‘వసుదైక కుటుంబం’లో హిజాబ్ చిచ్చు

ABN , First Publish Date - 2022-02-23T13:19:08+05:30 IST

భారతదేశం ఒక వసుదైక కుటుంబం. ప్రపంచవ్యాప్తంగా ప్రభవించిన సమస్త మతాలకు ఆతిథ్యం, ఆశ్రయం ఇచ్చి సమాదరించిన పుణ్యభూమి.

‘వసుదైక కుటుంబం’లో హిజాబ్ చిచ్చు

భారతదేశం ఒక వసుదైక కుటుంబం. ప్రపంచవ్యాప్తంగా ప్రభవించిన సమస్త మతాలకు ఆతిథ్యం, ఆశ్రయం ఇచ్చి సమాదరించిన పుణ్యభూమి. అందరినీ గౌరవించడం, ఆదరించడం అనేది భారతీయుల స్వతస్సిద్ధ స్వభావం. కనుక మన పుణ్యభూమి ఒక వసుదైక కుటుంబం. భారత రాజ్యాంగం ఈ సమున్నత సంప్రదాయానికి వారసురాలు. సహనంలో భారతదేశం విశ్వగురువు అని విదేశాలలో తన అధికారిక పర్యటనల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే నొక్కి చెబుతుంటారు. భిన్న ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, ధర్మాలు ఉన్న ఈ భారత ధాత్రి నిస్సందేహంగా ఒక వసుదైక కుటుంబం.


వివిధ సంస్కృతులు, ధర్మాలతో విలసిల్లుతున్నా భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ ప్రత్యేకత. ధార్మిక విశ్వాసాలు ప్రజల వ్యక్తిగత వ్యవహారం. అందులో రాజ్య జోక్యం ఉండకూడదు. ధర్మం ఆధారంగా రాజ్యపాలన జరిగిన అనేక ఇస్లామిక్ దేశాలలో ఇప్పుడు ధర్మ రాజకీయాలను త్యజిస్తున్నారు. అనాదిగా అందరిదిగా ఉన్న భారత భూమిని ఇప్పుడు నూతన భారతదేశంగా కొందరికి మాత్రమే పరిమితం చేయాలనే రాజకీయాలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా, ప్రత్యేకించి ఎన్నికల వేళ సృష్టించిందే హిజాబ్ వివాదం.


హిజాబ్ వివాదం ఒక్క కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే కాదు. దాని పరిణామాలు, పర్యవసానాలు దేశవ్యాప్తంగా తమపై ఉంటాయని భారతీయ ముస్లింలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. హిజాబ్ అనేది ఇస్లాంలోని మౌలిక అంశాలలో ఒకటిగా ఉందా లేదా అనేది న్యాయస్థానం విచారిస్తుండడం పట్ల వారిలో ఆందోళన నెలకొని ఉంది. ఒక ధార్మిక విశ్వాసంలో భాగంగా సదరు విశ్వాసులు ఆచరించే ఆ సంప్రదాయం ధర్మ నిర్దేశమూ, ఐచ్ఛికమూ అనే వాస్తవం ఇతరులకు ఇబ్బంది కల్గించనంత వరకు న్యాయస్థానాల పరధిలోకి రాకపోవచ్చు. హిజాబ్ ధరించమని ఒత్తిడి చేయడం వేరు, స్వచ్ఛందంగా ధరిస్తున్న వారికి అడ్డంకులు సృష్టించడం వేరు.


భారత్‌తో సహా 192 దేశాలు పాల్గొంటున్న దుబాయి ‘ఎక్స్ పో–2022’లో నిర్వహించిన ఒక సంగీత కచ్చేరిలో భారతీయ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ కుమార్తె ఖతీజా, మరో 50 మంది మధ్యప్రాచ్య, అరబ్బు దేశాల కళాకారిణిలు పాల్గొన్నారు. విశేషమేమిటంటే ఖతీజా మినహా మిగిలిన వారెవరూ కూడా బురఖా గానీ, హిజాబ్ గానీ ధరించలేదు. అరబ్ గాయనీమణులు ఎవరూ ధరించకపోవడం, మన ఖతీజా మాత్రమే బురఖా ధరించడం వారి వారి ఇష్టాలు. సంగీత దిగ్గజం రెహమాన్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా మరో కుమార్తె రహీమా హిజాబ్ గానీ బురఖా గానీ ధరించదు. ఖతీజా మాత్రమే పూర్తిస్థాయిలో బురఖాను కళ్ళు మినహా నిండుగా ధరిస్తుంది. ధరించడం, ధరించకపోవడమనేది వారి వారి వ్యక్తిగత అభిరుచి మేరకు జరుగుతుంది. ఇందులో రాజ్యానికి పాత్ర ఉండకూడదు. సౌదీ అరేబియాలోని ఏకైక మహిళా మంత్రి సదా నిండు బురఖాలో ఉంటారు. 


