పొద్దున్నే పాలు పోస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తూ...

ABN , First Publish Date - 2021-04-05T05:22:06+05:30 IST

రోజూ ఉదయాన్నే ఇంటింటికీ తిరిగి పాలు పోస్తుంది. ఆ పని పూర్తయ్యాక ఎన్నికల ప్రచారానికి అవసరమైనవి సిద్ధం చేసుకొంటుంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్నే కాదు ఇంటిని నడిపే బాధ్య

పొద్దున్నే పాలు పోస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తూ...

రోజూ ఉదయాన్నే ఇంటింటికీ తిరిగి పాలు పోస్తుంది. ఆ పని పూర్తయ్యాక ఎన్నికల ప్రచారానికి అవసరమైనవి సిద్ధం చేసుకొంటుంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్నే కాదు ఇంటిని నడిపే బాధ్యతను తీసుకుంది అరితా బాబు. కేరళలో ఎన్నికల బరిలో నిలిచిన ఈ యువతరంగం అభివృద్ధి మంత్రమే ప్రచారాస్త్రంగా దూసుకుపోతోంది. చదువుతో పాటు రాజకీయాల్లో రాణిస్తున్న ఆమె ఏం చెబుతున్నారంటే... 


‘‘ప్రతిరోజూ నేను ఇంటింటికి వెళ్లి పాలు పోసేటప్పుడు ఆ ఇంటివాళ్లతో మాట్లాడతాను. వారి జీవితంలోని కష్టసుఖాలను  తెలుసుకుంటాను’’ అంటున్న అరిత ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన చిన్న వయస్కురాలైన మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అలప్పుజా జిల్లాలోని పుథుపల్లిలో అమ్మానాన్నతో కలిసి ఉంటున్నారామె. సోషల్‌ వర్క్‌లో పీజీ చేసి, ప్రస్తుతం కామర్స్‌లో మాస్టర్స్‌ చదువుతున్నారు. మార్చి 14న కేరళ కాంగ్రెస్‌ నాయకత్వం ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆమె ఫోన్‌ మోగుతూనే ఉంది. పార్టీ కార్యకర్తలతో ఆమె ఇల్లు కళకళలాడుతోంది. జనాల్లో, మీడయాలో ఊహించని ఆదరణ ఉన్నప్పటికీ తాను మాత్రం పాలు పోయడం కొనసాగిస్తూనే ఉంటానని చెబుతోంది అరిత. కొన్ని సంవత్సరాల క్రితం అరిత వాళ్ల నాన్న థులసిధరణ్‌కు బాగా అనారోగ్యం చేసింది. దాంతో పెద్ద కుమార్తె అయిన అరిత కుటుంబ పోషణ బాధ్యతను తీసుకొంది. మరోపక్క రాజకీయాల్లోనూ చురకుగా పాల్గొంటోంది. 



15 ఏళ్లకే లక్ష్యం తెలిసిపోయింది

‘‘రోజూ ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్ర లేచి ఆరు కల్లా పాల క్యాన్లతో ఇంటి నుంచి బయలుదేరుతాను. 15 ఇళ్లల్లో పాలు పోసి ఇంటికొస్తాను. నేను చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మానాన్నను చూస్తూ పెరిగాను. ఆయన జీవన విధానం, ఆయన నమ్మే విలువలు నాలో స్ఫూర్తిని నింపాయి. నాన్న ప్రజలతో మాట్లాడడం, వారి సమస్యలను పరిష్కరించడం చూశాను. నేను పదేళ్ల వయసు నుంచే నా చుట్టు పక్కల జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించేదాన్ని. పదిహేనేళ్లకే నాలో సమాజానికి సేవ చేయాలనే కోరిక బలపడింది’’ అంటుంది అరితా బాబు. తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై స్పందిస్తూ ‘‘నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు నా ఆలోచనా విధానాలు చాలావరకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలతో సరిపోయేవి. అందుకే కాంగ్రె్‌సలో చేరాను. నాలాంటి యువతరానికి టికెట్‌ ఇవ్వడం కొత్త ఆలోచనలను, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా కాంగ్రెస్‌ పెద్దలు తీసుకున్న నిర్ణయం. ఇది నిజంగా ఎన్నికల్లో గొప్పగా పనిచేస్తుంది’’ అంటారు అరిత.


మండల సెక్రటరీగా తొలి అడుగులు

ఆమె రాజకీయ ప్రయాణం 2011లో యూత్‌ కాంగ్రెస్‌ మండల సెక్రటరీగా ఎన్నికవడంతో మొదలైంది. 21 ఏళ్లకే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గెలిచి వార్తల్లో నిలిచింది. ఈ ఎన్నికల్లో ఆమె కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీద పోటీ చేస్తున్నారు. ‘‘నేను ఇక్కడే పుట్టాను. మొదటి పోటీలోనే పంచాయతీ ఎన్నికలో గెలిచాను. నన్ను ఇక్కడి వారంతా తమ కూతురిలా భావిస్తారని అనుకుంటున్నా. న్యాయం వైపు నిలబడినప్పుడు ప్రజల మద్దతు తప్పకుండా లభిస్తుంది. మా నియోజకవర్గంలో ఎక్కువ మంది చిన్న, మధ్యతరహా కంపెనీల యజమానులే. ఇంతకుముందు ఎన్నికైన నాయకులు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. హయ్యర్‌ లెవల్‌లో కూడా మహిళలందరికి విద్యను తప్పనిసరి చేయడం మీద దృష్టి పెడతాను. దాంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అంతేకాదు మా తాలుకాకు మంచి ఆస్పత్రి తెస్తాను. వరదలు, కరోనా దెబ్బతో అతలాకుతలం అయిన మా నియోజకవర్గం తిరిగి ప్రగతి బాటలో సాగేందుకు చర్యలు తీసుకుంటాను’’అంటూ తన ఎజెండాను ప్రచార సభల్లో బలంగా వినిపిస్తున్నారీ యువ కెరటం.

Updated Date - 2021-04-05T05:22:06+05:30 IST