Inspirational Story: మూడో తరగతిలో ఫీజు కట్టలేక ఇంటికొచ్చిన పిల్లవాడు.. ఇప్పుడు అదే స్కూల్‌కు..

ABN , First Publish Date - 2022-07-31T16:09:17+05:30 IST

మూడో తరగతిలో ఫీజు కట్టలేక స్కూల్‌నుంచి ఇంటికొచ్చిన ఓ పిల్లవాడు అదే స్కూల్‌కి ప్రిన్సిపాల్‌ అయ్యారు. తను అనుభవించిన కష్టాలు పేదపిల్లలు పడకూడదని గత పదిహేనేళ్లనుంచి ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ బోధించటంతో పాటు పద్దెనిమిది గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు.

Inspirational Story: మూడో తరగతిలో ఫీజు కట్టలేక ఇంటికొచ్చిన పిల్లవాడు.. ఇప్పుడు అదే స్కూల్‌కు..

మూడో తరగతిలో ఫీజు కట్టలేక స్కూల్‌నుంచి ఇంటికొచ్చిన ఓ పిల్లవాడు అదే స్కూల్‌కి ప్రిన్సిపాల్‌ అయ్యారు. తను అనుభవించిన కష్టాలు పేదపిల్లలు పడకూడదని గత పదిహేనేళ్లనుంచి ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ బోధించటంతో పాటు పద్దెనిమిది గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వరంగల్‌(warangal) జిల్లాలోని నర్సంపేటకు చెందిన ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడి(Govt Teacher) పేరు కాసుల రవికుమార్‌(Kasula Ravikumar). ‘పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం’ అనే నినాదంతో సమాజాన్ని ‘లీడ్‌’ చేస్తున్న విశేషాలు ఆ మాస్టారు మాటల్లోనే...


‘‘విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించటం, విద్యపట్ల అవగాహన, సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకునేట్లు చేయడం, గ్రామీణ యువత అభివృద్ధి... ఈ నాలుగు అంశాలే ‘లీడ్‌’కు చోదకశక్తులు. 2007లో ‘లీడ్‌’ పేరుతో వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఓ కారక్రమం చేశా. గ్రామీణ నేపథ్యంలోని పిల్లలకు ఇంగ్లీషు నేర్పించాలనే ఉద్దేశం అది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి వేసవిలో ఉచితంగా ఆంగ్లవిద్య బోధిస్తున్నా. వాళ్లకు చక్కని మెటీరియల్‌ అందిస్తున్నా. మొదట్లో నర్సంపేటలో ఉచిత శిక్షణ ఇచ్చేవాడిని. ఆ తర్వాత ములుగు జిల్లాలో కూడా ప్రారంభించా. ఇప్పటి వరకూ 22 బ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. 3000 మందికి పైగా శిక్షణనిచ్చా. అందరికీ నేను రూపొందించిన ‘గ్లోబల్‌ ఇంగ్లీష్‌ గ్రామర్‌’ పుస్తకాన్ని ఉచితంగా అందించాను.

 

ఆ వాక్యాలు వేధించాయి...

మూడో తరగతిలో 590 రూపాయల ఫీజు చెల్లించలేకపోయా. దాంతో స్కూల్‌ నుంచి ఇంటికి పంపించారు. నాన్న నరేంద్రచారి ఆటోడ్రైవర్‌, అమ్మ సరళాదేవి బీడీ కార్మికురాలు. అయితే ఎప్పటికైనా చదువే గొప్పదని తెలుసుకున్నా. నాలుగో తరగతి నుంచే లైబ్రరీలో పత్రికలు, పుస్తకాలు చదివేవాణ్ని. ఎనిమిదో తరగతి నుంచి పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేశా. తోటి విద్యార్థులు కోచింగ్స్‌కు వెళ్తుంటే.. ఎస్టీడీ బూత్‌లో పని చేసేవాణ్ని. ‘ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి విద్యకే ఉంది’ అనే నెల్సన్‌ మండేలా రాసిన వాక్యాలు నన్ను పట్టేసుకున్నాయి. పాలిటెక్నిక్‌ తర్వాత ఇంజనీరింగ్‌లో జాయినయ్యా. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు మధ్యలో ఆపేసి చిన్న వయసులోనే ప్రయివేట్‌ స్కూల్‌లో ఇంగ్లీషు టీచర్‌గా చేరా. 