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన తొమ్మిది మంది మహిళా మంత్రులలో ఎనిమిది మంది బురఖా, హిజాబ్ రెండూ ధరిస్తుండగా, ఒకరు మాత్రం బురఖా ధరించి హిజాబ్ ధరించరు. బహ్రెయిన్‌లోని విదేశాంగ శాఖ కార్యదర్శి అయిన మహిళాధికారి రెండూ ధరించరు. ఇటీవలి కాలంలో ప్రధానమంత్రులుగా చరిత్ర కెక్కిన ముస్లిం మహిళలు- బేనజీర్ భుట్టో (పాకిస్థాన్), తాన్సు సిల్లర్ (టర్కీ)- ఇరువురూ కూడా బురఖా, హిజాబ్ రెండూ ధరించలేదు. అదే విధంగా, ఉత్తర భారతావనిలో హిందూ మహిళలు ఘంఘట్ ధరిస్తుండగా దక్షిణాదిలో ఆ పద్ధతి లేదు. ఆ మాటకు వస్తే, తెలుగునాట మహిళా శాసనసభ్యులు రెడ్డి శాంతి, రోజా చీర కట్టు తీరుల్లో వైవిధ్యం ఉంది. ఇతరులకు సమస్య కానంత వరకు ఎవరి ఇష్టాలు వారివి. వాటిపై ఆంక్షలు విధించాలనుకోవడం వాంఛనీయం కాదు.


బంగ్లాదేశ్, ఇండోనేసియాలలో ముస్లిం మహిళలు సౌందర్య అలంకరణలో భాగంగా నుదుటపై బొట్టు పెట్టుకుంటారు. భారత్‌లో ముస్లిం మహిళలు ఎవరూ బొట్టు పెట్టుకోరు. హిందూ మిశ్రమ సంస్కృతి కారణాన భారత్‌లో వివాహిత ముస్లిం మహిళలు మంగళసూత్రం తరహాలో లచ్ఛాను విధిగా ధరిస్తారు. ఇతర దేశాలలో ఇటువంటి సంప్రదాయం లేదు. గల్ఫ్ దేశాలలో ఉన్న హిజాబ్, బురఖా విధానం పొరుగున ఉన్న ఈజిప్టు మొదలైన అరబ్బు దేశాల తీరుకు భిన్నంగా ఉంటుంది. ఏసుక్రీస్తు జన్మించిన నేలపై ఉన్న క్రైస్తవ సంస్కృతి యూరోప్‌లో కంటే వేరుగా ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్, డెన్మార్క్‌లలో హిజాబ్‌పై నిషేధం ఉందని చెబుతున్న వారు అమెరికా, బ్రిటన్‌లలో లేదని గుర్తించాలి. అయినా, పరాయి దేశంలోని పద్ధతులు మనకు మార్గదర్శకం కాకూడదు. అనుకరుణ వద్దు. మన దేశం మనది.


హిజాబ్ వివాదం కర్ణాటక పొలిమేరలే కాదు దేశ సరిహద్దులూ దాటింది. దీనిపై బహ్రెయిన్ పార్లమెంటులో చర్చ జరిగింది. అమెరికాతో సహా కొన్ని దేశాలు తమ ఆక్షేపణలు తెలియజేశాయి. కువైత్‌లోని భారతీయ ఎంబసీ ఎదురుగా అరబ్బు మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇరాన్‌లోని భారతీయ ఎంబసీ ఎదుట ఇరానీయులు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో కన్నడ విద్యార్థిని ముస్కాన్ ఖాన్ చిత్రాలు ప్రముఖంగా కనిపించాయి. ఒక్క భారతీయ ముస్లింలనే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజాన్ని కదిలించిన సాహసి ముస్కాన్ ఖాన్. హిజాబ్ ధారణలో తనకు కళాశాలలో తొంభై శాతం మంది తోటి హిందూ విద్యార్థులు మద్దతు ఇస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సంఘీభావమే మన సమున్నత భారతీయ సంస్కృతి, సంస్కారానికి ప్రతీక. అది వసుదైక కుటుంబానికి స్ఫూర్తి. పాలనా దక్షతను కాకుండా మతాన్ని తమ రాజకీయ లక్ష్య సాధనకు ఉపయోగించుకోవడం వల్లే భిన్నత్వంలో ఏకత్వం, వసుదైక కుటుంబ స్ఫూర్తికి తూట్లు పడుతున్నాయి.


మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-02-23T13:19:08+05:30 IST