దమ్మున్న వార్తలకు డెస్టినేషన్‌ ABN.. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ RK.. తెలియని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో లేదు..

ABN , First Publish Date - 2021-10-15T14:45:08+05:30 IST

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆవిర్భవించి పుష్కరం అయ్యింది. పన్నెండేళ్లలో దమ్మున్న జర్నలిజం ఏంటో చూపించింది...

దమ్మున్న వార్తలకు డెస్టినేషన్‌ ABN.. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ RK.. తెలియని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో లేదు..

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆవిర్భవించి పుష్కరం అయ్యింది. పన్నెండేళ్లలో దమ్మున్న జర్నలిజం ఏంటో చూపించింది. చూపిస్తూనే ఉంది. అవసరాన్ని బట్టి సాంకేతిక సొబగులు అద్దుకుంటోంది. మారుతున్న టెక్నాలజీని ఔపోసన పడుతోంది. ఏబీఎన్‌ పుష్కర ప్రస్థానంలో సాగిస్తున్న వార్తల యజ్ఞంపై స్పెషల్‌ ఫోకస్‌ ఇప్పుడు చూద్దాం...


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రస్‌. దమ్మున్న వార్తలకు డెస్టినేషన్‌. స్పెషల్‌ డిబేట్స్‌కు అసలైన స్క్రీన్‌. ఛానెల్‌ ప్రారంభమైంది మొదలు.. యేటికేడూ తన ప్రసారాలకు పదును పెంచుకుంటూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలకు తనదైన శైలిలో రూపకల్పన చేస్తూనే ఉంది. జనానికి ఏది అవసరమో అది అందరికంటే ముందే టెలికాస్ట్‌ చేస్తోంది.


ఈ ప్రయాణంలో ఎన్నో, ఎన్నెన్నో మైలురాళ్లను అధిగమించింది ఏబీఎన్. ప్రజలకు అవసరమైన, ప్రజా ప్రయోజనమైన, బాధితులకు ఆసరాగా ఉండే కథనాలను అందిస్తూనే ఉంది. వార్తల ప్రసారమే కాదు.. వార్తల వెనక ఉన్న వాస్తవాలను కూడా శోధిస్తూ స్టోరీలను రూపొందిస్తోంది. నిజాల నిగ్గు తేలుస్తూ.. అక్రమార్కుల భరతం పడుతూ, అవసరార్ధుల ఆవేదనను ప్రదర్శిస్తూ.. శరవేగంగా దూసుకెళ్తోంది.


ఏ పరిణామం ఎదురైనా, ఏ సంఘటన జరిగినా ప్రజల పక్షానే నిలబడి పోరాడుతోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ప్రజలకు ఆపద ఎదురవుతోందని తెలిసినా, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు.. జనానికి ఇబ్బందులు కలిగిస్తాయని తెలిసినా, నష్టదాయకంగా పరిణమించినా చూస్తూ ఊరుకోలేదు ఏబీఎన్‌. బిగ్‌డిబేట్‌లు నిర్వహిస్తూ వస్తోంది. ప్రభుత్వ పెద్దలను, అధికారులను, విశ్లేషకులను, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చలు నిర్వహిస్తోంది. ప్రభావితమయ్యేవాళ్లను, పరిష్కారాలు చూపించే నిర్ణేతలను ముఖాముఖిగా కూర్చోబెట్టి సమస్యలను, నిర్ణయాలను విశ్లేషిస్తోంది. ఆ ఒరవడిని అలాగే కొనసాగిస్తూ ఉంది. ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణ స్వయంగా ఈ బిగ్‌ డిబేట్‌ నిర్వహిస్తున్నారు.


నేటి యువతే రేపటి దేశ భవిత!

'నేటి యువతే రేపటి దేశ భవిత' అన్న వాస్తవాన్ని చదువుకునే రోజుల నుంచే విద్యార్థులకు గుర్తు చేసింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. యంగిస్థాన్‌ అంటూ యంగ్‌ పీపుల్‌ ఆశలు, ఆశయాలకు పదును పెట్టింది. ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లి.. యువత కర్తవ్యాన్ని గుర్తు చేశారు. వాళ్ల మనసుల్లో ఉన్నతమైన ఆలోచనలు నాటారు. 


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి



ప్రముఖుల అంతరంగాన్ని వడపోత లేకుండా ప్రసారం

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే.. ఈ కార్యక్రమం గురించి తెలియని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో లేదనడంలో అతిశయోక్తి లేదు. అది ప్రసారమయ్యే సమయానికి ఆర్కే నిర్వహించే ఓపెన్‌ హార్ట్‌ కార్యక్రమం కోసం టీవీలను అతుక్కుపోయే వీరాభిమానులను సంపాదించుకుంది. ప్రముఖుల అంతరంగాన్ని, వాళ్ల మనసుల్లోని ఆలోచనలను వడపోత లేకుండా, సెన్సార్‌షిప్‌ లేకుండా ప్రసారం చేసిందీ కార్యక్రమం. ఓపెన్‌ హార్ట్‌లో అస్త్రాల్లా దూసుకెళ్లే ఆర్కే ప్రశ్నలకు ఎదురుగా ఎవరున్నా సరే.. సూటిగా సమాధానం రావాల్సిందే. అసలు విషయం బయటకు తెలియాల్సిందే.


వర్తమాన రాజకీయ పరిణామాలపై సునిశిత విశ్లేషణ

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అంతరాత్మ వేమూరి రాధాకృష్ణ. నిరంతర సమాచార స్రవంతిని నిక్కచ్చిగా ప్రసారం చేస్తూనే.. వారానికోసారి వీకెండ్‌ కామెంట్‌లో రాజకీయ, సామాజిక లోగుట్టును ఆవిష్కరిస్తారు ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ. బయటకు రాని ఎన్నో విషయాలను, ఎన్నెన్నో సంభాషణలను ముక్కుసూటిగా తన కలంతో జాలువారుస్తారు. వర్తమాన రాజకీయ పరిణామాలను సునిశితంగా విశ్లేషిస్తారు. ఎవరి బండారం ఏంటో కుండబద్దలు కొడతారు.


'నీ బడి పిలుస్తోంది' అంటూ.. చిన్ననాటి స్మృతులు

ఏబీఎన్‌ వార్తా స్రవంతిని ప్రజల ముందుకు తేవడమే కాదు.. సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తోంది. వార్తా కథనాలే కాకుండా, ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు రూపొందించి ప్రజలను కూడా భాగస్వాములను చేస్తోంది. 'నీ బడి పిలుస్తోంది' అంటూ.. చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకునేలా చేయడమే కాదు.. ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్లకు.. ఆ చిన్ననాటి పాఠశాల పరిస్థితిని చూపించి అండగా నిలవాలన్న ఆకాంక్షను రేకెత్తించింది. వాళ్ల బాధ్యతలను గుర్తు చేస్తోంది.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2021-10-15T14:45:08+05:30 IST