గతంలో తూతూమంత్రంగానే.. ఈసారైనా KCR సర్కార్ కరుణించేనా..!?

ABN , First Publish Date - 2022-03-07T13:05:25+05:30 IST

‘‘హైదరాబాద్‌ మహానగరాభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తాం. రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేస్తాం. అన్ని సంస్థలనూ బలోపేతం చేస్తాం’’ అంటూ..

గతంలో తూతూమంత్రంగానే.. ఈసారైనా KCR సర్కార్ కరుణించేనా..!?

  • బడ్జెట్‌పై స్థానిక సంస్థల ఆశలు
  • గ్రేటర్‌ అభివృద్ధిపై ప్రభావం
  • తాజా బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుందని అంచనాలు

హైదరాబాద్ సిటీ : ‘‘హైదరాబాద్‌ మహానగరాభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తాం. రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేస్తాం. అన్ని సంస్థలనూ బలోపేతం చేస్తాం’’ అంటూ పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు గుప్పించారు. కానీ, బడ్జెట్‌లో ఆ స్థాయిలో కేటాయింపులు ఉండడం లేదు. ఫలితంగా స్థానిక సంస్థలు అప్పుల కుప్పలుగా మారాయి. విధిగా చేయాల్సిన పనులూ చేయలేని దుర్భరస్థితికి చేరుకున్నాయి. మహానగరవాసులకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన జీహెచ్‌ఎంసీ దివాళా తీసే పరిస్థితి. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కూ ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. ఇతర సంస్థలూ అదే దారిలో ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక విభాగం నేడు ప్రవేశపెట్టనున్న పద్దులో కనీస స్థాయిలో కేటాయింపులు ఉంటాయా, లేదా అనేది ఆసక్తిగా మారింది. 


అప్పులు తీరేనా.. జీహెచ్‌ఎంసీ ఎదురుచూపులు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ అభివృద్ధికి సర్కారు కనీస కేటాయింపులు చేయడం లేదు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు చేపట్టి స్థానిక సంస్థలపై భారం మోపడం తప్పా పెద్దగా చేసిందేం లేదు. దీంతో జీహెచ్‌ఎంసీ అప్పుల కుప్పగా మారింది. వేతనాల చెల్లింపులు కూడా గగనంగా మారాయి. 


రూ. 2, 200 కోట్లకు ప్రతిపాదనలు

ప్రభుత్వం నుంచి జీహెచ్‌ఎంసీకి గ్రాంట్ల రూపంలో నిధుల విడుదల నామమాత్రంగా ఉంది. సర్కారీ భవనాల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలూ రూ.వందల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ రకాల ఫీజులు, యూజర్‌ చార్జీలు, ఎస్టాబ్లిష్‌మెంట్‌ వ్యయం, 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులూ పూర్తిస్థాయిలో విడుదల చేయడం లేదు. ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, రెండు పడకల ఇళ్లు,  లింక్‌ రోడ్ల నిర్మాణం, ఇతరత్రా గ్రాంట్ల రూపంలో రూ.2200 కోట్లు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సర్కారు ఏం చెబుతుందో నేడు చూడాలి.


4,500 కోట్లకు పైగా అప్పు

జీహెచ్‌ఎంసీ ఇప్పటికే రూ.4500 కోట్లకుపైగా అప్పులు చేసింది. వీటి కోసం నెలకు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు వడ్డీలు చెల్లిస్తోంది. త్వరలో వాయిదాలూ ప్రారంభమవుతాయి. సంస్థకు సగటున నెలకు రూ.280 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. ఇందులో రూ.140 కోట్లు వేతనాలు, ఫించన్లకే ఖర్చవుతుంది. రూ.40 కోట్ల రుణాల చెల్లింపులు పోతే.. మిగిలిన రూ.80 కోట్లతో పారిశుధ్య నిర్వహణ, రోడ్ల నిర్మాణం/నిర్వహణ వంటివి చేపట్టడం దాదాపుగా అసాధ్యం.


మూసీకి నిధుల వరద..?

మూసీనది అభివృద్ధికి రూ.3 వేల కోట్లతో ప్రణాళికలున్నాయి. ఎంఆర్‌డీసీఎల్‌ ఏర్పాటు చేసిన క్రమంలో బడ్జెట్‌లో ఈ సారి రూ.300కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు కేటాయింపులు ఉండే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.


రూ.2500 కోట్లు అవసరం

నగరంలో సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) ప్రారంభించింది. రూ.29 వేల కోట్ల పైచిలుకు అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించింది. వివిధ దశల్లో రూ.6 వేల కోట్ల మేర పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రూ.3500 కోట్లు ఖర్చయ్యాయి. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు మరో రూ.2500 కోట్లు అవసరం.


ఔటర్‌ రుణాలు చెల్లించేందుకు..

ఔటర్‌ రింగ్‌ రోడ్డు కాంట్రాక్టర్లకు యాన్యూటీ కోసం ఏటా రూ.338.52 కోట్లు చెల్లించాల్సి ఉంది. గతేడాది రూ.472.1కోట్లను సర్కారు కేటాయించింది. అంతకు ముందు లక్షల్లోనే కేటాయింపులు ఉండేవి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఔటర్‌ రుణాల చెల్లింపు కోసం, గతంలో ఉన్న బకాయిలను కలుపుకొని సుమారు రూ.1200 కోట్ల వరకు సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

Updated Date - 2022-03-07T13:05:25+05:30 IST