గల్ఫ్‌ గోస.. గాలికి!

ABN , First Publish Date - 2021-03-22T16:50:02+05:30 IST

దశాబ్దాల కాలం నుంచి స్థానికంగా ఉపాధి కరువై తమ పేదరికాన్ని అధిగమించేందుకు గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతున్న జిల్లావాసుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మా రుతోంది. ఓ వైపు గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలు, మరోవైపు ఎడారి దేశాల్లో అమలవుతున్న ఆర్థిక పరమైన కార్మిక చట్టాలు వలస కార్మికుల బతుకులను ..

గల్ఫ్‌ గోస.. గాలికి!

ఎన్‌ఆర్‌ఐ పాలసీపై కనికరించని సర్కారు 

రూ.500 కోట్ల డిమాండ్‌పై స్పందన కరువు 

కేరళ తరహా పాలసీపై పట్టింపు లేని ప్రభుత్వం

బుట్టదాఖలవుతున్న సర్కారు హామీలు 

ఎన్నికల ప్రచారానికే పరిమితమవుతున్న ‘ఎడారి’ సంక్షేమం

ఆగమవుతున్న వలస కార్మికుల జీవితాలు 


నిర్మల్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): దశాబ్దాల కాలం నుంచి స్థానికంగా ఉపాధి కరువై తమ పేదరికాన్ని అధిగమించేందుకు గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతున్న జిల్లావాసుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మా రుతోంది. ఓ వైపు గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలు, మరోవైపు ఎడారి దేశాల్లో అమలవుతున్న ఆర్థిక పరమైన కార్మిక చట్టాలు వలస కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయి. జిల్లాకు చెందిన దాదాపు 40వేలకు మందికి పైగా గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం బతుకుతున్నారు. ఏళ్ల నుంచి వారంతా గల్ఫ్‌ దేశాలైనా సౌదీ అరేబియా, దుబాయ్‌, మస్కట్‌, ఓమన్‌, కత్తర్‌, షార్జా, ఇరాన్‌, ఇరాక్‌ లాంటి దేశాలకు ఉపాధి కోసం వలసలు వెళ్లారు. ఇప్పటికీ ప్రతిరోజూ ఇక్కడి నుంచి చాలా మంది నిరుద్యోగ గ్రామీణ యువకులు గల్ఫ్‌ దేశాలకు వెళుతూనే ఉన్నారు. ఇలా వెళుతున్న వారిలో ఏజెంట్ల మోసాలకు బలవుతున్న వారి సంఖ్య కూడా రెట్టింపవుతోంది. విజిట్‌ వీసాల పేరిట నిరక్ష్యరాస్యులైనా అమాయకులను లక్ష్యంగా చేసుకొని ఏజెంట్లు వారిని గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం పంపుతున్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి ఉపాధి వీసా పేరు చెబుతూ రూ.2లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన వారు తాము విజిట్‌ వీసాల పై గల్ఫ్‌ దేశానికి వచ్చామని తెలుసుకునే లోపు వారి పుణ్యకాలం పూర్తయిపోతోంది. చేసిన అప్పులు తీర్చేందుకు ఎలాగైనా గల్ఫ్‌ దేశాల్లోనే ఉండి ఉపాధి పొందాలని పట్టుబట్టి అక్కడే కల్లివిల్లి పేరిట ఉండిపోతున్నారు. 


గల్ఫ్‌ దేశాల కఠిన చట్టాల కారణంగా ఇలా తప్పుడు పద్ధతిలో అక్కడే ఉండిపోయిన చాలా మంది ఇప్పటికీ జైళ్లలో మగ్గిపోతున్నారు. ఇలా ఎంతో మంది గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి వేట కోసం అనేక రకాల ఇబ్బం దులకు గురవుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో మరణించిన వారి శవాలను కూడా ఇక్కడికి రప్పించేందుకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. అక్క డి యాజమాన్యాల మోసాలకు సైతం వందలాది మంది బలి పశువులు అవుతున్నారు. ఉద్యోగభద్రత లేక, తక్కువ వేతనాలకే మండుటెండలో వెట్టిచాకిరి చేస్తున్నారు. చాలా మంది అనారోగ్యంతో, మరికొంతమంది అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు ప్రభు త్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చిం ది. ప్రతీసారి ఎన్నికల సమయంలోనూ పోటీ చేసే అభ్యర్థులు తాము గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తుండడం రివాజు గా మారింది. 