అదో గొప్ప అచీవ్‌మెంట్‌...

కుటుంబ పోషణ కోసం గత్యంతరం లేక ఇంగ్లీషు టీచరయ్యా. ఈ ప్రయాణంలోనే గ్రామీణ పిల్లల్లో ఇంగ్లీషుపై ఉన్న ఫోబియాను పోగొట్టాలనుకున్నా. అందుకే 2007లో ‘లీడ్‌’ ఫౌండేషన్‌ పేరుతో ఉచితంగా ఇంగ్లీషు విద్యను, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ను బోధించటం ప్రారంభించా. ఫీజు కట్టలేనందుకు మూడో తరగతిలో ఏ స్కూల్‌లోంచి గెంటివేయ బడ్డానో... ఆ స్కూల్‌కే ప్రిన్సిపల్‌ అయ్యా. అదో గొప్ప అచీవ్‌మెంట్‌. 2009లో ఎడ్‌సెట్‌(Edcet) రాశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో ర్యాంకు సాధించా. అప్పుడే నాలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. 2013లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు సాధించా. చదువు, సేవ, సాహిత్యమే ప్రపంచంగా అడుగులేశా. పదివేల మందికి పైగా పర్యావరణంపై అవగాహన అందించా. నా దగ్గర చదువుకున్న విద్యార్థులే(Students) నా బలం. ఇంగ్లీషు విద్యను నేర్చుకున్న పిల్లల్లో ఇంజనీరింగ్‌(Engineering), మెడిసిన్‌(Medicine)తో పాటు పలు రంగాల్లో రాణించారు. వందమందికి పైగా విదేశాల్లో ఉద్యోగం(Job) చేస్తున్నారు. 


ఓ ఉద్యమంగా చేస్తున్నా... 

సొంత ఇల్లుంటే గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆశ ఉండేది. 2020లో ఇల్లు కట్టుకోగానే ‘లీడ్‌ లైబ్రరీ’ని మా ఇంట్లోని సగభాగంలో ప్రారంభించా. నా భార్య శోభారాణి ప్రోత్సాహం వల్లే ‘లీడ్‌ లైబ్రరీ’ని ముందుకు తీసుకెళ్లగలిగా. యాక్టివిటీ బేస్డ్‌ లైబ్రరీ ఇది. లీడ్‌ లైబ్రరీ సెంట్రిక్‌గా చైన్‌ లైబ్రరీలు పెట్టాలనుకున్నా. ఇప్పటి వరకూ పద్దెనిమిది ఊర్లలో గ్రంథాలయాలు ఏర్పాటు చేశా. వీటిలో పదివేల పుస్తకాలకు పైగా ఉన్నాయి. సాయంత్రంపూట, ఆదివారాల్లో పిల్లలు లైబ్రరీలకు వచ్చి చదువుకుంటున్నారు. గ్రంథాలయాలు ఏర్పాటు చేయటం ఓ ఉద్యమంగా చేస్తున్నా.

 

జీతం విరాళంగా.. 

పేదరికం అనుభవిస్తే కానీ తెలీదు. ‘పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం’ అనే నినాదంతోనే అడుగేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు సరైన గైడెన్స్‌ లేనందుకే చదువుల్లో వెనకపడుతున్నారు. అందుకే నేను పల్లెదారి పట్టా. నా నెల జీతంలో 33 శాతం ‘లీడ్‌’కే కేటాయిస్తున్నా. 20 సంవత్సరాల బోధనానుభవం ఉంది. నా పరిధి, విస్తీర్ణం తక్కువ అయినా విద్యాపోరాటం చేస్తున్నా. ప్రస్తుతం ములుగు జిల్లా జవహర్‌నగర్‌ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాసేవ అందించటమే నా ప్రధాన లక్ష్యం.’’

- రాళ్లపల్లి రాజావలి

Updated Date - 2022-07-31T16:09:17+05:30 IST