Child Care: పేరెంట్స్.. బీ అలర్ట్.. చిన్న పిల్లల కాళ్లపై ఇలా వస్తే..

ABN , First Publish Date - 2022-08-07T21:26:48+05:30 IST

అయిదేళ్ల లోపు పిల్లలను కొత్త రకం జబ్బు పట్టి పీడిస్తోంది. పిల్లల నాలుక, చేతులు, కాళ్లపై దద్దుర్లు లేస్తుండటంతో..

Child Care: పేరెంట్స్.. బీ అలర్ట్.. చిన్న పిల్లల కాళ్లపై ఇలా వస్తే..

చిన్నారులను వేధిస్తున్న వైరస్‌..

నాలుక, చేతులు, కాళ్లపై దద్దుర్లు

లక్షణాలను బట్టి చికిత్స: వైద్యులు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): అయిదేళ్ల లోపు పిల్లలను కొత్త రకం జబ్బు పట్టి పీడిస్తోంది. పిల్లల నాలుక, చేతులు, కాళ్లపై దద్దుర్లు లేస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళనతో వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నెల రోజుల నుంచి ఈ తరహా కేసులు వస్తున్నట్లు చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు. ఈ రకం జబ్బును ‘హ్యాండ్‌, పుట్‌ మౌత్‌ డీసీజ్‌’గా వ్యవహారిస్తున్నారు.


అల్సర్‌ మాదిరిగా మొదలై..

ఈ తరహా ఇన్‌ఫెక్షన్‌ పిల్లల శరీరంపై అల్సర్‌ మాదిరిగా కనిపిస్తాయి. నోట్లో, చేతులు, పాదాలు, పిరుదులు మరికొన్నిసార్లు జననేంద్రియాలపై పుండ్లు ఏర్పడుతాయని వైద్యులు తెలిపారు. ఈ పుండ్లు కాలిన బుడగల మాదిరిగా ఉంటాయని, నోట్లో పుండ్ల వల్ల పిల్లలు మింగడానికి  ఇబ్బందులు పుడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ పుండ్ల నుంచి స్రావాలు వస్తాయి. ఈ స్రావాలను ఎవరైనా తాకితే వారికీ ముప్పు ఉంటుంది. పెద్ద వాళ్లకు కూడా సోకే అవకాశముంటుంది. పెద్ద వారికి జ్వరం వస్తుంది. ఈ జబ్బు వారంలో తగ్గిపోతుంది. కానీ పిల్లలు వారం రోజుల పాటు నొప్పి, జ్వరంతో బాధపడుతుంటారు. ఈ నొప్పి నివారణకు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. లక్షణాల ఆధారంగా జబ్బుకు చికిత్స చేయాలని  పిల్లల వైద్యులు సూచిస్తున్నారు. నెల రోజుల క్రితం ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కేరళలో వచ్చిందన్నారు.


ఒకరి నుంచి మరొకరికి..

ఏడాది నుంచి అయిదేళ్ల పిల్లలలో ఈ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. పిల్లల శరీరంపై చిన్న కురుపులు, అల్సర్‌ మాదిరిగా ఉండడంతో వీటిని చికెన్‌ పాక్స్‌గా భావిస్తున్నారని వైద్యులు వివరించారు. అది చికెన్‌ పాక్స్‌ కాదని, వైద్యుల వద్దకు వెళ్లి లక్షణాల ఆధారంగా చికిత్సలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తుందన్నారు. ఇది సీజనల్‌ ఇన్‌ఫెక్షన్‌ కావడంతో ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ముప్పు ఉందన్నారు. 


గుర్తించాలి ఇలా...

వైరస్‌ సోకిన పిల్లల శరీరం మొదట చిన్న కురుపుల వలే వచ్చి త్వరగా బుడగలుగా మారుతాయి. వాటి నుంచి స్రావాలు వస్తాయి. ముక్కు నుంచి నీటి దారాలు, నోటి నుంచి లాలాజలం వస్తుంది. ఇది త్వరగా శరీరంపై విస్తరించే ముప్పు ఉంటుంది. వారం రోజులలో వైరస్‌ తీవ్రత తగ్గినప్పటికీ శరీరంపై ఇన్‌ఫెక్షన్‌ ఆనవాలు, మచ్చలు, వారాలు, నెల పాటు ఉండే అవకాశముంటుందని వైద్యులు పేర్కొన్నారు.


పరిశుభ్రతతో చెక్‌

ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. పిల్లలు వినియోగించే టేబుల్‌, బొమ్మలు, ఇతర వస్తువులను ఎప్పుడు తుడవాలి. క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయాలి. ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన పిల్లలను ప్రత్యేకంగా ఉంచాలి. ఎవరినీ తాకనీయవద్దు. స్కూల్స్‌కు పంపించవద్దు. ఒక చోట కుదురుగా ఉంచాలి. వారు ధరించిన దుస్తులను ఎవరూ తాకకుండా, ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉతికించాలి. పిల్లలు బాత్రుం వెళ్లిన ప్రతిసారి చేతులు, కాళ్లు శుభ్రం కడుక్కోవాలని చెప్పాలి. బాత్రూంను నీటితో శుభ్రం చేయాలి. నోటిలో పుండ్లు ఉండడం వల్ల ఆహారం మింగలేక ఇబ్బంది పడుతారు. దీంతో పిల్లలు నీరసించి పోతారు. వారికి ద్రవ రూపంలో ఉండే ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. లక్షణాలను బట్టి వైద్యం అందించాల్సి ఉంటుంది. 


-డాక్టర్‌ సత్యనారాయణ కావలి, పిల్లల వైద్యుడు, రెయిన్‌బో పిల్లల ఆస్పత్రి

Updated Date - 2022-08-07T21:26:48+05:30 IST