HYD : నత్త నవ్విపోయేలా పనులు.. మళ్లీ ఆగమైపోతామా..!?

ABN , First Publish Date - 2022-05-21T15:25:18+05:30 IST

నత్త నవ్విపోయేలా పనులు.. మళ్లీ ఆగమైపోతామా..!?

HYD : నత్త నవ్విపోయేలా పనులు.. మళ్లీ ఆగమైపోతామా..!?

  • కొనసా...గుతున్న ఎస్ఎన్‌డీపీ పనులు
  • మెజార్టీ ప్రాంతాల్లో 50 శాతంలోపే..
  • అసంపూర్తి పనులతో ముంపు ముప్పు
  • గతంతో పోలిస్తే మరింత ఎక్కువే..?
  • వరద ప్రవాహానికి నిర్మాణ ప్రతిబంధకాలు
  • ఉన్నత స్థాయి పర్యవేక్షణ కరువు
  • క్షేత్రస్థాయి సందర్శనలూ లేవు
  • ముఖ్యమైన పనులు పట్టించుకోని ఉన్నతాధికారులు


ఇది వీఎస్‌టీ- విద్యానగర్‌ మార్గంలోనిది. నాలా బాక్స్‌ కల్వర్ట్‌ నిర్మాణానికి రోడ్డు (Roads) మూసి వేసి పనులు చేస్తున్నారు. నెలలు గడుస్తోన్నా.. పనులు పూర్తవకపోవడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఇది నల్లకుంట మార్కెట్‌ రోడ్డులో పరిస్థితి. వరద నీటి డ్రైన్‌ నిర్మాణం కోసం కొన్నాళ్ల క్రితం రహదారి తవ్వారు. ఇప్పటికే అకాల వర్షాలు కురుస్తుండగా.. రెండు వారాల్లో మాన్‌సూన్‌ మొదలు కానుంది. ఇంకా 30 శాతం పనులు కూడా పూర్తవని నేపథ్యంలో వర్షాకాలంలో పరిస్థితేంటన్నది అగమ్యగోచరంగా మారింది.


ఇవేకాదు.. వరద నీటి ప్రవాహ వ్యవస్థ మెరుగుదల, ముంపు ముప్పునకు చెక్‌ పెట్టేందుకు వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ)లో భాగంగా జీహెచ్‌ఎంసీ పనులు ప్రారంభించిన మెజార్టీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.


హైదరాబాద్‌ సిటీ : నాలా పనులు నత్త నవ్విపోయేలా సా..గుతుండగా నెత్తి మీదికొచ్చిన వానాకాలం (Rainy Season) నగరవాసిని బెంబేలెత్తిస్తోంది. అసంపూర్తి పనులతో మళ్లీ ముంపు తప్పదా అన్న ఆందోళన కనిపిస్తోంది. గతంలో వర్షం కురిస్తే కొంత మేరయినా.. వరద నీరు వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఎక్కడికక్కడ తవ్వడం, అభివృద్ధి/విస్తరణలో భాగంగా పూర్వ ప్రవాహ వ్యవస్థ సాఫీగా లేకపోవడంతో వరద ఎటు వెళ్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పనితీరు, పురోగతిని పరిశీలిస్తే.. సమీప కాలంలో పనులు పూర్తయ్యే అవకాశం దాదాపుగా లేదు. ఇది ముంపు ముప్పును మరింత పెంచే ప్రమాదం ఉందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి కొత్త ప్రాంతాలూ నీట మునిగే ప్రమాదం లేక పోలేదని చెబుతున్నారు. చార్మినార్‌ (Charminar), కూకట్‌పల్లి (Kukatpally), సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఉప్పల్‌, మల్కాజిగిరి, అల్వాల్‌ తదితర ప్రాంతాల్లో ఎస్‌ఎన్‌డీపీ (SNDP Works) పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లోనే లోతట్టు ప్రాంతాలు అధికంగా ఉండడం గమనార్హం.


భారీ ప్రణాళికలు.. అమలులో అశ్రద్ధ..

భారీ అంచనాలతో ప్రణాళికలు రూపొందించే జీహెచ్‌ఎంసీ (GHMC) వాటిని అమలు చేయడంలో కనీస విషయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 2020, 2021 వరదల నేపథ్యంలో గ్రేటర్‌లో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలో నాలాల విస్తరణ, అభివృద్ధి, రిటైనింగ్‌ వాల్‌ల నిర్మాణం, చెరువు కట్టల బలోపేతం, అలుగుల మరమ్మతు/పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించారు. నాలాలకు సంబంధించి రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో ఎస్‌ఎన్‌డీపీ మొదలు పెట్టారు. ప్రాధాన్య క్రమంలో పలు ప్రాంతాల్లో మొదటి విడత పనులు చేపట్టారు. నగరంలో నవంబర్‌ నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయి. అదే సమయంలో పనులు చేపడితే.. కనీసం ఆరేడు నెలలు నిరాటంకంగా జరిగే అవకాశముంటుంటుంది. కానీ, అందు కు భిన్నంగా ఫిబ్రవరి, మార్చిలోనూ పనులు ప్రారంభమయ్యాయి. మెజార్టీ పనులు ఇప్పటికీ సగం కూడా పూర్తవ లేదు. ఆలస్యంగా మొదలు పెట్టడం ఒక కారణమైతే.. ఆశించినంత వేగంగా పనులు జరగకపోవడమూ మరో కారణం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడంతో కాంట్రాక్టర్లు చేస్తేనే పని.. అన్నట్టుగా పరిస్థితి మారింది.


సమీక్షలతో మమ..

ఎస్‌ఎన్‌డీపీ పనులపై క్రమం తప్పని పర్యవేక్షణ ఉంటుందని గతంలో ఉన్నతాధికారులు ప్రకటించారు. గత డిసెంబర్‌లో ఎస్‌ఎన్‌డీపీపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌.. ప్రతి మంగళవారం ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని, వారంలో ఒక రోజు క్షేత్రస్థాయిలో నాలాల సందర్శన ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా భావిస్తోన్న నాలాల విస్తరణ, వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల పనులపై ప్రత్యేక దృష్టి  సారించాలని ఆదేశించారు. వివిధ విభాగాలతో బృందాలు ఏర్పాటు చేసి ఒక్కొ టీంకు ఒక పని అప్పజెప్తామని చెప్పారు. రెండు, మూడు వారాలు మినహా ప్రతి వారం సమీక్షలు జరిగిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో సీఎస్‌, స్పెషల్‌ సీఎ్‌సతోపాటు, జీహెచ్‌ఎంసీ అధికారులు పర్యటించిన దాఖలాలు బహు అరుదు. దీంతో ఎస్‌ఎన్‌డీపీ పనులు పూర్తిగా గాడి తప్పాయి. వర్షాకాలంలోపు పనులు పూర్తవకుంటే కొత్త సమస్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-05-21T15:25:18+05:30 IST