Advertisement

అమెరికాలో మన ఆత్మబంధువు

Aug 2 2020 @ 17:00PM

అమెరికాలో తానా చేస్తున్న సేవలు కొత్తకాదు. కొన్నేళ్ల నుంచి ఆ సంస్థ ప్రవాసుల కోసం పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు టీమ్‌స్క్వేర్‌తో గత పన్నెండేళ్ల నుంచి ఆపత్కాలంలో ఆత్మబంధువుగా నిలుస్తోంది. అమెరికాలో మన తెలుగు వాళ్లు ఎవరైనా చనిపోతే మృతదేహాల తరలింపు దగ్గర నుంచి.. విద్యార్థుల ఆర్థిక కష్టాలను తీర్చేవరకు.. అనేక సేవల్ని చేస్తోందీ సంస్థ..


దేశం కాని దేశం. కోటి ఆశలతో అమెరికా వెళతారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటారు. మంచి జీతమొస్తుంది. మా పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారని సంతోషిస్తారు తల్లిదండ్రులు. జీవితం ఎప్పుడూ సవ్యంగా సాగదు. హఠాత్తుగా ఏదో ఒక రోజు ఊహించని సంఘటన తలెత్తుతుంది. మృత్యువు మింగేస్తుంది. మరణవార్త విన్న వెంటనే కుప్పకూలిపోతారు కుటుంబీకులు. బంధువులు, ఆప్తులు వాలిపోవడానికి అదేమీ మన సొంతూరు కాదు. పరాయి దేశం. ఎవడి బిజీ వాడిది. అలాంటి ఆపత్కాలంలో.. ఏ దిక్కూ లేని చోట పెద్దదిక్కయి.. ఆత్మబంధువుగా నిలుస్తోంది తానా టీమ్‌స్క్వేర్‌. మన కోసం మనం.. అదే ఆ సంస్థ ఊపిరి. అమెరికాలో ఏళ్ల తరబడి తెలుగు ప్రవాసులకు ఎనలేని సేవలు చేస్తోంది తానా. పారిశ్రామికవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, ఉద్యోగులు.. తలా ఒక చేయి వేసి.. నిధుల్ని పోగుచేసి.. అర్థవంతమైన, అండగా నిలిచే కార్యక్రమాలను చేస్తోందా సంస్థ. అమెరికాలో దురదృష్టవశాత్తూ మన తెలుగు వాళ్లు చనిపోతే.. ఇక్కడికి మృతదేహాలను తీసుకురావడం, విద్యార్థులు, ఉద్యోగుల ఇమిగ్రేషన్‌ సమస్యల పరిష్కారం.. ఆర్థిక సమస్యలు.. ఒక్కటేమిటి? అక్కడ ఏ సమస్య వచ్చినా తీర్చే నాథుడు కనిపించడు. అందుకే తానా ఆధ్వర్యంలో 2008లో టీమ్‌స్క్వేర్‌ పుట్టింది.


ఇరవై నాలుగ్గంటలూ..

ఏ ఉద్యోగానికైనా నిర్ణీత వేళలు ఉంటాయి. టీమ్‌స్క్వేర్‌ ఛైర్మన్‌ అండ్‌ జాయింట్‌ సెక్రటరీ అశోక్‌ బాబు కొల్లతో పాటు మరో నాలుగొందల మంది వాలంటీర్లకు ఇది ఇరవైనాలుగ్గంటల ఉద్యోగం. ఎందుకంటే అమెరికా, కెనడా నలుమూలల ఉన్న మన తెలుగువాళ్లలో ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వస్తుందో ఊహించలేరు. రోడ్డుప్రమాదం, గుండెజబ్బులు, అగ్నిప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు, దోపిడీలు.. ఇలా ఏ ఉపద్రవం తలెత్తినా.. ఆ సంబంధీకుల చేతులు తానా టీమ్‌స్క్వేర్‌కు ఫోన్‌ చేయకుండా ఉండలేవు. ఏదో ఒక అండ దొరుకుతుందన్న భరోసా బాధితులది. అమెరికాలో ఒక వ్యక్తి మరణిస్తే అతని మృతదేహాన్ని మాతృదేశం తరలించేందుకు కొన్ని ప్రక్రియల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అదో పెద్ద తతంగం. మనిషిపోయిన బాధలో.. ఆ పనులు చేసుకోవడానికి చేతులుకాళ్లు ఆడవు. పోలీసులు, కాన్సులేట్‌లకు పత్రాలను సమర్పించడం, బీమా సంస్థలకు సమాచారం ఇవ్వడం, మృతదేహాన్ని ప్యాక్‌ చేయించడం, ఎయిర్‌లైన్స్‌ ఏర్పాటు చేసుకోవడం.. ఇన్ని పనులు ఉంటాయి. ఒకప్పుడైతే ఇన్ని పనులు చేసుకోవడానికి కనీసం పది రోజులు పట్టేది.


