Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..?

May 24 2021 @ 15:59PM

‘‘వనాటు.. ఆస్ట్రేలియా దగ్గర్లో ఉండే ఈ దేశ ప్రభుత్వానికి కోటిన్నర రూపాయలు డొనేషన్ ఇచ్చేస్తే ఆ దేశ సిటిజన్‌షిప్ ఇచ్చేస్తారు. డ్యూయల్ సిటిజన్ షిప్ ప్రోగ్రామ్స్‌లో ఇదే చాలా ఫాస్టెస్ట్. 45 రోజుల్లోనే పౌరసత్వం ఇచ్చేస్తారు. మాల్టా, మాంటెనీగ్రో, సెయింట్ లూషియా, గ్రెనడా.. ఇలా ప్రపంచంలోని చాలా దేశాలు ఇతర దేశ పౌరులకు డ్యూయల్ సిటిజన్ షిప్ కింద తమ దేశ పౌరసత్వం ఇస్తుంటాయి. ఆయా దేశాల్లో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడమో, లేక సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడమో చేస్తే చాలు. ఏదైనా కంపెనీ పెట్టి ఆ దేశ పౌరుల్లో కొందరికి ఉద్యోగావకాశాలు కల్పించినా కొన్ని దేశాల్లో పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక స్కీములున్నాయి. ఇలా ద్వంద్వ పౌరసత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న పౌరులు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. కానీ, భారత్ మాత్రం ఈ ద్వంద్వ పౌరసత్వానికి ఒప్పుకోదు. ఇదే ఇక్కడ ట్విస్ట్’’.. ఈ మాటలు చెప్పిందెవరో తెలుసా? తెలుగు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తన యూట్యూబ్ చానెల్‌లో ’డ్యూయల్ సిటిజన్‌షిప్’ పేరిట ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశాడు. దీంతో ఈ టాపిక్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

చాలా మంది సెలబ్రెటీలు డ్యూయల్ సిటిజన్ షిప్ సౌలభ్యాన్ని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డ్యూయల్ సిటిజన్‌షిప్ కనుక ఉండి ఉంటే తమకు ఎంతో సౌకర్యంగా ఉండేదని సెలబ్రెటీలు, బడా వ్యాపారవేత్తలు భావిస్తున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే భారత్‌లో మాత్రం డ్యూయల్ సిటిజన్ షిప్‌కు తావే లేదు. విదేశీ పౌరసత్వం తీసుకున్నారంటే వారికి భారతీయ పౌరసత్వం రద్దయిపోతుంది. అంటే, భారత్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టు కాదు. ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు (ఓసీఐ కార్డు)’ను పొందడం ద్వారా భారత్‌లో జీవించవచ్చు. ఈ కార్డు ద్వారా పాక్షిక పౌరసత్వం లభిస్తుంది. అంటే భారత్‌కు వచ్చి పోవడానికి, ఇక్కడే ఉండిపోవడానికి, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకోవడానికి అడ్డంకులు లేకుండా చేస్తుంది. కానీ మన ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఓటు హక్కుకు, అలాగే ఏదైనా ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగం చేయడానికి, ప్రభుత్వ పథకాలను పొందడానికి వీరికి హక్కుండదు.

అభిజిత్ బెనర్జీ అని అందరికీ తెలిసిన ఒక బెంగాలీ. ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ సమయంలో బెనర్జీ తల్లిని కలిసిన ఒక రిపోర్టర్.. ‘బెనర్జీ 2017లోనే అమెరికా పౌరసత్వం తీసుకున్నారు కదా?’ అని ప్రశ్నించారు. దానికి ఆమె చెప్పిన సమాధానమేంటో తెలుసా? ‘‘వాడు ప్రయాణాలు ఎక్కువగా చేస్తాడు’’. డ్యూయల్ సిటిజన్‌షిప్‌కు ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం. ఓ దేశ పాస్‌పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చన్నదాన్ని బట్టి శక్తివంతమైన పాస్‌పోర్ట్ లిస్ట్‌ను ప్రిపేర్ చేస్తుంటారు. ప్రస్తుతం భారతదేశ పాస్‌పోర్టుకు ప్రపంచంలో ఎక్కువ శక్తి లేదు. శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో 2010లో 77వ స్థానంలో ఉన్న మనదేశ పాస్‌పోర్టు.. 2019లో 86వ స్థానానికి పడిపోయింది. అంతేగాక మన దేశం నుంచి అక్రమ వలసలు కూడా ఎక్కువే. అభివృద్ధి చెందిన దేశాలు మన పాస్‌పోర్టుకు ఈజీ యాక్సెస్ ఇప్పుడప్పుడే ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి అక్రమ వలసలు కూడా ఒక కారణం. 


