానుజాచార్యుల సమస్రాబ్ది ఉత్సవాలకు అమ్మానాన్నలతో కలిసి అమెరికా నుంచి వచ్చాను. పూర్ణాహుతి యాగంలో పాల్గొని చిన జీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకోవడంతో నా జన్మ ధన్యమైంది. ఉత్సవాలు ముగిసే వరకు ఇక్కడే ఉండి నిత్య పూజలు  నిర్వహిస్తా. - కేశవ్‌, యూఎస్‌ఏ


మరో తిరుపతిగా.. 

సమతామూర్తి కేంద్రం గొప్ప పుణ్యక్షేత్రం కానుంది. చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ ప్రాంతం మరో తిరుపతి పుణ్యక్షేత్రంగా మారబోతోంది.- సునీత, విజయవాడ


నేటి కార్యక్రమాలు

ఉదయం : అకాలవృష్టి నివారణ, సస్యవృద్ధికి వైయ్యూహికేష్టి యాగం, వ్యక్తిత్వ వికాసానికి యాగాలు నిర్వహిస్తారు. ఆత్మోజ్జీవన కోసం శ్రీకృష్ణ, అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు


సాయంత్రం : ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి.


నేడు ఏపీ సీఎం జగన్‌ రాక

రామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం ముచ్చింతల్‌కు రానున్నారు. సోమవారం సాయంత్రం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 4.30గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో ముచ్చింతల్‌కు వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని దర్శించి తిరిగి తాడేపల్లి వెళతారు. జగన్‌ రాక నేపథ్యంలో ముచ్చింతల్‌ వద్ద పోలీసులు ట్రయల్‌రన్‌ నిర్వహించారు.

Updated Date - 2022-02-07T18:40:01+05:30 IST