ఒకటి, రెండు రెండు కాదు.. ఏకంగా 260 విల్లాల ‘మల్లంపేట’ కథ కంచికేనా..?

ABN , First Publish Date - 2022-05-27T15:06:32+05:30 IST

ఒకటి, రెండు రెండు కాదు.. ఏకంగా 260 విల్లాలను అనుమతులు లేకుండా నిర్మించిన మల్లంపేట కథ కంచికి చేరింది..

ఒకటి, రెండు రెండు కాదు.. ఏకంగా 260 విల్లాల ‘మల్లంపేట’ కథ కంచికేనా..?

  • సీజ్‌ చేశారు.. కేసులు పెట్టారు
  • తదుపరి చర్యలకు వెనుకడుగు
  • చక్రం తిప్పిన అధికార పలుకుబడి 
  • ఫపలు శాఖల నివేదికలు బుట్టదాఖలు

హైదరాబాద్‌ సిటీ : ఒకటి, రెండు రెండు కాదు.. ఏకంగా 260 విల్లాలను అనుమతులు లేకుండా నిర్మించిన మల్లంపేట కథ కంచికి చేరింది. ఆరు నెలల క్రితం నగర శివారులోని దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో అక్రమంగా నిర్మించిన విల్లాలను మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో సీజ్‌ చేసిన అధికారులు తదుపరి చర్యలకు వెనుకడుగు వేశారు. సంబంధిత డెవలపర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. అక్రమ విల్లాలు వెలుగు చూసిన సందర్భంలో సీడీఎంఏ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీసు ఇలా అన్ని శాఖలూ పేజీలకు పేజీలు నివేదికలు సిద్ధం చేశాయి. కానీ, అదృశ్యశక్తుల అధికార పలుకుబడి ముందు తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019 కూడా అమలుగాకపోవడం గమనార్హం.


మల్లంపేట్‌ గ్రామంలోని 170 సర్వేనెంబర్‌లో శ్రీనివాస లక్ష్మీ కన్‌స్ట్రక్షన్‌ నిర్మించిన అనుమతుల్లేని 260 విల్లాల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆరు నెలల క్రితం కలెక్టర్‌ ఆదేశాలతో వంద విల్లాలను సీజ్‌ చేయగా, మరో వంద విల్లాలను వదిలేశారు. కానీ, వాటిని కూడా సీజ్‌ కిందే పరిగణించారు. కానీ విల్లాలు, చెరువు బఫర్‌జోన్‌లో నిర్మిస్తున్న విల్లాల పనులు దర్జాగా కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ ఆదేశాల అనంతరం వారం నుంచి పది రోజుల పాటు అధికార యంత్రాంగం హడావిడి చేసినా తర్వాత ఏ శాఖ అధికారులూ అటువైపు కన్నెత్తి చూసింది లేదు. ఆయా శాఖల నివేదికలు బుట్టదాఖలయ్యాయి.


కేసును నీరుగార్చే యత్నం..

మల్లంపేటలో 260 విల్లాలు అనుమతుల్లేకుండా నిర్మించారని, మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారం విరుద్ధమని తగిన చర్యలు తీసుకోవాలని ఆరు నెలల క్రితం దుండిగల్‌ మున్సిపల్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత డెవలపర్‌ విదేశాల్లో ఉన్నారని పోలీసులు పట్టన్నట్లుగా వ్యవహరించార ని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ డెవలపర్‌ హైదరాబాద్‌లోనే మకాం వేశారు. మల్లంపేట పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు. ఇటీవల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పలు రిజిస్ర్టేషన్లు కూడా చేయించారు. కానీ విదేశాల్లో ఉన్న సందర్భంలో పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేయలేదు. నగరానికి చేరిన డెవలపర్‌పై తదుపరి చర్యలు చేపట్టలేదు. కేసు మొత్తం నీరుగార్చే విధంగా పోలీసులు వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.


ఉన్నతాధికారులపై ఒత్తిడి

మల్లంపేట ఎపిసోడ్‌ తర్వాత మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలపై గుర్తించేందుకు పెద్దఎత్తున సర్వే చేపట్టారు. 600చ.మీటర్ల విస్తీర్ణానికి మించిన భవనాలను గుర్తించి కూల్చివేతకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను హెచ్‌ఎండీఏ రంగంలోకి దించింది. శివారు మున్సిపాలిటీలో సుమారు 208 వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ మల్లంపేటలో నిర్మించిన విల్లాలపై చర్యలు తీసుకోలేదు. సీజ్‌ చేసిన విల్లాల జోలికి కూడా వెళ్లలేదు. అయితే 260 అక్రమ విల్లాలపై చర్యలకు ఉపక్రమించేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు అదేస్థాయిలో వెనక్కి తగ్గడానికి అధికార పలుకుబడి ప్రభావితం చేసినట్లు స్థానికంగా ఆరోపణలున్నాయి. 

Updated Date - 2022-05-27T15:06:32+05:30 IST