అయితే ఎన్నికల తరువాత ఆ హామీ ఇప్పటికీ బుట్టదాఖలవుతూనే ఉంది. ఇటీవల కార్మికుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ప్రభుత్వం కేరళ తరహా గల్ఫ్‌ పాలసీని అమలు చేసే దిశగా యో చిస్తామని వెల్లడించింది. దీంతో పాటు పలు గల్ఫ్‌ కార్మిక సంక్షేమ సం ఘాలు సైతం బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు కోసం నిధులు కేటాయించాలని కోరాయి. అయితే ప్రభుత్వం మాత్రం గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. చివరకు కేరళ తరహా పాలసీ అమలుపై కూడా నోరు మెదపకపోవడం ఇక్కడి వేలాది మంది గల్ఫ్‌ కార్మికుల కుటుంబాలను తీవ్ర నిరాశకు గురి చేసిం ది. గత కొంతకాలం నుంచి ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలని, గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్లను కేటాయించాలని కేంద్ర ప్రభు త్వం గల్ఫ్‌ దేశాల రాయబారులతో చర్చలు జరిపి, అక్కడి చట్టాల వల్ల కలుగుతున్న అనార్థాలను తొలగించాలని ఉద్యమాలు సైతం మొదలయ్యా యి. అయినప్పటికీ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించకపోవడం, కనీసం వారి ఊసేత్తకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 



ఎన్నో ఏళ్ల నుంచి అదే గోస

చాలా ఏళ్ల నుంచి గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించిన మాదిరిగా గల్ఫ్‌ ఏజెంట్లు ఎక్కువ వేతనాల ఆశ చూపి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నాయి. తక్కువ పని, ఎక్కువ వేతనం, సౌకర్యవంతమైన జీవితం అంటూ ఆశలు చూపి అమాయక గ్రామీణులను బుట్ట లో వేసుకుంటున్నాయి. జిల్లాలో ప్రతీ గ్రామం నుంచి కనీసం వంద మం ది వరకైనా గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. అయితే గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపే వారంతా నిరక్ష్యరాస్యులు, అమాయకులు కావడంతో కొంతమంది ఏజెం ట్లు దీనిని అనుకూలంగా మలుచుకొని విజిట్‌ వీసాలు అంటగడుతున్నా రు. విజిట్‌ వీసాలకు కూడా వీరి నుంచి పెద్దమొత్తంలోనే డబ్బులు గుం జుతున్నారు. కనీసం రూ.2లక్షల వరకు ఈ వీసాల కోసం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ ఏజెంట్లు ఈ దందాను దర్జాగా సాగిస్తున్నారు.


 వీసాల కోసం పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వీరు గ్రామా ల్లో కొంతమంది దళారులను సైతం నియమించుకుంటున్నారు. వీరికి పెద్దమొత్తంలో కమిషన్‌లు చెల్లిస్తూ అమాయకులను టార్గెట్‌ చేస్తున్నా రు. ఎక్కువ వేతనాల ఆశతో గల్ఫ్‌ దేశాలకు వెళుతున్న అమాయకులు అక్కడి పరిస్థితులను చూసి లబోదిబోమంటున్నారు. 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలో వీరంతా రాత్రింబవళ్లు అతి తక్కువ వేతనాలకే శ్రమిస్తున్నారు. యాజమాన్యాల మొండి వైఖరితో తక్కువ వేతనాలు పొందుతూ చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు. అలాగే ఒక్కో గదిలో పది మందికి పైగా గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సరైన వైద్యం అందక ఎందరో మంది ప్రాణాలు వదులుతున్నారు. దీంతో పాటు పని ఒత్తిడితో మానసిక కుంగుబాటుకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 


ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను సొంత గ్రామానికి రప్పించడం అటు కుటుంబ సభ్యులకు, ఇటు యంత్రాంగానికి కత్తిమీద సాములా మారుతోంది. అనేక నిబంధనల కారణంగా శవాల తరలింపు సైతం కష్టంగా మారింది. కొందరి శవాలు నెలల తరబడి అక్కడే ఉండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులను చూసి గల్ఫ్‌ కార్మికుల కుటుంబ సభ్యులంతా తల్లడిల్లిపోతున్నారు. కేవలం చేసిన అప్పులను తీర్చేందుకే వారంతా గల్ఫ్‌ దేశాల్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా ఏళ్ల నుంచి అష్టకష్టాలు పడుతున్న గల్ఫ్‌ కార్మికుల జీవితాలను తెలుసుకుంటూ వారు సైతం మళ్లీ ఆ దేశాలకు వెళ్లేందుకు మోజు పడుతుండడం శాపంగా మారుతోంది. 



