విదేశాల్లో స్థిరపడి.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న తెలుగు ‘వ్లాగర్స్’

ABN , First Publish Date - 2021-02-28T23:07:24+05:30 IST

ప్రపంచాన్ని చుట్టేయాలన్న తపన... కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక...కొత్త దేశం, కొత్త నగరం, కొత్త పల్లె... అక్కడి వింతలు, విశేషాలు, ఆ ప్రాంతం గొప్పదనం, సౌందర్యం, అక్కడి వంటకాలు... అన్నింటినీ ఆస్వాదించాలన్న ఆకాంక్ష. ఈ కుతూహలం ఉన్న వారే ట్రావెలర్లుగా మారుతారు. అలాంటి ట్రావెలర్లు ఎంతోమంది..

విదేశాల్లో స్థిరపడి.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న తెలుగు ‘వ్లాగర్స్’

ప్రపంచాన్ని చుట్టేయాలన్న తపన... కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక...కొత్త దేశం, కొత్త నగరం, కొత్త పల్లె... అక్కడి వింతలు, విశేషాలు, ఆ ప్రాంతం గొప్పదనం, సౌందర్యం, అక్కడి వంటకాలు... అన్నింటినీ ఆస్వాదించాలన్న ఆకాంక్ష. ఈ కుతూహలం ఉన్న వారే ట్రావెలర్లుగా మారుతారు. అలాంటి ట్రావెలర్లు ఎంతోమంది యూట్యూబ్‌లో ‘వ్లాగింగ్‌’ చేస్తున్నారు. చేతిలో కెమెరా లేదంటే హైఎండ్‌ సెల్‌ఫోన్‌తో తాము చూసిన కొత్త ప్రదేశాలను షూట్‌ చేస్తూ, వాటిని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ, చక్కగా వివరిస్తూ... యూట్యూబ్‌ వీక్షకులతో ఒకరకంగా ప్రపంచయాత్రను చేయిస్తున్నారు.


దేశ, విదేశాల్లోని దర్శనీయ ప్రదేశాలు... ప్రముఖ నగరాల్లో విహరిస్తూ అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వంటి అంశాలెన్నింటినో తమ వ్లాగుల్లో చూపిస్తున్నారు. అందుకే ‘ట్రావెల్‌ వ్లాగింగ్‌’ ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ ట్రెండ్‌గా మారింది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచ పర్యాటకం కుదుటపడుతోంది. బయటికి ఎక్కడికైనా వెళ్లాలనుకున్నవారికి ఈ ‘వ్లాగర్స్‌’ తమ అనుభవాల దారులను అందంగా చూపుతున్నారు. ఆయా ప్రాంతాలపై మనకున్న సందేహాలను పటాపంచలు చేస్తున్నారు. పరోక్షంగా పర్యాటక రంగం ఎదుగుదలకు తమ వంతు సాయాన్ని చేస్తున్నారు. అలాంటి కొందరు నవ యువ ‘తెలుగు వ్లాగర్స్‌’ అనుభవాలే ఇవి...



ఇక తొమ్మిది దేశాలే మిగిలాయి.. రవి తెలుగు ట్రావెలర్


ఇప్పటిదాకా ప్రపంచంలోని 186 దేశాలను చూసొచ్చాడు రవి ప్రభు. ఇక 9 దేశాలే మిగిలాయి. అతనిది విశాఖపట్నం. పదహారేళ్ల క్రితం హైదరాబాద్‌లో పీజీ పూర్తి చేశాక పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువయ్యాక అక్కడే స్థిరపడ్డాడు. చిన్నప్పటి నుంచి పర్యాటకాన్ని ఇష్టపడే రవి... అమెరికా చేరుకున్నాక ట్రావెలింగ్‌ను హాబీగా మార్చుకోవడం విశేషం. తొలి సంపాదనతో యూఎస్‌ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్లి ఆమ్‌స్టర్‌డామ్‌ నగరాన్ని చూసొచ్చాడు. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను దర్శించి వచ్చాడతను. వనౌటు అనే దేశంలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని సమీపం నుంచి చూశానంటున్న ఆయన చేసిన సాహసాలు చాలానే ఉన్నాయి. ఆఫ్రికాలోని పలు దేశాలతో పాటూ బ్రెజిల్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, గ్రీస్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌... ఇలా చెప్పుకుంటూ పోతే అతను పర్యటించిన 186 దేశాల పేర్లు చెప్పాలి. ఏడాదిలోనే 18 దేశాలు తిరిగొచ్చిన సందర్భాలూ ఉన్నాయి.


ఒక్కో ప్రయాణం ఒక్కో అనుభవం. ఫ్లైట్‌ మిస్సవ్వడం, ఆహారం దొరక్క ఇబ్బంది పడడం, బ్యాగులోని వస్తువులు దొంగతనానికి గురవ్వడంలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ట్రావెలింగ్‌ను మాత్రం ఆపలేదతడు. తాను సందర్శించిన ప్రాంతాల విశేషాలు అందరికీ తెలియజేయాలని ‘రవి తెలుగు ట్రావెలర్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ మొదలుపెట్టాడు. యూట్యూబ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని తన సొంతానికి కాకుండా పేదల సాయానికి వినియోగిస్తున్నాడట. తనకు నచ్చిన ప్రదేశం మాత్రం బ్రెజిల్‌లోని ‘రియో డి జనైరో’. జీవితాన్ని కొత్త కోణంలో చూసేందుకు ట్రావెలింగ్‌ ఎంతో ఉపకరిస్తుంది అంటాడాయన. ఉత్తరాంధ్ర అందాలను యూట్యూబ్‌ ద్వారా అందరికీ చూపించే ప్రయత్నమూ చేశాడు రవి. అన్నిటికంటే ఆయన ప్రయాణించిన ఖరీదైన విమాన ప్రయాణ వీడియో ఆకట్టుకుంది.