ఇప్పుడు నలభై గంటల్లోనే పూర్తి చేస్తున్నారు టీమ్‌స్క్వేర్‌ వాలంటీర్లు. ఇప్పటి వరకు సుమారు రెండువేల ఐదొందల మందికి సహాయం చేసిందీ సంస్థ. అందుకే ఇరవైనాలుగ్గంటల ఉద్యోగం అంటారు ఆ సంస్థ ప్రతినిధి అశోక్‌.  అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో టీమ్‌స్క్వేర్‌కు బలమైన నెట్‌వర్క్‌ ఏర్పడింది. సేవాదృక్పథంతో పనిచేసే వాలంటీర్ల వ్యవస్థ ఉంది. ఒక్క ఫోన్‌ రాగానే బాధిత కుటుంబీకుల ముందు వాలిపోతారు వాలంటీర్లు. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఈమధ్య అమెరికాలో వారానికి ముగ్గురు నలుగురు తెలుగు యువకులు గుండెపోటుతో’ ఈత రాక స్విమ్మింగ్‌పూల్స్‌, నదుల్లో పడి చనిపోతున్నారు.. అంటూ తమకొస్తున్న ఫోన్‌కాల్స్‌ గురించి చెప్పుకొచ్చారు.   

ప్రకాశం జిల్లాలోని పరుచూరు మండలం, కొల్లావారిపాళెం నుంచి అమెరికాకు వచ్చాను. ఇక్కడే రెస్టారెంట్‌ పెట్టుకుని, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తున్నాను. సేవాభావం నా ప్రవృత్తి. అందుకే తానాలో కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాను. టీమ్‌స్క్వేర్‌ బాధ్యతల్ని చూస్తున్నానిప్పుడు. కరోనాకు ముందు అమెరికాలోని తమ పిల్లల దగ్గరికి వచ్చిన ముప్పయివేల మంది తల్లిదండ్రులు ఇక్కడే ఆగిపోయారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా విమానాలు మొదలయ్యాక మా టీమ్‌స్క్వేర్‌ సభ్యులు వారందరికీ సహాయపడ్డారు. చేతిలో చిల్లిగవ్వలేని వాళ్లకు టికెట్లు కూడా కొనిపెట్టాం. ఇక్కడున్న విద్యార్థులకు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు లేకపోవడం వల్ల రోడ్డున పడ్డారు. యాభై నగరాల్లోని మన తెలుగు పిల్లలకు నిత్యావసర సరుకుల్ని ఉచితంగా పంపిణీ చేశాం. అమెరికాలో స్టోర్లు పెట్టిన తెలుగు యజమానులు తమకు తోచిన సహాయం చేశారు.  బాధితుల నుంచి మాకు ఫోన్‌కాల్స్‌ రాగానే అన్ని రకాల సహాయం అందిస్తున్నాం. తానాలోని పెద్దలు అందరూ టీమ్‌స్క్వేర్‌ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు.   

- అశోక్‌ బాబు కొల్ల, టీమ్‌స్క్వేర్‌, అమెరికాఅమెరికాలో మన తెలుగువాళ్లకు ఏ ఆపద వచ్చినా ముందుగా మాకు ఫోను వస్తుంది. అంత విశ్వసనీయత మాకుంది. ఇటు కాన్సులేట్లతోనూ, అటు ప్రభుత్వాలతోనూ సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాం. కొత్తతరం యువకులు ముందుకు వస్తున్నారు. టీమ్‌స్క్వేర్‌ సేవల్ని మరింత విస్తృతం చేయనున్నాం. మా వాలంటీర్లు సేవాభావంతో పనిచేస్తున్నారు. నేటి కరోనాలాంటి క్లిష్టసమయంలో కూడా తెలుగువిద్యార్థులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయగలిగాం.  

- జయశేఖర్‌ తాళ్లూరి, అధ్యక్షులు, తానా, అమెరికా

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.