మారిన చట్టాలతో తగ్గిన వేతనాలు

మొన్నటి వరకు కొన్ని దేశాల్లోని వివిధ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికుల కు మంచి వేతనాలే ఉండేవంటున్నారు. ఇటీవల కొన్ని దేశాల్లో వేతనాల కు సంబంధించి కార్మిక చట్టాలను సవరించారు. అయితే, మారిన చట్టాల సవరణ కు అనుగుణంగా ఒక్కసారి భారతదేశానికి చెందిన వలస కార్మికుల వేతనాలు 60-70 శాతానికి పైగా తగ్గిపోయాయి. గల్ఫ్‌ దేశాల్లోని ఆర్థిక సంక్షోభ పరిస్థితులతో పాటు స్థానికులకు ఎక్కువ మొత్తంలో ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో వేతనాల తగ్గింపు నిర్ణయాన్ని అక్కడి దేశాలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. మారిన ఈ చట్టాల కారణంగా చాలా మంది నిర్మల్‌కు చెందిన గల్ఫ్‌ కార్మికులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. వీరు మంచి వేతనాల కోసం గల్ఫ్‌ దేశాలకు అప్పులు చేసి వెళ్లగా.. ఒక్కసారిగా వేతనాలు కుప్పకూలిపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న ఆందోళనకు గురవుతున్నారు. అయితే వేతనాల తగ్గింపు వ్యవహారంపై దేశ విదేశాంగ శాఖ అక్కడి దేశాలతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని వారు వాపోతున్నా రు. అయితే ప్రభుత్వం తీవ్రస్థాయి లో చర్చలు, సంప్రదింపులు జరిపితే గల్ఫ్‌ దేశాలు వేతనాల పెంపు విషయమై మెట్టు దిగే అవకాశం ఉంటుం దని భావిస్తున్నారు. 


హామీగానే ఎన్‌ఆర్‌ఐ, కేరళ పాలసీ

వందలాది మంది గల్ఫ్‌ కార్మికులు అక్కడి ఎక్కువ వేతనాలతో దేశానికి పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నందున వారి సంక్షేమం కోసం సర్కారు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ఉధృతమవుతోంది. దీనికోసం ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలన్న ఆందోళన మొదలైంది. కొంతకాలం నుంచి కేరళ వారి రాష్ర్టానికి చెందిన గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని అమలు చేస్తోంది. ఈ పాలసీ కారణంగా కేరళాకు చెందిన గల్ఫ్‌ కార్మికులకు అనేక రకాల ప్రయోజనాలతో పాటు ఉద్యోగ భద్రత, అధిక వేతనాలు దక్కువుతున్నాయి. అయితే రాష్ట్రంలోనూ ఎన్‌ఆర్‌ఐ పాలసీ  అమలు చేయాలని వీలైతే కేరళ తరహా పాలసీని కూడా అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. 


ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు కోసం గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక, గల్ప్‌ కార్మికుల సంక్షేమ సమితి లాంటి సంస్థలు ఇప్పటికే ఆందోళనలతో పాటు సర్కారుపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి. అయితే ఈసారి బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఐ పాలసీపైనా గాని, కేరళ తరహా విధానంపైనా గాని ప్రభుత్వం ప్రకటన చేయడమే కాకుండా దానికి సంబంధించిన నిధులను సైతం కేటాయించవచ్చని గల్ఫ్‌ కార్మికులు ఆశించారు. గల్ఫ్‌ కార్మికులు ఎక్కువగా నివసించే నిర్మల్‌తో పాటు జగిత్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన  అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడి బాధిత కుటుంబాలకు హామీలు సైతం ఇచ్చారు. దీంతో ఈసారి బడ్జెట్‌లో ఎలాగైనా గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ప్రస్థావన రావచ్చని ఆశించారు. అయితే ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై బడ్జెట్‌లో ఎక్కడ కూడా ప్రస్థావించని కారణంగా కార్మికులతో పాటు వారి కుటుంబాలన్ని తీవ్ర నిరాశకు గురయ్యాయి.


Updated Date - 2021-03-22T16:50:02+05:30 IST