మరి ఎక్కువగా ప్రయాణాలు చేసే వారు ఏం చేయాలి? ఇండియా పాస్‌పోర్టు పెట్టుకొని వీసా కోసం ఎదురు చూస్తూ ఉంటారా? వాళ్లు బెనర్జీ వంటి బిజీ మనుషులైతే? బెనర్జీ కన్నా బాగా అందరికీ తెలిసిన పేరు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ‘నా సినీ కెరీర్లో ఒకానొక దశలో వరుసగా 14 ప్లాఫ్‌లు వచ్చాయి. భారత్‌లో నా సినీ కెరీర్ ముగింపునకు వచ్చేసిందనుకున్నా. ఇక్కడ ఉండి ఏం చేయలేనని ఫిక్సయ్యా. కెనడాలో నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. తనతో మాట్లాడితే కెనడాకు వచ్చెయ్.. అక్కడ కలిసి వర్క్ చేద్దాం అని అన్నాడు. భారత్‌లో ఇక నా పని అయిపోయిందని భావించి కెనడా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించా. ఊహించని రీతిలో నా 15వ సినిమా హిట్టయింది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడనవసరం లేకుండా పోయింది. వరుసగా హిట్లు వచ్చాయి. అయితే అప్పటికే కెనడా పౌరసత్వం మంజూరు చేసింది. దాన్ని మార్చుకోవాలన్న ఆలోచన కూడా చేయనంత బిజీ అయిపోయాను.’ అంటూ అక్షయ్ కుమార్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయినాసరే ఇక్కడ మాత్రం ఆయన్ను చాలా మంది ఇప్పటికీ పరాయి దేశస్థుడు అంటూ ట్రోలింగ్ చేయడం కనిపిస్తూనే ఉంటుంది. వారిలో ఎంత మంది కరోనాతో లాక్‌డౌన్‌ వేసినప్పుడు దేశానికి అండగా నిలబడ్డారు? అక్షయ్ ఒక్కడే పాతిక కోట్లు విరాళం ఇచ్చాడే! మరి ఆయన పౌరసత్వాన్ని ప్రశ్నించిన వారు ఏం చేశారు? అక్షయ్‌, బెనర్జీలే కాదు మనందరికీ బాగా సుపరిచితమైన చాలామంది సినీ తారలకు విదేశీ పౌరసత్వాలు ఉన్నాయి. 

వారిలో రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ అలియా భట్(ఇంగ్లండ్) కూడా ఒకరు. ఆమెతో పాటు కత్రినా కైఫ్(ఇంగ్లండ్), అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్(అమెరికా), జాక్వెలిన్ ఫెర్నాండెజ్(శ్రీలంక), కల్కి కొచ్లిన్(ఫ్రెంచి), సన్నీ లియోన్(యూఎస్-కెనడా), ఫవాద్ ఖాన్ (పాకిస్తాన్), నర్గీస్ ఫక్రి (అమెరికన్), ఎవలీన్ శర్మ(జర్మన్), అమీ జాక్సన్ (ఇంగ్లండ్).. ఇలా ఎందరో బాలీవుడ్ నటులు విదేశీ పౌరసత్వం ఉన్న వాళ్లు భారతీయ వెండితెరపై ఆడిపాడుతున్నారు. వీరందరికీ అభిమానులు కూడా చాలా ఎక్కువే. కానీ రికార్డుల ప్రకారం భారతీయులు మాత్రం కాదు. భారత్‌లో కూడా డ్యూయల్ సిటిజన్ షిప్‌ ఉండి ఉంటే తప్పేంటనేది కొందరు భారతీయుల వాదన.


మన దేశస్థులు భారతీయ పాస్‌పోర్టును వదులుకోవడానికి ఇష్టపడరు. దీనికి ముఖ్యమైన కారణం వారి దేశభక్తి. విదేశీ పౌరసత్వం తీసుకొని భారత పౌరసత్వం వదులుకుంటారా? అంటూ ప్రశ్నలు ఎదురవుతాయి. కానీ వాస్తవానికి ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేస్తూ ఆయా దేశాల్లో ఎక్కువ కాలం గడిపే వారికి మరో ఆప్షన్ ఉండదు. భారత పాస్‌పోర్టుకు శక్తి లేని కారణంగా వాళ్లందరూ రెండో పౌరసత్వం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది భారత జాతీయతపై వ్యతిరేకత కాదు. సింపుల్‌గా చెప్పాలంటే అది వాళ్ల ‘అవసరం’ అంతే. యూకే, యూఎస్ వీసాల కోసం ఫామ్‌లు రాసే ఎవరైనా ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తారు.


ప్రపంచంలో 85 దేశాలు ఇలా ద్వంద్వ పౌరసత్వాలు ఇస్తున్నాయి. అంతెందుకు మన దేశ పౌరులు కూడా 2014 నుంచి 2017 మధ్యలో 4.5 లక్షల మంది విదేశీ పౌరసత్వం తీసుకున్నారు. ఇటీవల ఈ విషయంపై చేసిన సర్వేలో కూడా చాలామంది ఇండియన్ అమెరికన్లు డ్యూల్ సిటిజన్‌షిప్‌కు మద్దతుగా నిలిచారు. అయితే దీనిలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్న బీజేపీ విదేశీ విభాగం నేత విజయ్ చౌతాలా.. భారత్ ఇలా రెండు పౌరసత్వాలను ఒప్పుకోవడం జరగదని తేల్చేశారు. అంటే మిగతా దేశాలకు ఈ సమస్యలు లేవా? అవన్నీ కూడా సమస్యలు అధిగమించే దార్లు వెతుక్కున్నాయంతే. కేవలం అభివృద్ధి చెందిన దేశాలో లేక అభివృద్ధి చెందుతున్న దేశాలో ఇలా డ్యూయల్ సిటిజన్ షిప్ ఇవ్వడం లేదు. రెండు రకాల దేశాలూ ఈ అవకాశం కల్పిస్తున్న జాబితాలో ఉన్నాయి.


ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి ప్రళయంగా మారిందో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చాలా దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. కేవలం తమ దేశపౌరులకు మాత్రమే ఈ ఆంక్షలను సడలించాయి. ఇలాంటి సమయంలో తమకు కూడా డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉండి ఉంటే తాము కూడా విదేశాలకు వెళ్లడానికి తమకు ఎటువంటి అడ్డంకులూ ఉండేవి కావని చాలా మంది సినీ సెలబ్రెటీలు, బడా వ్యాపారవేత్తలు వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.