PKను దెబ్బకొట్టడానికి PK సరికొత్త వ్యూహం.. చిరుకు వైఎస్ జగన్ బంపరాఫర్..!?

Jan 14 2022 @ 14:09PM

ఇంటర్నెట్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. గురువారం నాడు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిన చిరు.. జగన్ నివాసంలోనే లంచ్ చేసిన తర్వాత సుమారు రెండు గంటలపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న ముఖ్యమైన సమస్యలపై నిశితంగా చర్చించారు. అనంతరం మీడియా ముందుకొచ్చిన చిరు.. చాలా ఉత్సాహంగా త్వరలోనే ప్రభుత్వం నుంచి శుభవార్త వస్తుందని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే ఈ భేటీపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న చిరు ఇప్పుడే ఎందుకెళ్లి భేటీ అయ్యారు..? అసలు ఇది సినీ రంగానికి సంబంధించిన భేటీనా.. లేకుంటే రాజకీయంగా ఏదైనా విషయాలపై చర్చించారా..? చిరంజీవికి జగన్ బంపరాఫర్ ఇవ్వబోతున్నారా..? అని చిత్రవిచిత్రాలుగా నెటిజన్లు కామెంట్స్ చేసేస్తున్నారు.

ఎంతవరకు నిజం..!?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. జగన్-చిరు భేటీపై అధికార వైసీపీ నుంచి పెద్ద ఎత్తున లీకులు వస్తున్నాయ్. చిరంజీవికి వైఎస్ జగన్ బంపరాఫర్ ఇవ్వబోతున్నారని.. త్వరలోనే అధిష్టానం నుంచి శుభవార్త ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఏకంగా చిరుకు ‘రాజ్యసభ’ సభ్యత్వం ఇస్తారంటూ అధికార పార్టీనే లీకులిస్తోంది. కొందరు వైసీపీ నేతలు అనుకూల మీడియా నుంచి ఇలా లీకులు చేస్తున్నారు. అయితే దూరమవుతున్న కాపు సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకొనేందుకు వైసీపీ పెద్దలు ఈ కొత్త ఎత్తుగడకు తెరలేపారని తెలియవచ్చింది. ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్నట్టుగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను నైతికంగా దెబ్బతిసేందుకు ఈ ప్రయత్నమని ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

పక్కా పథకం ప్రకారమేనా..!?

అధికారంలోకి రాకముందు కాపు సామాజిక వర్గానికి చెప్పిన హామీలన్నీ.. అధికారంలోకి వచ్చాక నెరవేర్చిందేమీ లేదని గుర్రుతో కాపు నేతలున్నారు. దీంతో ఇప్పటికే ఈ సామాజికవర్గం దాదాపు దూరమైనట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ మధ్యనే ఏపీలోని కాపు కీలక నేతలంతా భేటీ కావడం.. మరోవైపు ఇటీవల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ అప్రమత్తమైందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ వరుస పరిణామాలతో పక్కా పథకం ప్రకారం జగన్-చిరు భేటీ జరిగిందని తెలుస్తోంది. అందుకే సీఎంతో భేటీ అనంతరం పథకం ప్రకారం చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్ వ్యూహంలో భాగంగానే ఈ లీకులు అని రాజకీయ పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూస్తే పీకే (పవన్ కల్యాణ్‌)ను దెబ్బకొట్టడానికి పీకే (ప్రశాంత్ కిశోర్) సరికొత్త వ్యూహం పన్నుతున్నారని గుసగుసలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.

స్పందించలేదేం..!?

కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల వ్యవహారంపై పెద్ద రచ్చే జరుగుతోంది. దీనిపై హీరోలు మొదలుకుని పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు డైరెక్టుగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ కూడా అయ్యారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ.. మంత్రి నాని మధ్య ట్వీట్ వార్ కూడా జరిగింది. ఆ మరుసటి రోజే మంత్రి అపాయిట్మెంట్ ఇవ్వడంతో ఆర్జీవీ వెళ్లి కలిసి చర్చలు జరిపారు. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్‌గా తమ్మారెడ్డి, దర్శకుల సంఘంతో పాటు పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు. అయితే ఇంత జరిగినా చిరంజీవి ఎక్కడా ఒక్కసారిగా కూడా స్పందించలేదు. మాటలతో ప్రయోజనమేంటి అనుకున్నారేమో కానీ డైరెక్టుగానే వెళ్లి సీఎం జగన్‌తో చర్చించారు.

సినిమా కోసమేనా..!?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి-04న రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో దీనిపైనే చిరుకు భేటీ అయ్యారని మరో వర్గం చెబుతోంది. మరోవైపు.. అటు సినిమా పరిశ్రమ, ఇటు చిరంజీవి కుటుంబంలో చీలిక తెచ్చేందుకే వైసీపీ అధిష్టానం పక్కా వ్యూహంతో ఇలా చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే.. వ్యూహాత్మంగానే వైసీపీ ప్రచారం చేస్తోంది. జగన్‌తో భేటీ అనంతరం చిరు చెప్పినట్లుగా శుభవార్త ‘సినిమా’ ఇండస్ట్రీకి ఉంటుందా..? లేకుంటే ‘చిరు’కే శుభవార్త ఉంటుందా..? అసలు ఇన్ని రకాలుగా వస్తున్న ఈ పుకార్లలో ఏది ఎంతవరకు నిజమో.. అబద్దమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.