అమెరికాను అద్దంలో చూసినట్టే.. వాస్‌ వ్లాగ్స్‌ 


అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి వాసు. ప్రస్తుతం అతను  లాస్‌ఏంజిల్స్‌లో నివసిస్తున్నాడు. చిన్నప్పట్నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. షార్ట్‌ఫిల్మ్స్‌ చేయాలన్నది అతని కల. కానీ అవేవీ కుదరలేదు. తన ఇద్దరు కూతుళ్లు తరచూ యూట్యూబ్‌ను చూస్తూ ఆనందించేవారు. ఆ సంఘటనే ఆయనకు ప్రేరణగా నిలిచింది. తను కూడా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ పెడితే బావుంటుందని అనుకున్నాడు. ఆ ఉద్దేశ్యం వెనుక అసలు కారణం అతని పిల్లలు జున్ను, హనీలే. వారికి అమెరికాలోని వివిధ ప్రదేశాలు చూపిస్తూ వీడియోలు తీసేవాడు. వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే పిల్లలకు మంచి జ్ఞాపకాలుగా ఉంటాయన్నది వాసు ఆలోచన. మూడేళ్ల క్రితం ‘వాస్‌ వ్లాగ్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ మొదలుపెట్టాడు.


ప్రస్తుతం ఆ ఛానెల్‌కు మూడు లక్షల పాతిక వేల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అమెరికా జీవనశైలిపైనా, వాళ్ల ఆహారంపైనా, పండుగలపైనా రకరకాల వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంటాడు. ఎంతో ఓపికతో తన పిల్లల మధ్య తనూ ఒక పిల్లాడై కలిసిపోయే దృశ్యాలు అతని వీడియోల్లో కనువిందు చేస్తాయి. ఇండియా నుంచి అమెరికా వెళ్లేవాళ్లు ఒక్కసారి ఆయన వీడియోలు చూస్తే ప్రాథమిక విషయాలపై అవగాహనకు రావచ్చు. ముఖ్యంగా ఖర్చులు, ధరలు, ఇంటి అద్దెలు... ఇలా ముఖ్యమైన కొన్ని అంశాల గురించి తెలుసుకోవచ్చు. వ్లాగ్‌లో అమెరికాలోని పంటపొలాలు, పొడవాటి టవర్లు, పార్కులు, ఎన్నో అందమైన ప్రదేశాలను తెలుగువారికి చూపించాడు వాసు, అతని పిల్లలు జున్ను, హనీ. వీళ్ల వీడియోలు చూస్తున్నంతసేపు నిజంగా మనమే అమెరికాలో తిరుగుతున్నంత అనుభూతి కలుగుతుంది. 


ఉద్యోగం వదిలేసి మరీ... ఉమా తెలుగు ట్రావెలర్‌


ఆఫ్రికా దేశమైన మాలి నుంచి తెలుగు యూట్యూబ్‌ ఛానెల్‌ నడిపిన వ్యక్తి ఉమా ప్రసాద్‌. ఇతని సొంతూరు కృష్ణా జిల్లా అయినా ప్రస్తుతం అతని తల్లిదండ్రులు తెనాలిలో స్థిరపడ్డారు. మాలి దేశానికి ఉద్యోగరీత్యా వెళ్లాడు. అక్కడే ఒక వాటర్‌ ప్లాంట్‌లో పని చేసేవాడు. సెలవు రోజుల్లో ఆఫ్రికా ప్రజల జీవనాన్ని, వివిధ ప్రాంతాలను వీడియోలు తీసి తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పెట్టడం అతని అభిరుచిగా మారింది. అవి తెలుగు నెటిజన్లకు తెగ నచ్చడంతో వ్యూస్‌ వేగంగా పెరిగాయి. ఉమా ఆఫ్రికా అడవుల్లోని గిరిజన తెగలపై కూడా వీడియోలు చేశాడు. ఇందుకోసం అడవుల్లోనే గడిపిన సందర్భాలున్నాయి. అద్భుతమైన ఆ వీడియోలు ఎంతోమంది వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఆఫ్రికా దేశాలైనా టాంజానియా, కెన్యా దేశాల్లో తిరిగి వాటిని వీడియోల్లో చూపించాడు. మసాయి గిరిజనులపైనే ప్రత్యేక ఎసిసోడ్‌లు చేశాడు. ఇప్పటికీ ఆదిమ మానవుల్లా అడవుల్లో బతుకుతున్న హడ్జాయే తెగపై చేసిన ఎపిసోడ్‌లు ఒక్కొక్కదాన్ని అయిదు లక్షల మందికి తగ్గకుండా చూశారు.


అడవుల్లో వారి వేట, ఆహారాన్ని కాల్చుకు తినడం, రాళ్లపైనే నిద్రించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఉమ ఇతరుల పట్ల సౌమ్యంగా వ్యవహరించే తీరు, అతని చిరునవ్వు, కొత్త ప్రదేశాల పట్ల ఆసక్తి నెటిజన్లను కట్టిపడేస్తాయి. మాలిలోని తన ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు అంటే అతనికి చాలా ఇష్టం. నిద్ర లేస్తూనే ఆ చెట్టును చూస్తుంటాడు. ఇప్పుడు ఉమా ప్రసాద్‌ పూర్తి స్థాయిలో ట్రావెలర్‌గా మారాడు. మాలిలోని  ఉద్యోగాన్ని వదిలేసి ట్రావెల్‌ వ్లాగింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ మధ్య ఆఫ్రికాలో పర్యాటించాడు. అతని ఛానెల్‌కు మూడున్నర లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారిప్పుడు. 

Updated Date - 2021-02-28T23:07:24+05:30 IST