కంపుకొడుతున్న Hussain Sagar భారీగా పేరుకున్న బ్లూఅల్గే!

ABN , First Publish Date - 2022-03-12T17:52:53+05:30 IST

కంపుకొడుతున్న Hussain Sagar భారీగా పేరుకున్న బ్లూఅల్గే!

కంపుకొడుతున్న Hussain Sagar భారీగా పేరుకున్న బ్లూఅల్గే!

హైదరాబాద్‌ సిటీ : హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో సాగర్‌కు వచ్చే సందర్శకులు దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు సైతం ముక్కు మూసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. నీటిపై పేరుకున్న చెత్త తొలగింపు చర్యలు ఎప్పటికప్పుడు సాగడం లేదు. దీంతో జలాలపై పెద్దఎత్తున బ్లూఅల్గే చేరి, దాని వల్ల దుర్వాసనతో పాటు, ఇతర వ్యాధులు అలుముకునే ప్రమాదముందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నగరంలో ఎండలు తీవ్రమవుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్నాయి. దీంతో సాగర్‌ జలాలపై పెద్దఎత్తున బ్లూఅల్గే పేరుకుపోతోంది. నీటిపై తేలాడే తేలికైన పదార్థం కావడంతో బ్లూ అల్గే ఎక్కడ పైకి వచ్చినా ఒడ్డునకు చేరుతోంది. ఎన్టీఆర్‌ మార్గ్‌, బుద్ధ పూర్ణిమా ఆఫీసు వైపు, బోట్స్‌ క్లబ్‌, నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌ మార్గంలో బ్లూఅల్గే భారీగా పేరుకుపోయింది. దీంతో ఆయా పరిసర ప్రాంతాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. సాయంకాలం హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చే సందర్శకులు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగర్‌ నీటిపై తేలాడే చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించడానికి ప్రత్యేకంగా ట్రాష్‌ కలెక్టర్లున్నాయి. అయినా బ్లూ అల్గే తొలగింపు చర్యలు లేవు. దుర్వాసనను అరికట్టడంతో పాటు, సాగర్‌ జలాల్లో ఆక్సిజన్‌ స్థాయిలను పెంచేందుకు బయోరిమిడేషన్‌ చర్యలను ఇప్పటికీ ప్రారంభించలేదు. ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-03-12T17:52:53+05:30 IST